Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్‌ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని సబియాల్ రెహమాన్(40)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్క్రాప్ డీలర్. రహిమా, తన భర్త సబియాల్‌ని జూన్ 26న హత్య చేసింది.
Read Also: Odisha Student: లైంగిక వేధింపుల కారణంగా, నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
పోలీసుల విచరణ ప్రకారం.. తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఇంటికి వచ్చిన తర్వాత తనపై శారీరక దాడి చేశాడని, ఆ సమయంలోనే హత్య జరిగిందని రహిమా చెప్పింది. హత్య తర్వాత ఇంట్లోనే దాదాపు 5 అడుగుల లోతు గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ జంటకు దాదాపు 15 ఏళ్ల క్రితం వివాహమైంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రెహమాన్ చాలా రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వ్యక్తం చేశారు. ముందుగా తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని చెప్పింది. ఆ తర్వాత మాట మార్చి అతను అనారోగ్యంతో ఉన్నాడని, ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్‌బరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొడవ తర్వాత తన భర్త చనిపోయినట్లు చెప్పింది. అయితే,ఈ కేసులో ఒక మహిళ ఇంత పెద్ద గొయ్యి తవ్వే అవకాశం లేదని, మరెవరైనా సాయం చేశారా అనే దానిపై విచారణ చేస్తున్నట్లు డీసీపీ పద్మనవ్ బారువా తెలిపారు.