Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!

Cyber Crime

Cyber Crime

Cyber Fraud: రాజధాని అమరావతి రైతులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న వార్షిక కౌలు డబ్బులను కాజేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రైతుల బ్యాంకు ఖాతాలనే లక్ష్యంగా చేసుకుని సైబర్ దొంగలు పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఫేక్ ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు.. రైతు కౌలు డబ్బులు మాయం
తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళా రైతు బ్యాంకు ఖాతా నుంచి కౌలు డబ్బులు మాయమయ్యాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిచి, రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ఘటనతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సైబర్ మోసాల వెనుక ఉత్తరప్రదేశ్‌లో మకాం వేసిన ముఠా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటి ద్వారా రైతుల కౌలు డబ్బులను మళ్లిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ముఠా మరికొందరు రైతులను కూడా లక్ష్యంగా చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరికొందరు రైతుల ఖాతాల్లోనూ నగదు మాయం!
కోటేశ్వరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే తరహాలో మరికొందరు రాజధాని రైతుల బ్యాంకు ఖాతాల్లోనూ నగదు మాయమైనట్లు సమాచారం రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ మోసాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసు ఐటీ నిపుణులు రంగంలోకి దిగారు. జధాని రైతులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, నకిలీ ఆధార్ కార్డులు, నగదు బదిలీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐటీ నిపుణుల సహకారంతో సైబర్ నేరగాళ్ల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల కౌలు డబ్బులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.