ఈ మధ్య కాలంలో పరభాషల్లో తెరకెక్కిన క్రైమ్, థ్రిల్లర్స్ తెలుగులో తెగ డబ్బింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలలో ఆ తరహా సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డిటెక్టివ్ మూవీస్ సైతం ఇతర భాషల నుండే దిగుమతి అవుతున్న టైమ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మన నేటివిటీలో వచ్చి, మంచి విజయం సాధించింది. అదే కోవలో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీనే ‘కనబడుట లేదు’. ఎం. బాలరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ సాగర్, సతీశ్ రాజు, దిలీప్, డా. శ్రీనివాస్ కిషన్, దేవీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది.
శశి (వైశాలీ రాజ్), ఆదిత్య (యుగ్ రామ్) కొత్తగా పెళ్ళైన జంట. అయితే పెళ్ళికి ముందే శశి… సూర్య (సుక్రాంత్) అనే ఫుడ్ డెలీవరీ బోయ్ ను ప్రేమిస్తుంది. అనాథ అయిన సూర్యతో శశి పెళ్ళి చేయడానికి తండ్రి ఒప్పుకోడు. ఇద్దరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా, సూర్య నుండి శశి ఫోన్ కి ఓ మెసేజ్ వస్తుంది. దాంతో ఆమె సూర్య మోసం చేశాడని భావించి, ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. తనని మోసం చేసిన సూర్య మీద పగ తీర్చుకోవాలనే కోరికతో రగిలిపోయే వైశాలీ భర్తనే అందుకు ఆయుధంగా వాడుకుంటుంది. సూర్యను చంపేయమని కోరుతుంది. మరి ఆమె కోరిక మేరకు ఆదిత్య… సూర్యను చంపేశాడా? అసలు సూర్య బతికే ఉన్నాడా? సూర్య అర్థాంతరంగా శశి జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటీ? ఈ చిక్కు ముడులను డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) ఎలా విప్పాడు? అన్నదే ఈ చిత్ర కథ.
ఇలాంటి కథలకు చాలా హోమ్ వర్క్ చేయాలి. పైగా క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే బుర్రకు బాగా పనిచెప్పాలి. డైరెక్షన్ అండ్ రైటర్స్ టీమ్ ఆ విషయంలో బాగానే పనిచేసింది. కానీ కొన్ని అంశాలలో మాత్రం పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదనీ తెలిసిపోతోంది. సూర్య తనని మోసం చేశాడని శశి భావించడం, చంపేయాలనేంత కసిని అతని మీద పెంచుకోవడానికి బలమైన కారణాలు మనకు కనిపించవు. సినిమా ప్రారంభంలోనే ఓ హత్యకు గురైన మృతదేహం దొరకడం, దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇంతలో పోలీస్ ఆఫీసరే హత్యకు గురికావడం, ఇవి చాలవన్నట్టు మరో మిస్సింగ్ కేసు… ఇవన్నీ ప్రేక్షకుల్ని కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురిచేస్తాయి. ద్వితీయార్థంలో ఈ చిక్కు ముడులను సునీల్ పాత్ర ద్వారా విప్పే ప్రయత్నం చేసినా… అందులోనూ ఊహకందని ట్విస్టులను పెట్టారు. ఓ రకంగా ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేవే అయినా… మరింత స్మూత్ గా ఈ కథను డీల్ చేసి ఉండాల్సింది. సూర్యను రోజుల తరబడి బందీ చేయడం, అనాధ మహిళల్లో ఉండే సైకిక్ మెంటాలిటీ ఇలాంటివి గతంలో కొన్ని సినిమాలలో చూసినవే… వాటిని ఇంకొంచం కొత్తగా తీసి ఉండాల్సింది. ఇక పోలీస్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పై చిత్రీకరించిన సన్నివేశాలు కొన్ని అతిగా ఉన్నాయి. సబార్డినేట్స్ పై అయిన దానికీ కాని దానికి అతను చెయ్యి చేసుకోవడం, విమనైజర్ గా అతన్ని చూపడం కాస్తంత చికాకు పెట్టే అంశాలే! వాటిని కాస్తంత తగ్గించి ఉండాల్సింది.
సూర్యగా సుక్రాంత్, శశిగా వైశాలీ రాజ్ చక్కగా నటించారు. వైశాలీ రాజ్ కు హోమ్లీ క్యారెక్టర్స్ మరిన్ని దక్కే ఆస్కారం ఉంది. డిఫరెంట్ మేనరిజమ్ తో ఆదిత్యగా యుగరాజ్ బాగానే చేశాడు. డిటెక్టివ్ రామకృష్ణ గా సునీల్ వచ్చేది ద్వితీయార్ధంలోనే అయినా… అక్కడి నుండి సినిమా మొత్తం అతని మీదగానే సాగుతుంది. అయితే… ఓ డిటెక్టివ్ గా సునీల్ చేసే పనులకంటే… కథను ప్రేక్షకులకు నేరెట్ చేస్తున్నాడా అన్నట్టుగానే అతని పాత్ర సాగింది. అతనికి, అతని అసిస్టెంట్ కు మధ్య ఉన్న ఒకటి రెండు సన్నివేశాలు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను గుర్తు చేశాయి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ హిమజా కీలక పాత్ర పోషించింది. అంతేకాదు.. తన నటనతో ఆకట్టుకుంది కూడా! ఇక ఇతర ప్రధాన పాత్రలను కిశోర్ కుమార్, కిరీటి దామరాజు, రవివర్మ, ప్రవీణ్, ‘కేరాఫ్ కంచరపాలెం’ సుబ్బారావు తదితరులు పోషించారు. వీరి నుండి దర్శకుడు బాలరాజు చక్కని నటన రాబట్టుకున్నాడు. మధు పొన్నాస్ నేపథ్య సంగీతం, సందీప్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఏదేమైనా… ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను సాగతీయకుండా, క్రిస్ప్ గా తీస్తేనే జనం మెచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అది ఈ సినిమా విషయంలో జరగలేదు. అందువల్ల ప్రేక్షకాదరణ ఈ చిత్రానికి ఎంతవరకూ కనబడుతుందనేది సందేహమే!
ప్లస్ పాయింట్స్
- సునీల్ నటన
- సాంకేతిక విలువలు
- ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడం
మైనెస్ పాయింట్స్
- నిదానంగా సాగే ప్రథమార్ధం
- క్యారెక్టరైజేషన్ లో లేని క్లారిటీ
ట్యాగ్ లైన్: డిటెక్టివ్ సునీల్!
రేటింగ్ : 2.5 / 5