Chairman’s Desk: పండగ రోజు ప్రశాంతంగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలనుకోవడం పాపమైపోతోంది. ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఆలయాలకు వెళితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. హిందూ ధర్మంలో భాగమైన పుష్కరాలు, కుంభమేళాలు, పుణ్యస్నానాలు.. ఇలా ఒకటేంటి.. ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా.. సురక్షితంగా ఇంటికి తిరిగొస్తామనే గ్యారెంటీ లేకుండా పోతోంది. ఆ స్థాయిలో దేశంలో రోజువారీగా తొక్కిసలాట ఘటనలు పెరిగిపోతున్నాయి. జనం రద్దీ గురించి తెలిసీ నిర్లక్ష్యం వహించడం కొన్ని దుర్ఘటనలకు కారణమౌతోంది. అలా కాకుండా అసలు ఎంతమంది వస్తారో కనీస అంచనా లేకుండా చేసే అనవసర ఆర్భాటం, హడావుడి కారణంగా మరికొన్ని విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అసలు ఎవరి మెహర్బానీ కోసం ఏం జరుగుతుందో తెలిసేలోపే.. అనుకోని దుర్ఘటనలు జరిగిపోతున్నాయి. తీరా ప్రాణాలు గాల్లో కలిసిపోయాక అసలు కారణాలేంటో బయటికొచ్చినా.. ఉపయోగమేమిటన్నది అంతుబట్టడం లేదు. అధికారులు షరామామూలుగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సమాచార లోపం పేరుతో తప్పించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా నష్టపరిహారాలు ఇవ్వడమే మా పని అన్నట్టుగా ఉంటున్నాయి. అంతేకానీ జనం ప్రాణాలకు ఓ విలువ ఉంటుందని, అసలు ఆలయాలకు వచ్చిన వారు చచ్చిపోవడమేంటని ఆలోచించే వారే కరువయ్యారు. మొత్తం మీద వ్యవస్థల బాధ్యతారాహిత్యానికి.. అమాయకులు బలైపోతున్నారు. గతంలో తిరుమల ఘటన అయినా.. సింహాచలంలో విషాదం జరిగినా.. ఇప్పుడు శ్రీకాకుళం కాశీబుగ్గలో జనం చనిపోయినా.. యంత్రాంగంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం ఎక్కడా తగ్గిన దాఖలాల్లేవు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
Read Also: Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..!
శ్రీకాకుళం కాశీబుగ్గ దుర్ఘటన మన వ్యవస్థలోని లోపాల్ని మరోసారి బయటపెట్టింది. పండగపూట గుడికి వెళ్లి జనం చచ్చిపోవడమేంటి..? పుష్కరాలకు, కుంభమేళాలకు, పుణ్యస్నానాలకు, పండగ రోజు గుళ్లకు వెల్లి జనం చచ్చిపోవడమనేది దేశంలో సాధారణ విషయంలా మారింది. కుంభమేళాలకు, పుణ్యస్నానాలకు, ఇతర దైవ కార్యక్రమాలకు ప్రజలు వెళ్లటం తప్పు కాదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం.. అధికారులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం అసలు కారణం. మన తోలుమందం వ్యవస్థలో జనం ప్రాణాలకు విలువ లేదు. ఎన్నిసార్లు సంఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగంలో, పోలీసుల్లో చలనం లేదు. పండగరోజు గుడికి వెళ్లడం.. పుణ్యస్నానాలు చేయడం.. పుష్కరాలకు వెళ్లడం.. విస్తృత హిందూ ధర్మంలో భాగంగా ఉన్న ఈ దేశంలో కాదని.. వద్దని ఎలా చెప్పగలం..? కానీ దేశంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు.. మన వ్యవస్థలో లోపాలను వెక్కిరిస్తున్నాయి.
Read Also: Kiara Advani : మీనా కుమారి బయోపిక్‌కి స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్..!
ఇక్కడ కాశీబుగ్గ ఘటన ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పి సర్కారు చేతులు దులిపేసుకుంటోంది. అలాగే తమకు సమాచారం లేదని పోలీసులు కూడా చేతులెత్తేశారు. కానీ అందరికీ తెలిసీ.. అన్ని అంచనాలు ఉండి.. జాగ్రత్తలు తీసుకున్న చోట జరిగిన దుర్ఘటనల సంగతేంటో ఎవరైనా చెప్పగలరా.. అంటే అక్కడా సమాధానం ఉండదు. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా.. మొదట చనిపోయిన జనానిదే తప్పన్నట్టుగా మాట్లాడటం అధికారులకు అలవాటుగా మారింది. నిజంగానే కాశీబుగ్గలో అధికారులకు సమాచారం లేకపోవచ్చు.కానీ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో నిర్వాహకులు చేస్తున్న ప్రచారం వారి దృష్టికి రాకుండా ఉంటుందా..? స్థానికంగా ఉండే అధికారుల్లో ఏ ఒక్కరు బాధ్యత తీసుకున్నా.. ఇంత విషాదం జరిగేది కాదు కదా అనే వాదన బలపడుతోంది. చివరకు పోలీసులు కూడా ముందుగా సమాచారం లేకున్నా.. జనం పోటెత్తుతున్నప్పుడు అయినా వచ్చుంటే.. ఇంత అనర్థం జరిగేది కాదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరికి వారు ఎవరెలాచస్తే మాకెందుకు అని బాధ్యతను గాలికొదిలేసినట్టే.
Read Also: Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
పోనీ ప్రైవేట్ కార్యక్రమాలు అంతే. నిర్వాహకుల నిర్లక్ష్యం అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో, అన్ని అనుమతులు తీసుకుని జరిగే కార్యక్రమాల్లో విషాదాలు ఎందుకు జరుగుతున్నాయో అయినా సూటిగా సమాధానం చెప్పగలిగాలి కదా. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలిగా. కానీ లేదు. అదేం లేదు. ఎక్కడైనా అధికార జులుం ప్రదర్శించటానికి ముందుండే యంత్రాంగం.. బాధ్యతల మాటొచ్చేసరికి ఆమడదూరం పారిపోతుంది. ఈ ఏడాది మొదట్లో తిరుమలలో అన్ని శాఖల అధికారుల సాక్షిగానే జనంలో తోపులాట జరిగింది. ప్రాణాలు పోయాయి. అందరూ అక్కడే ఉండి చోద్యం చూశారే కానీ.. ప్రాణనష్టాన్ని నివారించలకపోయారు. ఇంకా వింతేమిటంటే.. అసలు అధికారుల సమన్వయలోపం కూడా ప్రమాదానికి ఓ కారణమని తేలటం.. వ్యవస్థల్లో లోపాలకు పరాకాష్టగా నిలిచింది. ఇక కుంభమేళాలో జరిగింది మరీ ఘోరం. వేల సంఖ్యలో ఉన్న భక్తులు బారికేడ్లు ఎక్కి దూకుతున్నా.. వారిని ఎవరూ వారించలేదు. అంతమంది ఒకరిమీద ఒకరు పడిపోయి.. పుణ్యస్నానాలకు పోటీపడ్డా ఎవ్వరూ వద్దనలేదు. జాగ్రత్తలు చెప్పలేదు. తీరా ప్రాణనష్టం జరిగాక మాత్రం.. మేం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చిలకపలుకులు పలికారు. కానీ ఎవరెన్ని చెప్పినా.. పోయిన ప్రాణాలైతే తిరిగిరావు. ఆ మృతుల కుటుంబాల శోకం తీరదు.
పుష్కరాల్లోనూ ఇదే తంతు. మొదట భారీగా తరలిరావాలని ప్రభుత్వాలే ఆర్భాటంగా ప్రచారం చేస్తాయి. కొన్ని ఘాట్లు, కొన్ని ప్రదేశాల్లో పుణ్యస్నానం చేస్తే.. పుణ్యమని కూడా పనిగట్టుకుని ఊదరగొడతాయి. తీరా సమయానికి వేల మంది భక్తుల్ని నియంత్రించకుండా.. వారి మానాన వారిని గాలికొదిలేస్తారు. తొక్కిసలాటలు, తోపులాటల్లో అదృష్టం బాగుంటే బతుకుతారు. లేదంటే లేదు అని సరిపెట్టుకోమంటారు. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి.. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చనిపోయినా పుణ్యమే కదా అని విపరీతమైన లాజిక్కులు కూడా తీస్తారు. తమ బాధ్యతల్లో విఫలం చెందటమే కాకుండా.. ఇలా చావులతోనూ పరిహాసం చేసేవారిని ఏమనాలో ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఈ దేశంలో హైందవ సంస్కృతి వేల ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వాలకు, యంత్రాంగానికీ భక్తుల ధోరణి బాగా తెలుసు. చాలా సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగే పరిస్థితులు ముందే ఊహించలేనివేం కాదు. కానీ అన్నీ తెలిసీ.. అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శించటమే ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక్కడ ప్రభుత్వాలకూ, అధికారులకూ ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. అసలు ఇన్ని వ్యవస్థలు ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడటానికే అనే సంగతి కూడా ఎంతమందికి గుర్తుందో సందేహించాల్సిన విషయమే. చాలా మంది అధికారులు రద్దీ సమయాల్లో జనాన్ని నియంత్రించటం తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వాలు కూడా పరోక్షంగా జనంలో వేలంవెర్రి అనర్ధాలకు దారితీస్తోందని హింటిస్తాయి. అంతేకానీ.. ఎంతమంది వచ్చినా.. చిన్న పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమదేనని ఒప్పుకోవటానికి సిద్ధపడవు. కనీసం చేతగానప్పుడు ఇంతమందే రావాలి.. అంతకు మించి వస్తే రానీయమనో.. ఏదైనా జరిగితే తమకు బాధ్యత లేదనో చెప్పటానికీ ధైర్యం చేయవు. ఇలా ఏదో ఒక స్టాండ్ తీసుకోవటానికి వెనకాడి.. చివరకు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఎవరేమనుకున్నా మేమింతే అంటారు అధికారులు. ఏడున్నర దశాబ్దాల జన భారతంలో ఎక్కడ దుర్ఘటన జరిగినా.. ఓ విచారణ కమిటీ.. ఓ నివేదిక అంటూ హడావుడి చేయడమే కానీ.. మరో దుర్ఘటనను నివారించటానికి నిపుణులు ఇచ్చే సూచనల్ని పట్టించుకున్న దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. చాలాసార్లు చిన్న చిన్న జాగ్రత్తలు, మార్పులతో పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. కానీ ఎవరెలా పోతే మాకేంటి అనుకునే వ్యవస్థలు.. ఎప్పుడూ ప్రాణాలు పోయాకే స్పందిస్తాయి. చేతులు కాలాకే ఆకులు పట్టుకోవాలని జనానికి కొత్త పాఠాలు చెప్పడంలో ఆరితేరాయి.