Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థినిపై, మరో స్టూడెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడితో ఆమెకు మూడు నెలల పరిచయం ఉంది. కాలేజీలో ఇద్దరూ కూడా ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు.
Read Also: H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడికి షాక్.. కొలంబియా కోర్టులో కొత్త H-1B వీసా రుసుముపై దావా
అక్టోబర్ 10న జీవన్ లంచ్ బ్రేక్ సమయంలో విద్యార్థిని చాలా సార్లు ఫోన్ చేశాడు. తనను ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్ద కలవాలని కోరాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను కలిసిన సమయంలో బలవంతంగా ముద్దు పెట్టుకుని, పురుషుల వాష్‌రూంలోకి ఈడ్చుకెళ్లి తలుపు లాక్ చేసి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
బాధితురాలు అఘాయిత్యం తర్వాత అక్కడ నుంచి పారిపోయి, తన స్నేహితులకు, తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అక్టోబర్ 15న సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం తర్వాత, నిందితులు ఆమెకు ఫోన్ చేసి ‘‘పిల్ కావాలా’’ అని అడిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారినట్లు చెప్పారు. అయితే, ఫోరెన్సిక్ టీం డిజిటల్, ఫిజికల్ ఆధారాలను విశ్లేషిస్తున్నాయి.
