Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Chairmans Desk Chairmans Desk Over Womens Reservation Bill

Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?

Published Date :April 21, 2026 , 9:52 pm
By Gogikar Sai Krishna
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

డీలిమిటేషన్ రాజ్యాంగ బాధ్యత అయితే.. మహిళా రిజర్వేషన్ల అమలు సామాజిక బాధ్యత. మామూలుగా అయితే ఈ రెండింటినీ కలపాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రం మాత్రం ఈ రెండింటికీ ముడిపెట్టి లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. అటు ప్రతిపక్షాలు కూడా తమకేం కావాలో క్లారిటీగా చెప్పడంలో విఫలమయ్యాయి. మొత్తం మీద అధికార, పాలక పక్షాలు కలిసికట్టుగా మహిళా రిజర్వేషన్ల అమలును అటకెక్కించాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. అందులో డీలిమిటేషన్ వ్యవహారాన్నీ కలిపేసింది. అదేమంటే శాస్త్రీయంగా రిజర్వేషన్ల అమలుకు సీట్ల పెంపు తప్పనిసరి అని సమర్థించుకుంది. కానీ ఆ సీట్ల పెంపు ఎలా అనే విషయంలో సరైన స్పష్టత మాత్రం ఇవ్వలేదు. పైగా ప్రసంగాల్లో ఒకలా.. బిల్లులో మరోలా చెప్పి.. గందరగోళానికి తెరతీసింది. దీంతో మొదట్నుంచే కేంద్రం ఉద్దేశాల్ని అనుమానిస్తున్న ప్రతిపక్షాలు.. బిల్లు ఆమోదానికి ససేమిరా అన్నాయి. దీంతో చరిత్రాత్మక క్షణాలకు వేదిక అవుతుందనుకున్న పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ మహిళలకు నిరాశే మిగిలింది. తీరా బిల్లు వీగిపోయాక అటు పాలక పక్షం.. ఇటు ప్రతిపక్షం వేటికవే తమదైన వాదన వినిపిస్తూ.. మరోసారి దేశ ప్రజల్ని ఫూల్స్ చేసే ప్రయత్నం చేయడం మరింత విడ్డూరం.

మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాలుగా దీనిపై పార్లమెంట్ లోపలా బయటా విస్తృత చర్చ జరిగింది. కేంద్రంలో నాలుగైదు ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నించి పార్లమెంట్‌ లో భంగపడ్డాయి. కానీ ఎట్టకేలకు 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌ ముందుకొచ్చి ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కానీ అప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లకు, జనగణనకూ లింక్ పెట్టారు. అప్పట్లో ఈ లింక్ అవసరం లేదని చర్చ జరిగినా.. చివరకు అందరూ సహకరించడంతో బిల్లు ఆమోదం పొందింది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టే అవకాశం.. అప్పటి క్లాజ్‌తోనే వచ్చిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. దీంతో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్తశుద్ధిపై ప్రశ్నలకు అవకాశం చిక్కింది. మూడు దశాబ్దాల క్రితమే స్థానిక సంస్థల కోటాలో మహిళా రిజర్వేషన్లు అమలయ్యాయి. అప్పుడు ఇలాంటి లింకులు, లిటిగేషన్లు ఏమీ పెట్టకుండా.. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రిజర్వేషన్లు అమలయ్యాయి. అంతేకాదు చాలా రాష్ట్రాలు ఎవ్వరూ అడగకుండానే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచి ఉదారంగా వ్యవహరించాయి. ఈ లెక్కన చూసుకుంటే.. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఇంత పంచాయితీకి అవకాశమే ఉండకూడదు. కానీ ఇక్కడే మరో కోణం కూడా ఉంది. దాన్ని విస్మరించి మహిళా రిజర్వేషన్ల అమలును, దాని వెనుక ఉన్న రాజకీయ పార్టీల ఉద్దేశాలను అర్థం చేసుకోలేం.

Also Read

  • Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
  • Chairman's Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?
  • Chairman's Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?
Add as a preferred
source on google

స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు అమలైనా.. అక్కడ చాలా వరకు ప్రాక్సీ అధికారాలే అమలౌతున్నాయి. చాలా చోట్ల మహిళల్ని ముందుపెట్టి.. వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ప్రస్తుతం కొందరు మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి కూడా అదేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోటే ఇలా జరుగుతుంటే.. ఇక ఇప్పటిదాకా పురుషులు పోటీ చేస్తున్న సీట్లను రిజర్వేషన్ల పేరుతో మహిళలకు కేటాయిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనేది కేంద్రం వాదన. అందుకే సీట్లు పెంచి.. అలా పెరిగిన సీట్లన్నీ మహిళలకు కేటాయిస్తే.. అప్పుడు ప్రాక్సీల ఆటలు చెల్లవనే వాదన తెరపైకి వస్తోంది. కానీ ఈ వాదనతో ప్రతిపక్షం ఏకీభవించడం లేదు. రాజకీయ దురుద్దేశాలతో సీట్లు పెంచుతూ.. దాన్నుంచి ఏదో లక్ష్యం ఆశిస్తూ.. మహిళల మెడపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే.. ఎందుకు ఒప్పుకుంటామనేది ప్రతిపక్షాల కౌంటర్.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం జరిగిన మూడు రోజుల పార్లమెంట్‌ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల్లో…..ఎవరు గెలిచారో ఎవరు ఓడారో కానీ…ఈ దేశం మహిళలు మాత్రం దారుణంగా మోసపోయారు. 2023లోనే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొంది…చట్టమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లును…సవరణ పేరుతో మళ్లీ సభకు తేవడంతో…దేశ మsహిళలందరిలోనూ ఎనలేని ఆసక్తిని రేపింది. ఒక చరిత్రాత్మక సందర్భాన్ని దేశం చూడబోతోందని ప్రజలంతా…ఆశతో ఎదురుచూశారు. రేపట్నుంచి దేశంలో చట్టసభలన్నీ…33శాతం మహిళలతో కలకళలాడిపోతాయని ఆశించారు. తీరా చూస్తే…ఇది ఒక డ్రామాగా మిగిలిపోయింది. కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్‌ బిల్లు…ఒక ఆటబొమ్మలా మారిందనే విషయం స్పష్టమైపోయింది. మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును డీలిమిటేషన్‌ బిల్లుతో కలిపి నాటకీయంగా లోక్‌సభలో పెట్టడం…రెండింట మూడోంతుల మెజార్టీ సాధించలేక అది వీగిపోవడం…కేవలం ప్రభుత్వం ఓటమి మాత్రమే కాదు…ఇది బీజేపీ ఓటమి. 12 ఏళ్ల పాలనలో ఎన్నడూ చవిచూడనిది ఇది. చరిత్రలో బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం ఇది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా…ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేస్తారని దేశమంతా అనుకుంటుంది. ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తారని…రాజకీయ పార్టీలన్నీ భావిస్తుంటాయి. కానీ మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లు విషయంలో వీళ్లిద్దరు తప్పులో కాలేశారు. ఒక వ్యూహం లేకుండా, ఒక విధానం లేకుండా సమయం సందర్భం లేకుండా మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును సభలో పెట్టి…దీన్నొక నాన్‌ సీరియస్‌ వ్యవహారంగా మార్చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారనేది అర్థమైపోయింది.

ప్రస్తుత బిల్లు ఆమోదానికి కావాల్సిన మార్గంలో అధికార పక్షం వెళ్లలేదనేది నిర్వివాదాంశం. సరే ప్రతిపక్షాలు అడిగినట్టుగా డీలిమిటేషన్ లింక్‌ను తెగ్గొట్టలేదనుకుందాం. కానీ బిల్లు పెట్టేముందు అఖిలపక్షం పెట్టాలనే కనీస కోర్కెను కాదనాల్సిన అవసరం ఏమిటనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. సహజంగా ప్రతిపక్షాల మద్దతు అవసరమైనప్పుడు.. అధికార పక్షం రెండు మెట్లు దిగిరావడం కొత్తేం కాదు. గతంలో కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలు అలా వ్యవహరించి.. విపక్షాన్ని తమ దారికి తెచ్చుకున్నాయి. కానీ ప్రస్తుతం జరిగింది వేరు. పార్లమెంట్‌లో 2/3వ వంతు మెజార్టీ లేదని తెలిసీ, ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి అని అవగాహన ఉండి కూడా.. పాలకపక్షం చాలా మొండిగా ముందుకెళ్లింది. అక్కడితో ఆగకుండా సభలో అడుగడుగునా ప్రతిపక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం చేయకపోగా.. వాటిని ఉడికిస్తూ.. ఊరిస్తూ.. చివరకు తమ మాటే నెగ్గుతుందనే అతిశయం ప్రదర్శించింది. ఈ అలవిమాలిన అతిశయమే కొంప ముంచిందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అన్నింటికీ ఓటింగ్ సమయం ముంచుకొచ్చాక.. ప్రతిపక్షం మద్దతిస్తామని హామీ ఇస్తే.. వారు కోరినట్టుగా బిల్లులో మార్పులు చేసి మళ్లీ గంటలో తీసుకొస్తామనే మాట.. విపక్షాన్ని మరింత అసహనానికి గురిచేసింది. ఇప్పుడు మార్పులు చేసే బదులు.. ముందే తాము అడిగినట్టుగా బిల్లు తీసుకొస్తే సర్కారుకు హుందాగా ఉండేది. తమకూ పాలకపక్షం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందనే సంతృప్తి మిగిలేదనేది ప్రతిపక్షం వాదన. అప్పడు సభలో కూడా సుహృద్భావ వాతావరణం ఏర్పడి.. బిల్లు ఆమోదం పొందేదనే వాదన లేకపోలేదు.

మనది అల్టిమేట్‌గా ప్రజాస్వామ్యం. పాలకులుగా ఎవరున్నా ప్రజాసేవకులే. అంతిమంగా ప్రజలే ప్రభువులు. ఈ సంగతి అన్ని పార్టీలకూ తెలుసు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలు రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో కూడా ప్రతి పార్టీ ప్రజాప్రతినిధి.. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజే మహిళలకు ఓటు హక్కు వచ్చిందంటూ ఊదరగొట్టారు. అది తెలిసిన పెద్దమనుషులు.. చట్టసభల్లో మహిళల ప్రవేశాన్ని ఇన్నాళ్లూ ఎందుకు అడ్డుకున్నారో చెప్పగలరా అనేది కీలక ప్రశ్న. ఇంతకుముందంటే.. కొన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేవి. కానీ ఇప్పుడు పార్టీల రాజకీయ దృక్పథం చాలా మారింది. పైగా మూడేళ్ల క్రితమే మహిళా బిల్లుకు ఏకగ్రీవంగా అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. అయినా సరే బిల్లులో కొన్ని అనవసర క్లాజుల కారణంగా అమలు మాత్రం ఇప్పటికీ కలగానే మిగిలింది. అనుకున్నదే తడవుగా స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేసిన పార్టీలు.. చట్టసభల్లో మహిళా శక్తికి మోకాలడ్డుతున్నాయంటే.. వాటి అసలు ఉద్దేశాలేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దేశంలో మహిళలందరికీ రాజకీయ అధికారం తెచ్చిపెట్టే బిల్లు రూపకల్పన దగ్గర్నుంచి ఆమోదం వరకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇలాంటి కీలక బిల్లుల విషయంలో రాజకీయ ప్రయోజనాలు, ఉద్దేశాలు, ఆలోచనల్ని పక్కనపెట్టి.. దేశ విశాల హితం దృష్ట్యా ముందడుగు వేయాలి. అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం రెండు బాధ్యతగా ఆలోచించాలి. అధికార పక్షం అనవసర భేషజాలకు పోకూడదు. అలాగే ప్రతిపక్షం కూడా పట్టుదలకు పోకుండా.. వీలైనంతవరకు సహకరించే ప్రయత్నం చేయాలి. అలా జరగాలంటే.. మొదట అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ మంచి వాతావరణం ఏర్పాటు కావాలి. దీనికి ప్రభుత్వం వైపు నుంచే మొదట చొరవ తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం స్పందించకపోతే.. అది దాని తప్పవుతుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలతో సంప్రదింపుల దగ్గర్నుంచే పాలక పక్షం తేడాగా వ్యవహరించిందనేది ప్రతిపక్షం ప్రధాన ఆరోపణ. ఇండి కూటమి ఉన్న సంగతి తెలిసి కూడా.. కూటమి పార్టీలతో వేర్వేరుగా సంప్రదింపులు జరపటం.. విభజించే పాలించే సిద్ధాంతం కాదా అనే ప్రశ్నకు పాలక పక్షం దగ్గర సూటిగా చెప్పే జవాబు లేదు. ఆ తర్వాత మోడీ ప్రసంగంలో.. క్రెడిట్ గురించి మాట్లాడారు. కావాలంటే క్రెడిట్ మీకే ఇస్తా.. మీరే తీసుకోండి అన్నారు. ఓవైపు బిల్లు ఆమోదం పొందితే క్రెడిట్ అందరికీ దక్కుతుందని చెబుతూ.. మరోవైపు మేం ఇచ్చేవాళ్లం.. మీరు తీసుకునేవాళ్లు అన్నట్టుగా మాట్లాడటం.. ప్రతిపక్ష సహకారం తెచ్చిపెడుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అలాగే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చాలా ఆవేశంగా చేసిన ప్రసంగం కూడా.. అవసరానికి మించిన విమర్శలతో, సమయం సందర్భం లేని ఆరోపణలతో సాగిందనే చర్చ జరుగుతోంది. అసలు సూర్య ప్రసంగంతోనే ప్రతిపక్షాలు పాలకపక్షానికి సహకరించబోవని తేలిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రతిసారీ ప్రతిపక్షాలతో పాలకపక్షానికి పార్లమెంట్ బయటే అవగాహనకి వచ్చే అవకాశం ఉండదు. కానీ బయట ఏకాభిప్రాయం కుదరనప్పుడు సంయమనంతో వ్యవహరించి.. కనీసం సభలోపలకు వచ్చాక అయినా.. విపక్షాలు మెత్తబడేలా చూసుకోవటమే రాజకీయ పరిణతి. కానీ ఆ పరిపక్వత అధికార పక్షంలో లోపించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఓటింగ్‌ జరగకముందే విపక్షాల్ని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా ఎదురుతన్నింది. ఎలాగూ మాపే వీలైనంత బురద చల్లేశారు. ఇక ఇప్పుడు కొత్తగా మేం పోగొట్టుకునేదేముందని కూడా ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని ప్రశ్నించాయి. కానీ ఈ ప్రశ్నలు వేటికీ అధికార పక్షం సాధికారికంగా, కన్విన్సింగ్‌గా సమాధానాలు చెప్పలేకపోయింది. ఎంతసేపూ మేం చెప్పేది మీరు వినాలనే ధోరణే కానీ.. మా వాదనలోనూ మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాం.. చూడండనే కోణంలో మాట్లాడిన నేతే లేకపోవడం ప్రతిపక్షాలకు తీవ్ర నిరాశ కలిగించింది. పాలక పక్షం తరపున సీనియర్లు, జూనియర్లు అందరూ కూడబట్టుకుని తమపై ఎదురుదాడి చేశారని ప్రతిపక్షాలు మాట్లాడుకున్నాయి. ఇంత ఘర్షణాత్మక వైఖరిని పాలక పక్షమే ముందుకు తీసుకొచ్చాక.. ఇక తాము రాజీ పడితే.. ప్రజలకు లేనిపోని అనుమానాలొస్తాయని కూడా విపక్షాలకు సందేహం వస్తే.. అది వాటి తప్పు కాదు. అన్నింటికీ మించి బిల్లు ఆమోదం పొందకపోయినా.. తమకు లాభమే అని స్వయంగా ప్రధాని చెప్పడం.. విపక్షానికి మరింత మండించిందనడంలో సందేహమే లేదు. అంటే సభలో బలం లేకపోయినా.. బిల్లు ఆమోదం పొందకున్నా.. తమకు రాజకీయ లబ్ధి కలుగుతుంది కాబట్టే.. ప్రతిపక్షాలతో సయోధ్యకు ప్రయత్నాలు చేయలేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు విపక్ష నేతలు. అంతకుమించి.. బిల్లు ఆమోదం పొందితే తమ ఘనత.. లేకపోతే ప్రతిపక్షాల తప్పు అనే వాదానికి పాలకపక్షం రంగం సిద్ధం చేసిందని గ్రహించిన ప్రతిపక్షాలు.. ఇలాంటి సందర్భంలో బిల్లు గురించి ఆలోచించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాయి. కాదు కాదు అవి ఆ నిర్ణయానికి వచ్చేలా పాలకపక్షమే వ్యవహరించింది.

గతంలో కొన్నిసార్లు 2/3వ వంతు మెజార్టీ అవసరమైన బిల్లుల్ని అవలీలగా ఆమోదించుకున్న ఎన్డీఏ సర్కారు.. ఈసారి కూడా పార్లమెంట్‌లో అలాంటి కేక్‌వాక్‌ను ఆశించిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. లేకపోతే ప్రతిపక్షాల మద్దతు కూడగట్టానికి సరైన కసరత్తు చేయకుండా.. సభలో కూడా మీరు మద్దతు ఇస్తే ఎంత..? ఇవ్వకపోతే ఎంత..? అనే కోణంలో వ్యవహరించడమే.. బిల్లు ఆమోదం పొందకపోవటానికి అసలు కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

40ఏళ్లుగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. నిజంగానే రాజకీయాల్లో 33శాతం రిజర్వేషన్‌ వస్తే…రాజకీయంగా అందరికి మేలు జరుగుతుంది. దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది. అలాంటి గొప్ప మార్పు కోసం అందరు కలిసి…కృషి చేయాల్సింది పోయి…ఈ చారిత్రత్మాక సందర్బంగా ఎవరి ప్రయోజనాల కోసం వారు వాడుకున్నారు. అసలు వీళ్లకు మహిళా రిజర్వేషన్ల అమలు చేద్దామనే చిత్తశుద్ది ఉందా ? లేదా ? అనే అనుమానం అందరికి వస్తోంది. బిల్లును సహేతుకంగా అడ్రస్ చేయకుండా పార్లమెంట్‌ సాక్షిగా మళ్లీ దాన్ని అటకెక్కించి…విమర్శలు చేసుకోవడం చూస్తే… ఈ దేశంలో నేతల చిత్తశుద్దిపై ఎవరికైనా అనుమానం రాకతప్పదు. నిజంగానే మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఉంటే…ఒక్క బిల్లునే విడిగా పెట్టి…దానిపై చర్చ జరిపి…గెలిపించుకునేవారు. 1978 నుంచి మహిళా రిజర్వేషన్లపై దేశంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. దీనిపై ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు. కొందరు ఇప్పుడున్నట్లు యథాతథంగా అమలు చేద్దామని అనుకోవచ్చు. కొందరు బీసీ రిజర్వేషన్లు ఇందులో కలుపుదామని ఆలోచన రావచ్చు. అభిప్రాయాలు, విధానాలు ఎలా ఉన్నప్పటికీ…దేశంలో మహిళలందరికి ప్రయోజనకారి అయ్యేటట్లుగా అన్ని పార్టీలు కూర్చొని…ఒక సమావేశం పెట్టుకొని…చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని…ఆ తర్వాత సభలోకి వెళ్లుంటే…మహిళల అభ్యున్నతిపై ఈ దేశంలో రాజకీయ పార్టీల చిత్తశుద్ది ఏంటో తెలిసేది. అదేమీ లేకుండా కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక ప్రహాసనంలా…డ్రామాలాగా నడిపి…దేశం ముందు అబాసుపాలయ్యారు ఢిల్లీ పెద్దలు. దేశ రాజకీయ వ్యవస్థలోనే అతిపెద్ద మార్పు…తీసుకొచ్చే ఈ బిల్లు విషయంలో…అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకోవా ? ఒక ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించి…దీనిపై చర్చించవా ? అదేమీ లేకుండా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారంటేనే…ఇదొక పెద్ద నాటకం అని జనానికి అర్థమైపోయింది. అసలు డీలిమిటేషన్‌ బిల్లుతో ..లింక్‌ పెట్టి…మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును సభలో పెట్టడం ఏంటి ? దీన్ని బట్టి ప్రజలతో పాలక పార్టీలు…ఒక పెద్ద నాటకం ఆడారని అర్థమైంది. అంతేకాదు…కాంగ్రెస్‌ కూడా అసలు బిల్లులో ఏం కావాలి ? ఎలాంటి సవరణలు కావాలి…అవి ఏ రూపంలో ఉండాలి అన్నది స్పష్టంగా చెప్పలేదు. పాలక, ప్రతిపక్షాలు రెండు మాటలయుద్దం చేసి…దాన్ని ప్రజల్లోకి వదిలేశాయి.

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. పార్లమెంట్‌లో ప్రాధాన్యం గల బిల్లులు పెట్టేటప్పుడు సమయం, సందర్భం కూడా చూసుకోవాలి. ప్రతిపక్షాలకు లేనిపోని సందేహాలు వచ్చి.. వాటిని నివృత్తి చేయడం కంటే.. అసలు అనుమానాలే రాకుండా వ్యవహరించడం మంచి పద్ధతి. ప్రస్తుతం రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రభుత్వం ఎంచుకున్న సమయం కూడా రాజకీయ చర్చ జరగటానికి తావిచ్చింది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు లింక్ పెట్టి బిల్లు పెట్టడం.. ఏదో దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యంతో సర్కారు ఆడుతున్న ఆట అని విపక్షాలు అనుమానించటానికి అవకాశం ఇచ్చింది. పైగా మొన్నటిదాకా జరిగిన బడ్జెట్ సెషన్ లో బిల్లు పెట్టకుండా.. మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. హడావుడిగా ప్రత్యేక సమావేశాలు పెట్టడంతో.. ఎందుకింత హడావుడి అనే చర్చను కూడా మొదలుపెట్టేసింది. పోనీ నిజంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు అంత తొందర ఉంటే.. మూడేళ్ల క్రితం బిల్లు ఆమోదించి.. ఇప్పటిదాకా ఎందుకు నోటిఫై చేయలేదనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇంతకాలం ఆగిన సర్కారు.. అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా ఆగలేదా అనేది ప్రతిపక్షాల ప్రశ్న.

ఏతావాతా పన్నెండేళ్ల తర్వాత పార్లమెంట్‌లో విపక్షాల ఐక్యత ప్రదర్శన తొలిసారి కనిపించింది. ఎప్పుడూ సభ బయట ఒకే మాట అనుకుని.. సభ లోపలకు వచ్చాక అనవసర ఇగోలకు పోయే విపక్షాలు.. ఈసారి మాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఒకే మాట మీద నిలబడ్డాయి. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎవరూ భిన్న వైఖరి తీసుకోలేదు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో తమకేం కావాలో విపక్షాలన్నీ ఒకే మాట చెప్పాయా అంటే లేదనే చెప్పాలి. ఎవరికి తోచిన వాదన వారు వినిపించారు. ఓ దశలో అసలు విపక్షాల వాదనకు ప్రాతిపదిక ఏంటనే సందేహాలు కూడా తెరపైకి వచ్చాయి. అప్పటికీ పొరపాట్లు దిద్దుకోని ప్రతిపక్షం.. బిల్లులో అసలేం ఉండాలో.. ఎలాంటి బిల్లును పార్లమెంట్‌ ముందుకు తేవాలనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టమైన సూచన చేయలేదనే చెప్పాలి. ఇప్పటికీ ప్రతిపక్షాల ఆరోపణలకు మద్దతిచ్చేలా బిల్లులో ఒకలా.. ప్రసంగాల్లో మరోలా ఉండేలా చేయడం.. అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా తప్పులో కాలేసినట్టే. ఇక బిల్లును వ్యతిరేకించే క్రమంలో విపక్షాల వాదన ఓ దశలో ఆచరణయోగ్యతను దాటిపోయిందనే అభిప్రాయాలు కూడా వచ్చాయి.

డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే.. నష్టం అని పదేపదే చెప్పిన విపక్షం.. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని సూచించలేకపోయింది. చివరకు మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలోనూ వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని వాదించిన విపక్షం.. సీట్లు పెంచి రిజర్వేషన్లు అమలు చేస్తే మాత్రం నష్టమేంటో సూటిగా చెప్పలేకపోయింది. అయితే రాజకీయంగా అధికార పక్షాన్ని నిలువరించడంలో మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో రాజ్యాంగ సవరణకు గురిపెట్టి.. టార్గెట్ 400 సీట్లు అన్న బీజేపీ.. చివరకు సొంతంగా మెజార్టీ కూడా సాధించలేక చతికిలపడింది. కానీ ఆ ఉద్దేశాన్ని వదలకుండా.. మరో మార్గంలో ముందుకొచ్చిందని విపక్షాలు అనుమానించాయి. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా లోక్‌సభలో 850 వరకు సీట్లు పెరిగితే.. ఎక్కువ సీట్లు ఉత్తరాదికి వస్తే.. అక్కడ రాజకీయ ఆధిపత్యం సాధించి.. అలా రాజ్యాంగ సవరణకు వీలైన మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతోనే.. మహిళా రిజర్వేషన్ల అమలును దానితో ముడిపెట్టి.. ఎవరూ కాదనలేని స్థితి కల్పించే ఎత్తు వేశారని గుర్తించింది. అందుకే కేంద్రం ఎన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. అంగీకరించకుండా గట్టిగా నిలబడ్డాయి.

ఇప్పుడు బిల్లు వీగిపోయాక అధికార పక్షం సరికొత్త వాదనను తెరపైకి తెస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ ప్రయత్నం ఆరంభమే కానీ అంతం కాదని చెబుతోంది. దీంతో విపక్షం కూడా దీటుగా సమాధానం చెబుతోంది. అసలు వీగిన బిల్లుకూ మహిళా రిజర్వేషన్ల అమలుకూ సంబంధం లేదని తేల్చేసింది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం మహిళా రిజర్వేషన్ల అమలు ప్రాతిపదికగా బిల్లు తెస్తే.. తాము ఒక్కరోజులో దానికి ఆమోదం దక్కేలా సహకరిస్తామని ఛాలెంజ్ చేస్తోంది. ఇలా అధికార, విపక్షాలు రాజకీయ సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎవరికి వారు రాజకీయ పరుగు పందెంలో వెనకపడకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ ఆ యావలో పడిపోయి.. ఈ దేశ మహిళల్ని ఎప్పుడో ఓడించేశారని సంగతిని వారు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏ సర్కారు అధికారంలోకి రావాలన్నా.. మహిళల ఓట్లే శ్రీరామరక్ష. ఈ సంగతి ప్రతి పార్టీ ఒప్పుకుంటుంది. అయినా సరే వారిని చట్టసభల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో అడ్డుకుంటూనే ఉన్నారు. నిజానికి 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాక.. దేశ మహిళలంతా ఇక చట్టసభల తలుపుులు తమ కోసం తెరుచుకుంటాయని భావించారు. కానీ సాంకేతిక కారణాలతో కూడా ఏళ్ల తరబడి తమకు గేట్లు మూసే ఉంచుతారని వారు కలలో కూడా అనుకోలేదు. కానీ అన్ని పార్టీలూ కలిసి దేశ మహిళల ఆశలపై మరోసారి నీళ్లు చల్లారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు తేవటానికి గత బిల్లును నోటిఫై చేశారని, అసలు ఇంతవరకు నోటిఫై కూడా చేయలేదనే విషయం తెలిసి యావత్ మహిళా సమాజం విస్తుపోయింది.

మొత్తం మీద మహిళా రిజర్వేషన్‌తో సంబంధం లేని అంశాల కోసం.. అలాంటి లక్ష్యాల సాధన కోసం.. అసలుకు ఎసరు వచ్చేలా పార్టీలు చేస్తాయని మహిళలు ఊహించలేదు. కానీ వారి ఊహలన్నింటినీ పటాపంచలు చేస్తూ.. పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలూ కలిసి నడిపిన మూడు రోజుల డ్రామా.. చివరకు వృథా ప్రయాసగా నిలిచింది. ఇప్పుడు ఈ ప్రహసనం చూశాక.. కేవలం మహిళలకే కాదు.. మొత్తం దేశ ప్రజలందరికీ కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. అసలు ఎవరు అడిగారని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టారు..? ఎవరు కోరారని మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇన్నాళ్లూ లేని విధంగా ఇప్పుడు ఇంత హడావుడి పడ్డారు..? లేని డిమాండ్‌ను సృష్టించి.. మహిళల్ని ఊరించి.. ఎందుకు వారిని నిరాశలో ముంచేశారు..? పార్టీలు రాజకీయం చేయటానికి వేదికగా పార్లమెంట్‌ను వాడుకుని ప్రజల్ని ఎందుకు ఫూల్స్‌ చేశారు..? ఇంకా ఇంత చేసి.. ఈ పొలిటికల్ డ్రామాని అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకోవాలనుకోవటం.. పార్టీల అతి తెలివితేటలా..? దేశ ప్రజలంటే అంత చులకనా..? మహిళలంటే అంత అలుసా..?. ఇక ముందైనా ఇలాంటి ప్రహసనాలకు తెరతీయకుండా రాజకీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఎవరికి వారు రాజకీయాలు చేసి.. దురుద్దేశాలతో వ్యవహరించి.. చివరకు అమాయకులమని పోజు పెట్టి.. జనం చెవిలో పూలు పెట్టడానికి పోటీపడుతూనే ఉంటారు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chairman s Desk
  • ntv
  • womens reservation bill

తాజావార్తలు

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!

  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions