Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది. నరబలికి పాల్పడిన సవతి తల్లితో పాటు నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో 4 ఏళ్ల బాలుడు సత్యేంద్ర శవమై కనిపించాడు. ఆదివారం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన తర్వాత సత్యేంద్ర తిరిగి రాలేదు. అతని తండ్రి జితేంద్ర ప్రజాపతి కొడుకు కనిపించడం లేదని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్ర సత్యేంద్ర మృతదేహం చెరువులో కనిపించింది.
Read Also: Prabhas Dubbing: ప్రభాస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ విలన్.. ఎవరో తెలుసా?
అయితే తన భార్య రేణుపై అనుమానం వ్యక్తం చేశాడు ప్రజాపతి. దీంతో విచారణ చేయగా మొత్తం నరబలి వ్యవహారం బయటకు వచ్చిందని అమేథి ఎస్పీ ఎలమారన్ జి తెలిపారు. భార్య రేణుతో పాటు ఆమె తండ్రి మంగ్రుప్రజాతి, తల్లి ప్రేమాదేవి, క్షుద్రపూజారి దయారావ్ యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో మంగ్రు, ప్రేమాదేవి అసలు కారణాన్ని చెప్పారు. ఏడాదిన్నర క్రితం తమ కుమార్తె రేణుకు జితేంద్రతో వివాహం జరిపించామని, మొదటి భార్య జితేంద్రను విడిచివెళ్లిపోవడంతో తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేశామని తెలిపారు. పిల్లాడు సత్యేంద్ర మొదటి భార్య కుమారుడని పోలీసులు తెలిపారు. అయితే రేణు జితేంద్రతో వివాహం తర్వాత అనారోగ్యంతో, గర్భస్రావంతో బాధపడుతోందని, ఆమె సమస్యపై క్షుద్రపూజారి దయారామ్ యాదవ్ సంప్రదిస్తే.. రేణు గర్భం దాల్చాలంటే జితేంద్ర మొదటి బిడ్డను బలివ్వాలని చెప్పాడని అందుకే పిల్లాడిని చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. క్షుద్రపూజలు జరిగిన ప్రదేశంలో నిమ్మకాయలు, టవల్, జాజికాయలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య నేరం ఫైల్ చేశారు.