రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.
కథ విషయానికి వస్తే… తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఎస్. ఆర్. కళ్యాణ మండపాన్ని నిర్వహించడానికి ధర్మ (సాయికుమార్) నానా తంటాలు పడుతుంటాడు. మ్యారేజ్ హాల్ ను బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో మానసికంగా కృంగిపోతాడు. చివరకు తాగుడుకు బానిసైపోతాడు. అతని కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) సిటీ లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. తన ఊరికే చెందిన క్లాస్ మేట్ సింధు (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమలో పడతాడు. ఆమెకు మాత్రం కళ్యాణ్ అంటే ఎలాంటి ప్రేమ ఉండదు. ఆర్ధిక పరమైన ఒడిదుడుకుల కారణంగా తాకట్టులో ఉన్న ఎస్. ఆర్. కళ్యాణ మండపాన్ని ధర్మ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చదువును పక్కన పెట్టి, తన స్నేహితులతో కలిసి కళ్యాణ్ సొంత వూరుకి వచ్చి కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. మరి ఎస్. ఆర్. కళ్యాణ మండపానికి కళ్యాణ్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడా? తనంటే పడని సింధు మనసును ఎలా గెలుచుకున్నాడు? తండ్రీ కొడుకులైన ధర్మా, కళ్యాణ్ మధ్య ఎందుకు మాటలు లేవు? వీటన్నింటికీ సినిమా ద్వితీయార్థంలో సమాధానం దొరుకుతుంది.
‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కథ టైటిల్ కు తగ్గట్టుగా కళ్యాణ మండపం చుట్టూనే తిరుగుతుంది. ఇవాళ పాత కళ్యాణ మండపాలను, సినిమా థియేటర్లను నిర్వహించడం తలకు మించిన భారంగా మారింది. ఆధునిక వసతులు కల్పించకుండా, పాత పోకడలు పట్టుకుని వేళ్లాడితే వాటి మనుగడ కష్టమే. అదే ఈ సినిమాలోనూ చూపించారు. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన కళ్యాణ మండపం నిర్వహణను పట్టించుకోని అసమర్థ కొడుకు, ఆయన చేతకాని తనాన్ని గుర్తించి, ఆ బాధ్యతను భుజానకెత్తుకున్న మనవడి కథ ఇది. యువతను ఆకట్టుకోవడం కోసం దానికి ప్రేమకథను మిళితం చేశారు. కథ కొంత సిటీలోనూ, మరికొంత గ్రామంలోనూ సాగుతుంది. సెంటిమెంట్ పుష్కలంగా ఉన్న ఈ కథలో దాన్ని పండించడంలో దర్శకుడు శ్రీధర్ గాదె విఫలమయ్యాడు. కళ్యాణ మండపంకు అసలు ఎందుకు బుకింగ్స్ రావడం లేదనే దానికి బలమైన కారణం ఏదీ చూపించలేదు. రిన్నోవేట్ చేసిన కళ్యాణ మండపంలో ఒక్క పెళ్ళి చేస్తే చాలు దాని దశ తిరిగిపోతుందని హీరో భావించడం కూడా సమంజసంగా లేదు. ఇక హీరోయిన్ విలన్ కూతురే కావడం, అతను గతంలో హీరో తండ్రి నుండి ఆర్థిక సాయం పొంది పెద్దవాడు కావడం… ఇవన్నీ రొట్టకొట్టుడు కథలే. కళ్యాణ మండపం రిజిస్టర్ లో ఒక్కసారి పేరు రాసిన తర్వాత, ఆ పెళ్ళి ఎలాగైనా జరగాల్సిందే అనే సెంటిమెంట్ కూడా పెద్దంత పండలేదు. హీరో స్నేహితులు, వారి మధ్య రాసుకున్న సీన్స్ సైతం రొటీన్ గా ఉన్నాయి. తండ్రి వైఫల్యానికి కారణం ఏమిటో తెలిసి కూడా కొడుకు మాట్లాడకపోవడంలో ఔచిత్యం ఏదీ కనిపించదు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్స్ ను కూడా ప్రేక్షకులను కదిలించలేవు.
నటీనటుల విషయానికి వస్తే… కిరణ్ అబ్బవరంలో మంచి ఈజ్ ఉంది. కాలేజ్ స్టూడెంట్ పాత్రలో హుషారుగా నటించాడు. డాన్స్, ఫైట్స్ బాగానే చేశాడు. హీరో తల్లిదండ్రులుగా తులసీ, సాయికుమార్ ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. మరీ ముఖ్యంగా వారి మధ్య సాగే గొడవలు, అలకలు అత్యంత సహజంగా ఉన్నాయి. సింధుగా ప్రియాంక జవాల్కర్ ఫర్వాలేదు. కాలేజీ సీన్స్ లో అందంగా ఉంది, డాన్స్ బాగానే చేసింది. కానీ సినిమా మొత్తంలో ఒక్కో చోట ఒక్కోలా కనిపించింది. బహుశా షూటింగ్ దాదాపు యేడాది పాటు సాగటం దానికి కారణమేమో! కాలేజీ ప్రిన్సిపాల్ గా భరణి కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలిలో మెప్పించారు. ప్రతినాయకుడు పాపారావు పాత్రలో ఎప్పటిలానే శ్రీకాంత్ అయ్యంగార్ డ్రామా ఆర్టిస్టులను గుర్తు చేశారు. ఇతర పాత్రలను అనిల్ జీలా, అరుణ్ కుమార్, కశ్యప్ శ్రీనివాస్, ఎ. రాజశేఖర్ తదితరులు పోషించారు.
ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు హీరో కిరణ్ అబ్బవరం సమకూర్చడం విశేషం. పెళ్ళి, దాని ప్రాముఖ్యత గురించి హీరో కాలేజీలో తోటి విద్యార్థులకు చెప్పే సన్నివేశం బాగుంది. ఇక భాస్కరభట్ల రాసిన ‘సిగ్గెందుకురా మామా’ పాట మాస్ ను ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటల సాహిత్యం బాగుంది. చేతన్ భరద్వాజ సంగీతం మూవీకి చాలా ప్లస్ అయ్యింది. శంకర్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే మూవీ మేకింగ్ వాల్యూస్ ఆశించిన స్థాయిలో లేవు. కథను మరింత ఆకట్టుకునేలా తయారు చేసుకుని, చక్కటి ప్లానింగ్ తో తీసి ఉంటే బెటర్ మూవీగా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ నిలిచేది.
కిరణ్ అబ్బవరం మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ విడుదల కాగానే వరుసగా నాలుగైదు చిత్రాలలో అవకాశం రావడం ఓ రకంగా అతనికి అదృష్టమే. ఈ ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ విడుదలకు ముందే ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు సెట్స్ మీదకు వచ్చాయి. కోడి రామకృష్ణ కుమార్తె దివ్య సైతం కిరణ్ తో ఓ మూవీని నిర్మించబోతున్నారు. ఈ చిత్రాలన్నీ అతని కెరీర్ కు బలమైన పునాది వేస్తాయని భావించొచ్చు. రాబోయే రోజుల్లో కిరణ్ అబ్బవరం నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే సంగీతం
పోరాట సన్నివేశాలు
మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ, కథనం
పేలవమైన సెంటిమెంట్ సీన్స్
ట్యాగ్ లైన్: కళ్యాణ మండపంలో సెంటిమెంట్!