బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో మద్యం సీసాలను ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానం రావడంతో పోలీసులు ఓ నవ వధువు అత్తారింటి వద్ద హల్చల్ చేశారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా పెళ్లి కూతురు బెడ్ రూమ్ కి వెళ్లి మద్యం సీసాలకోసం వెతికారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
వివరాలలోకి వెళితే.. హజీపూర్ నగరంలోని హత్సార్‌గంజ్ ప్రాంతంలో నివసించే షీలాదేవి కొడుకుకు ఇటీవలే పూజా కుమారితో వివాహమైంది. ఐదు రోజుల క్రితమే పూజా అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఇక రెండు రోజుల క్రితం పోలీసులు పూజా కోసం ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా సోదాలు ప్రారంభించారు. డైరెక్ట్ గా పూజా బెడ్ రూమ్ లోకి వెళ్లి మద్యం సీసాల కోసం వెతకడం ప్రారంభించారు. ఇక ఈ తతంగమంతా చూసినా అత్త షీలా దేవి కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా కనికరించని పోలీసులు ఇల్లు మొత్తాన్ని సెర్చ్ చేసి ఏమి లేవని వెళ్లిపోయారు.
ఇక ఈ ఘటనపై పూజా మాట్లాడుతూ” పోలీసులు ఎంతో దారుణంగా ప్రవర్తించారు. మా ఇంట్లో ఏ ఒక్కరికి మద్యం అలవాటు లేదు.. ఎవరో కావాలని చెప్పినట్లు నా బెడ్ రూమ్ లో వెతికారు.. ఈ ఘటన వలన మా ఇంటి పరువు పోయింది.. దీనికి ఎవరు సమాధానం చెప్తారు” అని వాపోయింది. ఇక ఈ ఘటనపై పోలీసులను అడుగగా వారు మాట్లాడడానికి ఇష్టపడకపోవడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన బీహార్ లో ఇది రెండోదని.. గతంలో కూడా ఓ నవ వధువు ఇంటికి ఇలాగే పోలీసులు వచ్చి సెర్చ్ చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు .