ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులంతా మలయాళ చిత్రసీమపై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో తేజా సజ్జా వరకూ మలయాళ చిత్రాలు రీమేక్ చేయడమే దానికి కారణం. థాట్ ప్రొవోకింగ్ మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు సైతం ఇప్పుడు ఇష్టపడుతున్నారని మన దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో మలయాళ సినిమాలు అనేకం డబ్ అయ్యి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. వాటికి లభించిన ఆదరణే ఈ నమ్మకానికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే… తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ అనే మలయాళ సినిమా మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ యేడాది జనవరి 14న నీస్ట్రీమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోనూ లభ్యమౌతోంది.
కేరళలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువతికి స్కూల్ టీచర్ తో పెళ్ళవుతుంది. మ్యారేజ్ కు ముందు డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలని, డాన్స్ టీచర్ కావాలని ఆ అమ్మాయి కలలు కుంటుంది. కానీ పెద్దలు కుదిర్చిన సంబంధానికి తలొగ్గి పెళ్ళి చేసుకున్నాక, ఆమె కలలన్నీ కల్లలు అవుతాయి. భర్తకు, మావగారికి ముప్పూటలా వండి పెట్టడమే ఆమె జీవితంగా మారిపోతోంది. ఇంటిపని మొత్తం ఆమె ఒక్కతే చేసుకోవాలి. అంతేకాదు… వంటలు చేసేప్పుడు మిక్సీ, గ్రైండర్ వంటివి వాడకూడదు, రుబ్బురోలే ఉపయోగించాలి. దొడ్డు బియ్యాన్ని ప్రెజర్ కుక్కర్ మీద పెట్టకూడదు, కట్టెల పొయ్యిమీదే వండాలి. బట్టలను వాషింగ్ మిషన్ లో ఉతక కూడదు, చేత్తో బండకేసి బాది మాత్రమే ఉతకాలి. ఆ నవ వధువుకు ఇలాంటి ఆంక్షలు లక్షా తొంభై ఉంటాయి! వీటికి అదనంగా రాత్రి అయితే భర్తగారి మరో ఆకలీ తీర్చాలి! కష్టాన్ని కడుపులోనే దాచుకుని, పంటి బిగువున భరిస్తూ, ఏదో చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేస్తానంటే భర్త, మావ ససేమిరా అంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’కు ఓ నమస్కారం పెట్టి, అందులోంచి ఎలా బయట పడిందన్నదే ఈ సినిమా కథ.
‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ అనే టైటిల్ చూడగానే… అద్భుతమైన వంటకాలను తెలియచేసే సినిమానేమో అనే భావన కలుగుతుంది. పైగా మలయాళ చిత్రం కావడంతో కేరళ రుచులను తెలుసుకోవచ్చనే కోరికా కలుగుతుంది. కానీ ఇది వంటలకు సంబంధించిన సినిమా కాదు… వంటగదికి సంబంధించిన సినిమా! మరీ ముఖ్యంగా దశాబ్దాల తరబడి కిచెన్ కే పరిమితమైన మధ్య తరగతి మహిళల మనోవేదన. పెళ్ళి చేసుకున్న యువతికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయని, వాటిని నెరవేర్చడం భర్త కనీస బాధ్యత అని తెలియచెప్పే చిత్రం. నిజానికి ఈ తరహా సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. కానీ రెండు గంటల సినిమా చూసి, అయ్యో అని కాసేపు ఓదార్పు మాటలు మాట్లాడి మామూలు స్థితికి వచ్చే పురుషులకు ఇలాంటి సినిమాలను మళ్ళీ మళ్ళీ చూపించాలని దర్శకుడు జియో బేబీ భావించినట్టున్నాడు. అందుకే తరాలు మారినా, దానికి తగ్గటుగా పురుషులలో కొంత మార్పు వచ్చినా… మళ్ళీ మరోసారి మహిళల కష్టాలను తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. వంటింటి కుందేలుగా మారిన ప్రతి మహిళా ఈ సినిమా చూసి, కొంతలో కొంత ఓదార్పును పొందుతుంది. ‘నేను ఇలా చేయలేకపోతున్నాను కదా’ అని కాస్త బాధా పడుతుంది! ఆమె బాధను భర్తలు అర్థం చేసుకుంటే దర్శకుడి ప్రయత్నం కొంతైన ఫలించినట్టే.
ఇదంతా ఒకే! మహిళలను వెనకేసుకొస్తూ, జియో బేజీ తీసిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ ఎందుకు చర్చనీయాంశం అయ్యిందనేదీ తెలుసుకోవాలి. ఓ పక్క మహిళలను సపోర్ట్ చేసిన దర్శకుడు, ‘మగాళ్ళలో ఇసుమంత మార్పు కూడా రాదు… వాళ్ళు మారరు. వాళ్ళ తోలు మందం’ అనే తరహాలో హీరో క్యారెక్టరైజేషన్ ను పెట్టడంతో కొంతమంది మగాళ్ళు హర్ట్ అయ్యారు. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం రావాల్సిన సినిమాను ఇప్పుడు తీశారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇప్పుడు మగాళ్ళలో చాలా మార్పు వచ్చిందని, భార్యకు సహకరిస్తున్నారని కూనిరాగాలు తీస్తున్నారు.
నిజానికి వివాదాస్పదం అయ్యింది ఈ అంశం కూడా కాదు. ఈ సినిమాలో దర్శకుడు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ద్వితీయార్థంలో ప్రధానాంశంగా చూపించాడు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే తప్పేంటీ? అని ప్రశ్నించిన ఓ ఫెమినిస్టు ఇంటిపై మతతత్త్వ వాదులు దాడి చేయడం, దానిని కథానాయిక బలపరచడం చూపించాడు. అలానే అయ్యప్ప మాల వేసుకున్న భక్తులపై కథానాయిక ఆగ్రహం ప్రకటించడం చూపించాడు. ఇలాంటి సున్నితమైన అంశాలను దర్శకుడు మహిళా సాధికారికత పేరుతో చూపిస్తూ, తమ ధర్మాన్ని అవమాన పరిచాడని కొందరు ఆగ్రహిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ మూవీ మేకింగ్ వెనుక పొలిటికల్ ఎజెండాలు ఉన్నాయని భావించిన లోకల్ టీవీలు దీనిని ప్రసారం చేయలేమని చెప్పేశాయి. శబరిమల వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారనే వంకతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిరాకరించాయి. దాంతో లోకల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో ఇది జనవరిలో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను విశేషంగా ఆదరిచడంతో ఏప్రిల్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ సైతం స్ట్రీమింగ్ చేస్తోంది.
ఇందులో భార్యాభర్తలుగా నిమీషా సజయన్, సూరజ్ వెంజరమూడు నటించారు. నిమీషా ఉత్తమ నటిగా కేరళ అవార్డు అందుకున్న నటి, ఆ పాత్రలో జీవించేసింది. ఇక సూరజ్ జాతీయ స్థాయిలో అవార్డును పొందిన నటుడు. అతనూ శాడిస్టు భర్త పాత్రలో ఇమిడిపోయాడు. మామ గారి పాత్రను టి. సురేశ్ బాబు సహజ సిద్ధంగా పోషించాడు. సూరజ్ ఎస్ కురుప్ బాణీలు సమకూర్చగా, మాథ్యూస్ పులికన్ నేపథ్య సంగీతం అందించాడు. సలూ కే థామస్ కెమెరా… కేరళ అందాలనే కాదు… ఓ గృహిణి ధర్మాగ్రహాన్ని సైతం బాగా కాప్చర్ చేసింది.
మరో విశేషం ఏమంటే… ఈ మలయాళ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. దానినే తెలుగులోనూ డబ్ చేస్తారని అంటున్నారు. హీరోహీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్, ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కణ్ణన్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న రాహుల్ రవీంద్రన్ ఇందులో సాఫ్ట్ గా కనిపించే సాడిస్ట్ భర్త పాత్రకు ఎంతవరకూ న్యాయం చేకూర్చుతాడో చూడాలి. ఐశ్వర్యా రాజేష్ కైతే ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్! అందులో సందేహమే లేదు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఎంపిక చేసుకున్న అంశం
దర్శకుడి పనితనం
మైనెస్ పాయింట్స్
వన్ సైడ్ గా కథను రాసుకోవడం
వివాదాస్పద అంశాలు డీల్ చేయడం
స్లో నెరేషన్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్ : మహిళలకు తీపి! మగాళ్ళకు చేదు!!