స్ర్టీమింగ్: జీ 5
విడుదల తేదీ: 19-11-2021
నటీనటులు: సంగీత్ శోభన్, నరేశ్, తులసి, సిమ్రాన్ శర్మ, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను,
నిర్మాత: నీహారిక కొణిదెల
కెమెరామేన్: ఎదురోలు రాజు
సంగీతం: పి.కె. దండి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: మహేశ్ ఉప్పాల
మధ్యతరగతి కుటుంబాలు అప్పు తీసుకుని తిరిగి వాయిదాలు చెల్లించటంలో ఎలాంటి ఇబ్బందులు పడతారనే కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సీరీస్ ఇది. దానికి తల్లి,తండ్రి, బామ్మ, ఓ యువకుడుతో కూడిన చిన్న ఫ్యామిలీ నేపథ్యంతో చక్కగా అల్లుకున్న కథ. తండ్రి చనిపోవడంతో అప్పటి వరకూ బాధ్యతలు లేకుండా తిరిగిన ఓ యువకుడు తండ్రి చేసిన భారీ అప్పును తీర్చటానికి ఎలాంటి ఇబ్బందులు పడతాడనే అంశానికి లవ్ స్టోరీని జోడించి తీసిన ఈ సీరీస్ కి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం…
చిన్న కుటుంబానికి చెందిన హరిదాస్ (నరేశ్), రుక్మిణి (తులసి)కి కొడుకు మహేశ్ (సంగీత్ శోభన్) అంటే ఎంతో ప్రాణం. అయితే తల్లిదండ్రుల ప్రేమ మహేశ్ ను సోమరిని చేస్తుంది. చదువు అబ్బక బాధ్యత లేని యువకుడిగా పెరుగుతాడు. కష్టపడకుండానే అన్నీ తన దగ్గరకి వస్తాయని నమ్ముతుంటాడు. అయితే అనుకోకుండా హరిదాస్ ఓ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. మరణించే ముందు అతడు 25 లక్షలు లోన్ తీసుకుంటాడు. అది దేనికోసం తీసుకుంటాడు, ఏం చేశాడు అన్నది కుటుంబ సభ్యలకు తెలియదు. ఆ రుణాన్ని తీర్చే బాధ్యత కొడుకుగా మహేశ్ పై పడుతుంది. ఇతగాడేమో తమ వీధికి ఆవలివైపు ఉండే కీర్తి (సిమ్రాన్ శర్మ) ని ఇష్టపడుతూ తండ్రి అప్పును లైట్ తీసుకుంటాడు. చివరికి తప్పని పరిస్థితుల్లో ఉద్యోగంలో చేరి వాయిదాలు చెల్లించటానికి రెడీ అవుతాడు. మరి అతడు, అతని తల్లి కలసి తండ్రి చేసిన అప్పును తీరుస్తారా? అసలు మహేశ్ తండ్రి ఆ అప్పు ఎందుకు చేస్తాడు? ఆ డబ్బు ఏమైంది? మహేశ్ తన ప్రేమను దక్కించుకుంటాడా? వీటన్నికి సమాధానమే ఈ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’.
కథగా చూస్తే అతి మామూలుదే. కానీ కథనంతో దానిని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు మహేశ్ ఉప్పాల. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అప్పు తీసుకుని వాయిదాలు చెల్లించటానికి ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ సీరీస్ కి పెద్ద ఎసెట్ తులసి పోషించిన రుక్కిణి పాత్ర. అమాయకంగా ఉంటూ కొడుకుపై ప్రేమ చూపించే పాత్రలో జీవించిందనే చెప్పాలి. తులసితో పాటు ఆమె తల్లిగా నటించిన నటి కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. నరేశ్ కి, రాజీవ్ కనకాలకి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. ఇక హీరోగా నటించిన సంగీత్ శోభన్ ఎంతో ఈజ్ తో తన పాత్రను పోషించాడు. హీరోయిన్ సిమ్రాన్ శర్మ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే తన పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు కాబట్టి ఓకె.
మొత్తం ఐదు ఎపిసోడ్స్ తో కూడిన ఈ సీరీస్ లో తల్లీ కొడుకులు రుణ వాయిదా కట్టడంలో భాగంగా చేసిన పనులు కొంత వరకూ బోరు కొట్టిస్తాయి. ఆ సీన్స్ అన్నింటినీ ట్రిమ్ చేస్తే సీరీస్ ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళుతుంది. అయితే చివరి ఎపిసోడ్ మాత్రం హృద్యంగా ఉండి మధ్యతరగతి మనస్థత్వాలకు అద్దం పట్టేలా ఉండి భావోద్వేగాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. సన్నివేశానుగుణంగా వచ్చే కామెడీ చాలా వరకూ నవ్విస్తుంది. మహేశ్ తండ్రి అటకమీద దాసిన డబ్బు చివరి ఎపిసోడ్ లోనూ బయటపడకపోవడంతో ఈ సీరీస్ కి సీక్వెల్ ఉందని అర్థం అయింది. దండి నేపథ్య సంగీతంతో సీరీస్ కి ప్రాణం పోసాడు. ఎదురోలు రాజు కెమెరా వర్క్ మధ్యతరగతి కుటుంబాలను ఆవిష్కరించింది. అయితే ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకా పదును పెట్టవలసిన పని ఉంది. నిర్మాణవిలువలు బాగున్నాయి. నీహారిక సక్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకోవడ ఖాయం.
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే కథ
తులసి నటన
కథానుగుణమైన వినోదం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా సాగతీత
కథకి ముగింపు లేకపోవడం
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్: రియలిస్టిక్ ఫ్యామిలీ స్టోరీ