సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించింది.
ఆమె నిజమైన ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాకుండా ఆన్‌లైన్‌లో దొరికిన నెంబర్‌కు 2 సార్లు ఫోన్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.9 లక్షలు మాయం చేశారు. దీంతో లబోదిబోమంటూ బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను అశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నెంబర్లపై అప్రమత్తంగా మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.
