అచ్చ తెలుగు ఓటీటీ ఆహా అనువాద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలను తెలుగులో అనువదించి, డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఇప్పుడీ ఓటీటీలో శుక్రవారం నుండి తమిళ రీమేక్ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘సేనాపతి’. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య కీలక పాత్రలు పోషించారు. గతంలో సుస్మిత, విష్ణు ప్రసాద్ తొలి యత్నంగా నిర్మించిన ‘షూట్ అవుట్ ఎట్ ఆలేర్’ వెబ్ సీరీస్ జీ 5లో విడుదల కాగా, ఇప్పుడీ సినిమాను వీరు ఆహాలో స్ట్రీమింగ్ చేయడం విశేషం.
కృష్ణ (నరేశ్ అగస్త్య) ఓ అనాథ. చేయని నేరానికి బాల నేరస్థుల గృహానికి వెళతాడు. అక్కడి వార్డెన్ (చిన్ని కృష్ణ) ప్రోద్భలంతో చక్కగా చదువుకుని పోలీసు అవుతాడు. ఐపీఎస్ కావాలన్నది అతని లక్ష్యం. అయితే ఓసారి క్రిమినల్ ను వెంటాడే సమయంలో అతని సర్వీస్ రివాల్వర్ పోతుంది. అలాంటి సర్వీస్ రివాల్వర్స్ చీకటి సామాజ్యంలో ఎలా చేతులు మారతాయి? వాటి ద్వారా వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? ఒకవేళ అది సామాన్యుల చేతిలోకి చేరితే దానిని తిరిగి పొందడం ఎంత కష్టం? ఇలా రివాల్వర్ ను బ్లాక్ మార్కెట్ లో కొన్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) అందులోని ఎనిమిది బుల్లెట్లను ఎప్పుడు? ఎందుకు? ఎలా ఉపయోగించాడు? అనేదే ‘సేనాపతి’ కథ.
తమిళంలో నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘8 తుట్టక్కల్’కు ఇది రీమేక్. ఈ క్రైమ్ థిల్లర్ మూవీని అప్పట్లోనే కన్నడలోకి రీమేక్ చేశారు. తెలుగులోకి కాస్తంత ఆలస్యంగా వచ్చింది. అంతే! అక్కడ నాజర్ పోషించిన పాత్రను ఇక్కడ రాజేంద్రప్రసాద్ చేశారు. అలానే ‘మత్తు వదలరా’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య కృష్ణ పాత్ర పోషించాడు. అతని పైఅధికారి పురుషోత్తమ్ గా సత్యప్రకాశ్, కొలిగ్ దాసుగా కేశవ్ దీపక్, టీవీ ఛానెల్ రిపోర్టర్, ప్రియురాలు సత్యగా జ్ఞానేశ్వరి కాండ్రేగుల, పోలీస్ అధికారి పరంజ్యోతిగా హర్షవర్థన్, కృష్ణమూర్తి టీమ్ మెంబర్స్ హుస్సేన్ గా రాకేందు మౌళి, రాజుగా జోష్ రవి, బబ్లూ యాదవ్ గా జీవన్, అతని భార్యగా పావని రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీని తీసిన పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిందంటే కాస్తంత ఆశ్చర్యకలుగుతుంది. అయితే ఇలాంటి రేసీ థ్రిల్లర్ మూవీస్ ను కూడా తాను డీల్ చేయగలనని పవన్ నిరూపించుకున్నాడు. నటీనటులతో రాజేంద్ర ప్రసాద్ చివరి అరగంట తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకునే వాడిగా నరేశ్ అగస్త్య కూడా ఆ పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆ పాత్రను ఇంకాస్తంత లైవ్లీగా చేసి ఉండాల్సింది. ఈ సినిమాకు ఆకట్టుకునే మాటలు సైతం రాసిన నటుడు రాకేందు మౌళి, హర్షవర్థన్, ‘జోష్’ రవి ఆ పాత్రలలో చక్కగా ఇమిడిపోయారు. ప్రతి మనిషిలోనూ ఓ గ్రే షేడ్ ఉంటుందని, అది ఎప్పుడు ఎలా బయట పడుతుందో చెప్పలేమని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు. వ్యవస్థని నమ్ముకున్న వ్యక్తులు సైతం ఒకానొక సమయంలో దానిపై తిరుగుబాటు చేసే ఆస్కారం లేకపోలేదని దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ పాత్ర ద్వారా నిరూపించాడు.
కానీ అతని జీవితంలోని ఎత్తుపల్లాలను, అతను తీసుకున్న నిర్ణయాలను ప్రేక్షకులు సానుభూతితో చూసేలా దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. అలానే హీరో లక్ష్యం నుండి సినిమా రకరకాల మలుపులు తిరగడం, ఎక్కడో మొదలై ఎక్కడో ముగియడం, హీరో ప్రేమాయాణంలో ఏర్పడిన పదనిసలు ఇవన్నీ మెయిన్ థీమ్ ను డైల్యూట్ చేసేశాయి. నిజానికి ఇది కృష్ణమూర్తి కథ. కానీ సత్య స్టోరీని దానితో ముడిపెట్టడం, అతనితోనే సినిమాను ప్రారంభించడం, అక్కడ నుండి కృష్ణమూర్తి చేతిలోకి అన్ని పాత్రలు వెళ్ళిపోవడంతో ప్రేక్షకులకు కొంత కన్ ఫ్యూజన్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. సత్య పాత్ర నుండి ఫోకస్ ను కృష్ణమూర్తి పాత్ర మీద మార్చడం ఠక్కున జరిగే పనికాదు… స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే ‘సేనాపతి’ నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభతో మరో స్థాయికి చేరుకుని ఉండేది. అయితే ప్రతి పాత్రకు ఓ ముగింపును ఇవ్వడం అభినందించదగ్గది. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, వివేక్ కాలెపు సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ ను బాగా క్యారీ చేశాయి. ఓటీటీ మూవీనే కదా! అనే భావన లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ను క్వాలిటీతో చిత్రీకరించారు. నిజానికి ఇలాంటి జానర్స్ కు ఓటీటీనే కరెక్ట్. శుక్రవారం నుండి ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చిన ‘సేనాపతి’ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది రాజేంద్ర ప్రసాద్ కు తొలి ఓటీటీ సినిమా కావడం మరో విశేషం.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
రాజేంద్ర ప్రసాద్ నటన
శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
కన్వెన్సింగ్ గా లేని సన్నివేశాలు
ఆకట్టుకోని కథనం
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: 8 తూటాల కథ!