Site icon NTV Telugu

Chairman’s Desk: పాక్‌-భారత్‌ మధ్య యుద్ధం అంటూ జరిగితే.. ఎవరికి ఎక్కువ నష్టం..?

Chairman's Desk

Chairman's Desk

Chairman’s Desk: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్‌ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్‌ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు. ఈ మాటల వినడానికి చాలా బాగుంటాయి.. అయితే, యుద్ధం చేయడం అంటే.. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను ఫార్వాడ్‌ చేయడం అంత తేలిక కాదు. ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా.. ఫైనల్‌గా వినాశనమే మిగులుతుంది.. మిగిలింది కూడా. అందుకే యుద్ధం కంటే మన ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం తక్షణావసరం. యుద్ధం అంటూ జరిగితే ఇప్పటికే అన్నీ కోల్పోయిన పాక్ కంటే.. అభివృద్ధి దిశగా పురోగమిస్తున్న మనకే నష్టం ఎక్కువగా ఉంటుందనేది చేదు నిజం. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ఏ సమస్యకైనా యుద్ధం చివరి దారి. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే బలమైన దేశమైనా, బలహీన దేశమైనా యుద్ధంలో పాల్గొన్నాక నష్టపోక తప్పదు. యుద్ధంలో ఓడిన వారికే కాదు.. విజేతలకూ నష్టాలు తప్పవనేది చరిత్ర చెప్పే సత్యం. అందుకే యుద్ధం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరితేరిన యుద్ధ నిపుణులు కూడా అంత త్వరగా యుద్ధానికి ముందడుగు వేయరు. అన్ని ప్రత్యామ్నాయాలూ ఆలోచించి.. ఇక తప్పదనుకుంటేనే యుద్ధానికి సుముఖత చూపుతారు. ఇప్పుడు మన విషయానికొస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత యుద్ధం చేయాలనే డిమాండ్లు దూసుకొస్తున్నాయి. మనకు పాక్ తో యుద్ధాలు కొత్త కాదు. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు పాకిస్తాన్ తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలోనూ మనమే విజయం సాధించాం. అయినా సరే ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. అంటే ఈ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని తేలిపోయినట్టే. అంతెందుకు 1971 యుద్ధంలో అయితే ఏకంగా 93 వేల మంది శత్రుసైనికులు మనకు లొంగిపోయారు. కానీ ఆ తర్వాత కూడా కశ్మీర్లో రావణకాష్ఠం రగులుతూనే ఉంది. అందుకే ఇప్పుడు యుద్ధం చేయటం తప్ప మరో మార్గం లేదా అనే ఆలోచనలు చేయడం కూడా చాలా ముఖ్యం. 26 మంది పర్యాటకులు చనిపోయిన ఆగ్రహావేశాల్లో ఉన్న జాతి యావత్తు పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని, అందుకే యుద్ధమే సరి అని అభిప్రాయపడుతోంది. అలాగని భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. యుద్ధం పర్యవసానాల్ని ఆలోచించటం చాలా అవసరం.

యుద్ధం చేయడం కంటే.. యుద్ధం జరగకుండానే లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ నష్టాల్నే మిగిల్చాయి. యుద్ధంతో అంతిమంగా మిగిలేది వినాశనమే. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, అమెరికా- ఇరాక్‌ వార్‌, ప్రస్తుతం మన చూస్తున్న రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం.. ఏ యుద్ధమైనా.. సామాన్య జనమే నాశనం అవుతారు. 40, 50ఏళ్లపాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రాణనష్టం, ఆర్థిక పతనం దేశాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేస్తుంది. ఇప్పడు పాకిస్థాన్‌తో.. మనం యుద్ధానికి తెగబడినా కూడా.. మన పరిస్థితి అలాగే ఉంటుంది. అంతెందుకు మూడు దశాబ్దాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ తో పాటూ మనకూ తీవ్ర నష్టం జరిగింది. మన స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాన్ని చవిచూసి.. తర్వాత కోలుకున్నాయి. అందుకే యుద్ధం గురించి ఎన్ని డిమాండ్లు వస్తున్నా.. కేంద్రం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. యుద్ధం చేయకుండానే పాక్ ను దెబ్బకొట్టడానికి దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయాలనే నిర్ణయంతో..పాక్ ఆయువుపట్టుపై కొట్టింది. ఊహించినట్టుగానే పాకిస్తాన్ తీవ్రంగా రియాక్టైంది. ఈ ఒప్పందం నిలిపివేత యుద్ధ ప్రకటనే అని.. పాక్ నేతలు, సైనికాధికారులు రెచ్చిపోతున్నారు. సింధు నదిలో నీళ్లు పారకపోతే.. రక్తం పారుతుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉగ్రదాడి జరిగినా భారత్ సంయమనం పాటిస్తుంటే.. పాక్ సైన్యం మాత్రం నియంత్రణ రేఖ దగ్గర రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఏదో రకంగా భారత్ ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగాలనే కుట్రతో పాకిస్తాన్ తెగిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న భారత్.. పాకిస్తాన్ కుట్రని తిప్పికొట్టే పనిలో నిమగ్నమైంది.

కాలానుగుణంగా యుద్ధం కూడా రూపు మార్చుకుంది. ఇప్పుడు ఆయుధాలతో యుద్ధం కంటే ఆర్థిక యుద్ధమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే భారత్ వ్యూహాత్మకంగా ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ తీసేసే పని చేసింది. ఈ నిర్ణయం ప్రభావం చాప కింద నీరులా పనిచేస్తోంది. దీర్ఘకాలంలో పాక్ ను నిర్వీర్యం చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్.. లేని ధైర్యాన్ని తెచ్చి పెట్టుకుని.. గంభీర ప్రకటనలతో డైవర్షన్ గేమ్ కు తరలేపింది. కానీ పాక్ రియాక్షన్ ను ముందే ఊహించిన భారత్ మాత్రం అనుకున్న ప్రకారమే ప్రణాళికలు అమలు చేస్తోంది. నిజంగా యుద్ధమే చేయాలనుకుంటే అది మనకు పెద్ద విషయం కాదు. కానీ అది వాంఛనీయం కూడా కాదనే ఆలోచనకు కట్టుబడి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. యుద్ధం అంటూ చేస్తే.. తాను కోరుకున్నప్పుడే జరుగుతుందనే సంకేతాలు పంపుతోంది. అంతేకానీ పాకిస్తాన్ రెచ్చగొడితేనో.. ఆ దేశ నేతలు ఆవేశపడితేనో.. జరగదనే మెసేజ్ ఇస్తోంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఏదోలా భారత్ ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే అలవాటైన పని చేస్తోంది. గతంలోనూ యుద్ధాలన్నీ మొదట పాక్ మొదలుపెట్టినవే. పాకిస్తాన్ కు ప్రతి స్పందనగానే మన దేశం యుద్ధంలో దిగాల్సి వచ్చింది. కానీ ఈసారి ఆ పప్పులేవీ ఉడకబోవని చెబుతోంది భారత్ సర్కారు. ఇప్పుడు మనకు యుద్ధం కంటే ప్రధానమైన లక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఆలోచించాలి.

Exit mobile version