మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం.
విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు. అక్రమ ఆయుధాలను సప్లయ్ చేసే ఓ వ్యక్తిని ఇంటరాగేషన్ చేసినప్పుడు పదిహేనేళ్ళుగా కోమాలో ఉన్న మాజీ నక్సలైట్ గురు నారాయణ (పశుపతి) స్పృహలోకి వచ్చాడనే విషయం తెలుస్తుంది. దాంతో గతంలో పోలీస్ అధికారిగా చేసి, ప్రస్తుతం రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఉన్న చక్రవర్తి (సాయికుమార్) ప్రాణాలకు ముప్పు ఉందనే విషయం ఎన్.ఐ.ఎ. అధికారి మహేంద్ర (తనికెళ్ళ భరణి) గ్రహిస్తాడు. దాంతో హోం మినిస్టర్ ను సేవ్ చేసే సీక్రెట్ ఎసైన్ మెంట్ ను విక్రమ్ కు ఇస్తాడు. ఆ పనిలో ఉండగానే విక్రమ్ హోమ్ మినిస్టర్ కూతురు కాంతి (తాన్యా రవిచంద్రన్)తో ప్రేమలో పడతాడు. హోమ్ మినిస్టర్ ను నిజంగానే మాజీ నక్సలైట్ టార్గెట్ చేశాడా? ఎన్.ఐ.ఎ. ఏజెంట్ విక్రమ్ దాన్ని ఆపగలిగాడా? విక్రమ్, కాంతి మధ్య చిగురించి ప్రేమ సఫలమైందా? అనేది మిగతా కథ.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ కీలక పదవుల్లో ఉండేవారికి నక్సలైట్ల నుండి, ఉగ్రవాదుల నుండి ముప్పు వాటిల్లడం అనేది ఎన్నో సినిమాల్లో మనం చూశాం. వాటిని పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ ఎలా ఛేదిస్తారో కూడా తెలుసుకున్నాం. ఇది కూడా అదే తరహాలో సాగే మరో సినిమా. అంతే! అంతకు మించి ఆసక్తిని కలిగించే అంశాలు కానీ ఉత్కంఠను రేపే సన్నివేశాలు కానీ మనకు కనిపించవు. పరమ రొటీన్ కథను, పరమ రొటీన్ పంథాలో దర్శకుడు శ్రీ సరిపల్లి తెరకెక్కించాడు. ఇక పోలీసుల్లో ఉండే బ్లాక్ షీప్స్ గురించి కూడా చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులో ఆ వ్యక్తి ఎవరు అనేది కాస్తంత ఆలస్యంగా రివీల్ అవుతుంది. అంతే తేడా! అయితే ఆ తర్వాత గానీ, దానికి ముందుగానీ ప్రేక్షకుల ఊహకు అందకుండా ఏ సన్నివేశం ఉండదు. ఈ సినిమాలో హీరోను ఉద్దేశించి భరణి ‘నువ్వు తెలివైన వాడివి అనుకునేంతలోనే ఎంత వెధవ్వో గుర్తు చేస్తావ్’ అనే మాట ఒకటి అంటాడు. మరీ సీరియస్ గా తీసుకోకపోతే, కార్తికేయ విషయంలో అదే జరుగుతోందనిపిస్తోంది. ‘ఆర్.ఎస్. 100’ తర్వాత అతను ఎంపిక చేసుకున్న కథలన్నీ ఆలోచనా రాహిత్యంతో అంగీకరించనవే అనిపిస్తోంది. ఇక ఈ యేడాది మార్చిలో వచ్చిన ‘చావు కబురు చల్లగా’ అయితే అందుకు పరాకాష్ట. దానితో పోల్చితే మాత్రం ‘రాజా విక్రమార్క’ బెటర్ మూవీ!
నటీనటుల విషయానికి వస్తే, ఎన్.ఐ.ఎ. ఏజెంట్ విక్రమ్ పాత్రలో కార్తికేయ చక్కగా ఫిట్ అయ్యాడు. అతని ఫిజిక్ అందుకు సరిగ్గా సరిపోయింది. తాన్యా రవిచంద్రన్ చక్కటి డాన్సర్ మాత్రమే కాదు, నటిగానూ చక్కని హావభావాలు పలికించింది. ఎన్.ఐ.ఎ. అధికారిగా భరణి, హోమ్ మినిస్టర్ గా సాయికుమార్ బాగానే చేశారు. భరణి తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతోనూ, పంచ్ డైలాగ్స్ తోనూ ఆకట్టుకున్నాడు. నక్సలైట్ పాత్ర కోసం తమిళనాడు నుండి పశుపతిని తీసుకొచ్చి ఉపయోగం లేకపోయింది. ఆ పాత్రకోసం అంతోటి నటుడు అవసరమా అనిపించింది. ఇక ముద్దు కృష్ణగా హర్షవర్థన్ నటన ప్రేక్షకులకు బోలెడంత రిలీఫ్ ను ఇచ్చింది. (ఇవాళే విడుదలైన ‘పుష్పక విమానం’లోనూ హర్షవర్థన్ కీలక పాత్ర పోషించాడు). దర్శకుడు చిన్ని కృష్ణ సినిమా ప్రారంభంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సుధాకర్ కొమాకుల. అతను పోషించిన పోలీస్ అధికారి పాత్రకు తగ్గ ఫిజిక్ లేకపోయినా, క్లయిమాక్స్ లో తన నటనతో మెప్పించాడు. హీరో పాత్రల కోసం తాపత్రయపడకుండా కొమాకులు సుధాకర్ ఇలాంటివి చేస్తే బెటర్.
ప్రశాంత్ కె. విహారి సంగీతం, పి.సి. మౌళి సినిమాటోగ్రఫీ బాగున్నాయి. చిత్రనిర్మాణంలోకి తొలిసారి అడుగుపెట్టిన ఆదిరెడ్డి, 88 రామ రెడ్డి ఎక్కడా రాజీ పలేదు. సుబ్బు – నభ; పృథ్వీ శేఖర్ స్టంట్ కొరియోగ్రఫీ బాగుంది. అయితే కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ‘రాజా విక్రమార్క’ ఏ స్థాయిలోనూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కేవలం యాక్షన్ మూవీస్ ను ఇష్టపడేవారికి ఇది ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
యాక్షన్ సన్నివేశాలు
మైనెస్ పాయింట్స్
రొట్టకొట్టుడు కథ, కథనం
ఊహాకందే క్లయిమాక్స్
రేటింగ్ : 2.25 / 5
ట్యాగ్ లైన్: రొటీన్ విక్రమార్క!