Shocking Crimes: డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. దొపిడీ..దొంగతనాలు చేయడమే కాకుండా అవసరమైతే చంపేసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అంతే కాదు కొంత మంది ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొత్త తరహా మార్గాలు వెతుకుతున్నారు. ఏకంగా బీమా చేయించి.. వ్యక్తిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కొట్టేసేందుకు ప్లాన్ చేశారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి నెల్లూరు జిల్లా, ఖమ్మం జిల్లాల్లో జరిగిన రెండు ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.
READ ALSO: HYD PUJARIKI JAIL: జైల్లో పూజారి..
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లిలో రమణారెడ్డి అనే వ్యక్తిని ఫిబ్రవరి 13న దారుణంగా చంపేశారు. ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించిన పోలీసులకు.. అక్కడ క్రైమ్ సీన్‌లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ రమణా రెడ్డి చేతి వేలికి ఉన్న అర సవర ఉంగరం మిస్ అయింది. దీంతో చిల్లకూరు SI సురేష్ బాబు దర్యాప్తు ప్రారంభించారు. ఫిబ్రవరి 13న హత్య జరిగిన తర్వాత బంగారు షాప్స్‌లో ఉంగరాన్ని తాకట్టు పెట్టిన వివరాలను సేకరించారు.. అదే సమయంలో మృతుడు రమణారెడ్డితో సన్నిహితంగా ఉండే వారి లిస్ట్ బయటికి తీశారు పోలీసులు. ఈ సమయంలో పలువురు మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నెలబల్లి రెట్టపల్లికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అలియాస్ ఎర్రొడును పోలీసులు అనుమానించారు. ఆటో నడుపుతూ… పందులు మేపుతూ.. శ్రీనివాసులు జీవనం సాగిస్తూ ఉంటాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా రమణారెడ్డి చేతికి ఉన్న ఉంగరాన్ని కాజెయ్యాలని మృతుని గమనిస్తూ ఉన్నాడనే విషయాన్ని గ్రహించారు. ఈ నెల 13న రమణారెడ్డి గేదెలు మేపుకునేందుకు జామాయిల్ తోటకు వెళ్లాడు. అతన్ని అనుకరిస్తూ అక్కడికి వెళ్లాడు శ్రీనివాసులు. పక్కనే ఉన్న కర్రతో రమణారెడ్డి తలపై గట్టిగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వేలికున్న పచ్చరాయి ఉంగరాన్ని శ్రీనివాసులు ఎత్తుకు వెళ్లిపోయాడు. దాన్ని బంగారు దుకాణంలో 30 వేలకు తాకట్టు పెట్టాడు. అన్ని ఆధారాలు సేకరించిన చిల్లకూరు పోలీసులు భూదానం బస్ షెల్టర్ వద్ద ఉండగా అతని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు ఒకే గ్రామంలో ఉంటూ.. సన్నిహితంగా మెలిగిన శ్రీనివాసులు రమణారెడ్డిని ఉంగరం కోసం హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. బంగారు ధరలు భారీగా పెరిగిపోవడంతో.. మృతుని వద్ద ఉన్న ఉంగరాన్ని చోరీ చేస్తే.. అప్పులు తీరుతాయని.. జల్సాల కోసం వినియోగించుకోవచ్చని శ్రీనివాసులు ఈ హత్యకు పాల్పడినట్లు సిఐ శేఖర్ బాబు తెలిపారు. మరోవైపు రూ. కోటి బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథకం వేశారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ వారి వ్యూహం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్‌కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మేనమామ ములిశెట్టి శ్రీనివాసరావు సంరక్షణలో ఉన్నాడు. ఆరు నెలల క్రితం వరకు యశ్వంత్ సారపాకలోని ఐటీసీ పేపర్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్‌తో ఆరునెలలుగా స్నేహం చేస్తూ అతని వ్యక్తిగత పనులకు సహాయకుడిగా ఉంటున్నాడు. భద్రాచలానికి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ కొండ భానుప్రకాశ్ కూడా వీరితో జత కలిశాడు. భానుప్రకాశ్, యశ్వంత్ మధ్య బంధుత్వం కూడా ఉంది. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సాయిదీపక్, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఉన్న భానుప్రకాశ్ కలిసి తల్లిదండ్రులు లేని యశ్వంత్‌ను హతమారిస్తే బీమా సొమ్ము దక్కించుకోవచ్చని ప్రణాళిక వేసుకున్నారు. కులాలు వేరైనా యశ్వంత్ ఇంటిపేరు, సాయిదీపక్ ఇంటి పేరు ఒకటే కావడం వీరికి కలిసొచ్చింది. ఇందులో భాగంగా 4 నెలల క్రితం యశ్వంత్ పేరిట ప్రీమియం చెల్లించి రూ.కోటి బీమా చేయించారు. ఇంటి పేరు ఒకటే కావడంతో కట్టా సాయిదీపక్‌కు సోదరుడిగా పేర్కొంటూ యువకుడికి బీమా చేయించారు. నామినీగా సాయిదీపక్ పేరు నమోదు చేయించారు.
అంతా ఓకే అనుకున్న తర్వాత తాము రూపొందించుకున్న ప్లాన్ అమలు చేశారు. భద్రాచలంలో యశ్వంత్‌కు ఓ స్కూటీ ఇప్పించి మద్యం తీసుకుని సారపాకకు సమీపంలోని మోతె పట్టీనగర్‌కు రమ్మన్నారు. సాయిదీపక్, భానుప్రకాశ్ కారులో ముందుగా చేరుకున్నారు. యశ్వంత్ వచ్చాక సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో రోడ్డు పక్కన మద్యం తాగి బీరు బాటిల్లతో యశ్వంత్ తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డుపై పడుకోబెట్టారు. కొంతదూరంలో ఆయన వేసుకొచ్చిన స్కూటీని పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకం వేశారు. కానీ అటుగా వస్తున్నవారు రక్తం మడుగులో ఉన్న యశ్వంత్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
తమ ప్లాన్ బెడిసికొడుతుందని భావించిన కేటుగాళ్లు.. ఏమి తెలియనట్లు అక్కడ జనం ముందు నటించారు. గాయపడింది తమకు తెలిసిన వ్యక్తేనని వారిని నమ్మించారు. ఆపై భద్రాచలం నుంచి అంబులెన్సు రప్పించి యశ్వంత్‌ను ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు యశ్వంత్‌ను గుంటూరులోని ఓ ఆస్పత్రికి అక్కడి నుంచి తిరిగి భద్రాచలం.. ఆపై ఖమ్మం తరలించారు. ప్రస్తుతం యశ్వంత్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఐతే అక్కడ ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి.. సాయి దీపక్, భాను ప్రకాష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కోటి రూపాయల బీమా సొమ్ము కోసమే హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కూటి కొరకు కోటి విద్యలు అన్నారు. కానీ నేటి సమాజంలో సులువుగా డబ్బు సంపాదించడం కోసం కోటి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని ఈ రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.
