Chairmans Desk : ప్రొడక్షన్ క్వాలిటీ పేరుతో జరుగుతున్నదేంటి..?

Charmans Des

Charmans Des

మొదట స్వర్ణయుగాన్ని.. తర్వాత డ్రీమ్‌ టైమ్‌ను చూసిన టాలీవు్డ్.. ఇప్పుడు మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తెలుగు సినిమాకు ప్రధాన సీజన్లలో ఒకటిగా చెప్పుకునే వేసవిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవటాన్ని విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత సమ్మర్‌ని ప్రధాన సీజన్‌గా భావించే తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇప్పుడిలా కనీస ప్లానింగ్ లేకుండా కనిపించడం టాలీవుడ్ దుస్థితికి అద్దం పడుతోంది. కొన్నేళ్ల క్రితం సమ్మర్ బెర్త్ కోసం టాప్ హీరోల దగ్గర నుంచి అప్‌ కమింగ్ హీరోల దాకా అందరూ సినిమాలు రెడీచేసేవారు. సినిమాకి మహారాజపోషకులైన విద్యార్థులకు దాదాపు నెల రోజుల పాటు సెలవులు ఉండే వేసవిలో నాలుగైదు సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యే అవకాశాలు ఉంటాయనేది అనుభవజ్ఞుల మాట. అందుకే గతంలో సమ్మర్ అంటే టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉండేది. చివరకు ఎంతో హైప్ క్రియేట్ చేసిన బాహుబలి-2 లాంటి సినిమా కూడా వేసవిలోనే రిలీజై రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగు సినిమా సత్తాను జాతీయస్థాయిలో చాటింది. మొన్నటికి మొన్న ఆస్కార్ వేదికపై మెరిసిన ఆర్ఆర్ఆర్ కూడా వేసవిలోనే రిలీజై అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా దమ్మేంటో చూపించింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సమ్మర్‌ను ఇప్పుడు టాలీవుడ్ ఎందుకు లైట్ తీస్కుంటోంది అనే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.. ఇక్కడ టాలీవుడ్ ఉద్దేశపూర్వకంగా సమ్మర్ కోసం ప్లాన్ చేయకపోవడం కాదు. కీలకమైన సమ్మర్‌లో కూడా సినిమా రిలీజ్ చేయలేనంత కష్టాల్లో కూరుకుపోయింది. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న టాలీవుడ్ కష్టాలు.. ఇప్పుడు ఊపిరిసలపని స్థాయికి చేరాయనే వాదన వినిపిస్తోంది. అయితే కింద పడ్డా పైచేయి మాదే అన్న చందంగా.. ఇంకా వాస్తవాలు ఒప్పుకోవటానికి టాలీవుడ్ పెద్దలకు మనసు రావడం లేదు. ఇప్పటికీ అంతా బాగుందనే భ్రమల్ని వ్యాప్తి చేయటానికే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ దుస్థితిని కాస్త లోతుగా తరచి చూస్తే.. నిర్మాతలపై మోయలేని అప్పుల భారాలు, హీరోలు, డైరక్టర్ల రెమ్యూనరేషన్ ఇమేజ్ బిల్డప్పులు.. అన్నింటికీ మించి సినిమా క్వాలిటీ పేరుతో జరుగుతున్న ప్రహసనం.. అన్నీ కలిసి.. తెలుగు సినీ పరిశ్రమను నడిసంద్రంలో ముంచేస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

దేశంలోనే ఎక్కువ సినిమాలు తీసే చిత్రపరిశ్రమగా టాలీవుడ్‌కు గుర్తింపు ఉంది. చివరకు సినిమా మార్కెట్‌ను ఎలా పెంచాలో కూడా టాలీవుడ్‌.. మిగతా చిత్రపరిశ్రమలకు దారిచూపిందనడంలో సందేహం లేదు. గతంలో కాలానుగుణంగా ఎన్నో ప్రయోగాలు మొదట చేసింది కూడా తెలుగు చిత్రపరిశ్రమే. అలాంటి టాలీవుడ్ ఇప్పుడు సినిమాలు ఎలా తీయాలనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతుక్కునే దుస్థితిలో ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ.. ఇంకా చెప్పాలంటే మూకీల కాలం నుంచీ సినిమా స్థాయిని ఓ క్రమపద్ధతిలో పెంచుకుంటూ వెళ్లిన టాలీవుడ్.. ఇటీవలి కాలంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకునే సంస్కృతిని ఒంటబట్టించుకుంది. దీంతో వరుస అపజయాలు పలకరిస్తున్నాయి. అసలు హిట్టు, ఫ్లాపుల సంగతి పక్కనపెడితే.. చివరకు కనీసం సేఫ్‌ బడ్జెట్‌తో సినిమా తీయడమెలాగో కూడా టాలీవుడ్ మర్చిపోయింది. అంతకంటే ఘోరంగా కీలకమైన సీజన్లలో సినిమాలే రిలీజ్ చేయలేని దుస్థితికి జారిపోయింది. చిన్నవిగా మొదలైన సమస్యల్ని ఆదిలోనే పట్టించుకోకుండా లైట్ తీస్కోవడమే దీనికి ప్రధాన కారణమని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతలు, హీరోలు, డైరక్టర్లు.. ఎవరి పరిధుల్లో వారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. సాఫీగా నడవాల్సిన టాలీవుడ్ రైలు.. ఇప్పుడు పట్టాలు తప్పుతోంది. దీనికి ఎవరో ఒక్కర్నే నిందించలేం. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా.. ఈ దుస్థితికి అందరూ బాధ్యత వహించాల్సిందే.

సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అనే వాడు.. బలిపశువుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. సినిమా తీయడం అనే ఒక వ్యసనం నిర్మాతలను పూర్తిగా సర్వనాశనం చేసింది. ఇవాళ ఇండస్ట్రీలో కేవలం మూడు నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సినిమా నిర్మాణం అనేది పులి మీద స్వారీగా మారిపోయింది. నిర్మాతలు.. అప్పుల బారిన పడి లోన్లు తీసుకోవడానికి స్థానిక ఫైనాన్సియర్లు సరిపోక ముంబై వీధుల్లో బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం.. సినిమానిర్మాణ ఖర్చు విపరీతంగా పెరిగిపోవడమే.

సొంత డబ్బు మాత్రమే పెట్టి సినిమా తీసే నిర్మాతలు మన దగ్గర చాలా తక్కువ. ఫైనాన్స్ లో డబ్బు తీసుకొచ్చి.. సినిమాకు ఇన్వెస్ట్ చేసే పద్ధతిలోనే మేజర్ పార్ట్ అఫ్ ప్రొడక్షన్ షురూ అయ్యేది. ఈ క్రమంలో డిమాండ్ ని బట్టి, టైం పీరియడ్ ని బట్టి వడ్డీ శాతం 10 రూపాయల దాకా ఉంటుంది. ఈ లెక్కన సినిమా రిలీజ్ నెలరోజులు వాయిదా పడితే.. అదనంగా పడే భారం ఎంత? ఫైనల్ కాపీ రెడీ చేసుకుని కూడా దాదాపు ఏడాది పాటు రిలీజ్ ని ఆపుకున్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ పరిశ్రమ భవిష్యత్తును కూడా నిర్దేశించేవే.

అదుపు తప్పుతున్న బడ్జెట్ కూడా సినిమాల కొంప ముంచుతోంది. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో 70 శాతం హీరో, హీరోయిన్, డైరక్టర్ రెమ్యూనరేషన్ కే పోతోంది. మిగతా కాస్త డబ్బులతో తీసే సినిమాకు అనుకున్న క్వాలిటీ రావడం లేదు. దీంతో ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. నిజానికి మన దగ్గర ఇప్పటికీ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. కరోనా టైమ్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా టాలీవుడ్ థియేటర్లే కళకళలాడాయి. కానీ అందుకని చెత్త సినిమాలు వదిలితే చూసేది లేదని ఆడియన్స్ తేల్చిచెబుతున్నారు. కొన్ని సెలక్టెడ్ సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటున్నాయి. క్రేజీ కాంబినేషన్ ఉన్నా.. కథ లేకపోతే లాసుల తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో థియటర్ యజమానులు సినిమాహాళ్ల నిర్వహణకు కూడా డబ్బులు రావడం లేదని స్వచ్ఛందంగా థియేటర్లు మూసేస్తున్నారు. ఈ ధోరణి కూడా నిర్మాతలకు గుబులు పుట్టిస్తోంది.

ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్‌ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్‌ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్‌ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి.

ఒకప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతకు చాలా గౌరవం ఉండేది. పెద్ద పెద్ద హీరోలు కూడా వారిని గౌరవించేవాళ్లు. కానీ తర్వాత నిర్మాతలే వాళ్ల స్థాయ తగ్గించుకున్నారనే వాదన ఉంది. నిర్మాత అజమాయిషీ ఉన్నన్నాళ్లూ చాలా వరకు బడ్జెడ్ అదుపులోనే ఉంది. ఎప్పుడైతే నిర్మాత, క్యాషియర్ పాత్రకు పరిమితమయ్యాడో.. బడ్జెట్ కడా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. నిర్మాతలకు సినిమా తెరకెక్కే విధానంపై అవగాహన లేకపోవడం కూడా బడ్జెట్ పెరుగుదలకు కారణమౌతోంది. నిర్మాత, దర్శకుడితో కూర్చుని.. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించకపోతే.. టాలీవుడ్ ని దేవుడు కూడా కాపాడలేడని సీనియర్లు చెబుతున్నారు. అనవసర ఆర్భాటాలు తగ్గించుకుంటే.. సినిమా బడ్జెట్ ఆటోమేటిగ్గా తగ్గుతుంది.

 

రెండు నెలల్లో తీయాల్సిన సినిమాను.. నాలుగైదేళ్లకు దాటించి ప్రొడక్షన్ క్వాలిటీ పేరుతో నిర్మాతల రక్తం తాగేస్తున్నారు డైరెక్టర్లు. ఐదారుగురు డైరెక్టర్ల విశృంఖల చేష్టల వల్లే ఇండస్ట్రీ మట్టిలో కలిసిపోయే ప్రమాదం వచ్చింది. అసలే ఆర్థిక మాంద్యం, ఆ పై యుద్ధం, వెరసి సినిమా రంగం కూడా కుప్పైపోయింది. డైరెక్టర్లు, హీరోలు.. సినిమా ఇండస్ట్రీకి విలన్లుగా మారారు. అసలు సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం హీరోలే. ఒక్కో హీరోకి వందల కోట్ల రెమ్యూనరేషన్ దేనికి..? సినిమా నిర్మాణపు ఖర్చులో 75శాతం హీరో పారితోషకంగా వెళ్లిపోతే, సినిమా ఎలా బతుకుతుంది. బ్రాండ్ ఇమేజ్ పేరుతో .. హీరోలు చేస్తున్న దాష్టీకం వల్లే ఇవాళ సినిమా ఇండస్ట్రీ కొనఊపిరి స్థితికి వచ్చింది. ఇండస్ట్రీ మొత్తం మీద ఒక్క ప్రొడ్యూసర్ కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్పుకునే పరిస్థితి లేదు. వందకు రెండు నుంచి ఐదు రూపాయల వడ్డీలకు తెచ్చి సినిమాలు తీసి ఏ నిర్మాత బాగుపడతాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నాళ్లకు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నిర్మాతల ఆత్మహత్యలు తప్పవు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫాల్స్ ప్రెస్టేజీలో బతుకుతోంది. ఈ కలెక్షన్లు బోగస్. హీరోల ఇమేజ్ బోగస్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, భజన ఇంటర్వ్యూలు అన్నీ బోగస్. ఫైనల్‌గా ప్రొడ్యూసర్ల వందలకోట్ల అప్పులు మాత్రమే నిజం. హీరో డామినేషన్ తగ్గినప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది.

రెమ్యూనరేషన్లు మార్కెట్ ను బట్టి నిర్మాతలు ఫిక్స్ చేయాలి కానీ.. హీరోల డిమాండ్లకు తలొగ్గడమేంటనే వాదన కూడా ఎప్పట్నుంచో ఉంది. కాన ఆ దిశగానూ ముందడుగు పడలేదు. హీరోయిన్ ఎవరుండాలో కూడా హీరోలే డిసైడ్ చేస్తుండటంతో. బడ్జెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. డైరక్టర్లు కూడా మరింత భారంగా మారుతున్నారు. ఎవ్వరూ నిర్మాతను సపోర్ట్ చేయడం లేదు. కిందివాళ్ల కష్టాలు అసలే పట్టించుకోవడం లేదు. దీంతో టీమ్ స్పిరిట్ మిస్సవుతోంది. ఎవరికి నచ్చినట్టు వాళ్లుంటున్నారు. అంతిమంగా సినిమా నష్టపోతోంది.

తెలుగు సినిమాకు ముందునుంచి నిర్మాతే హీరో.ఆ తర్వాత కథానాయకుడు వచ్చి పీఠమెక్కాడు.అక్కడనుంచి దర్శకునివైపు కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ గా సినిమా ప్రయాణం మొదలైంది.ఈ క్రమంలో నిర్మాత రానురాను తన మునుపటి వైభవాన్ని కోల్పోతూ వచ్చాడు.కేవలం ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉన్న సంస్థలు మాత్రమే అప్పటినుంచి ఇప్పటికీ తమ పలుకుబడిని చూపిస్తూ సినిమాలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో పోస్టర్ పై వచ్చే నిర్మాతల పేర్లు చూసి…. సినిమా ఎలాంటిదో ఇట్టే చెప్పేసేవారు.నిర్మాతలు తమ అభిరుచులకు తగ్గ కథలనే దర్శకులతో తీయించేవారు.రానురాను ఆ కల్చర్ కనుమరుగైపోతుంది.కేవలం కొందరు హేమాహేమీలు మాత్రమే ఇప్పటికీ ఆ పాత కల్చర్ ను కొంతలో కొంత మెయిన్ టైన్ చేయగలుగుతున్నారు.

ఇక్కడ మరో కీలకమైన అంశం మార్కెట్. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా తీయాల్సిన సినిమాలను.. ఓవర్ ఎక్స్ పెక్టేషన్లతో నిర్మించడం కూడా నష్టాలు తెచ్చి పెడుతోంది. ఓ హీరో మార్కెట్ ను బట్టి అతడికి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అలాగే హీరోయిన్ కు ఉన్న క్రేజ్, హిట్లు, ఫ్లాపుల పర్సంటేజ్ ను బట్టి పారితోషికం ఇవ్వాలి. డైరక్టర్ కూ ట్రాక్ రికార్డ్ చూసి డబ్బులివ్వాలి. కానీ టాలీవుడ్ లో ఒకప్పుడు ఉన్న ఈ ట్రెండ్.. ఇప్పుడు ఉందా అంటే లేదనే చెప్పాలి. బాహుబలి ఆలిండియా లెవల్లో బాగా ఆడేసిందని ప్రతి సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడం సరైన పద్ధతి కాదు. ఇలా పాన్ ఇండియా పేరు చెప్పి.. మామూలు హీరోలు, డైరక్టర్లు కూడా విపరీతంగా రెమ్యూనరేషన్లు పెంచుకుని.. నిర్మాతలకు భారంగా మారుతున్నారు.

సినిమా ఇండస్ట్రీ బతకాలంటే.. అందరి రెమ్యూనరేషన్లూ కలిపి మొత్తం బడ్జెట్లో 30 శాతం లోపే ఉండాలనేది ఆరోగ్యకరమైన ఆర్థిక సూత్రం. ఈ సూత్రం పాటించినన్ని రోజులూ టాలీవుడ్ బాగానే ఉంది. ఎప్పుడైతే రెమ్యూనరేషన్లకు రెక్కలొచ్చాయో.. అలాగే కంటెంట్ మీద కాకుండా ఇతరత్రా పెట్టే ఖర్చుల్ని.. సినిమా బడ్జెట్లో చూపించడం మొదలైందో.. అంతే అప్పట్నుంచీ చెడ్డరోజులు మొదలయ్యాయి. కొంతమంది సినిమా టికెట్ ధరలు పెంచుకోవటానికి కూడా భారీ బడ్జెట్ చూపిస్తున్నారు. అలా అయితే ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసుకుని.. డబ్బులు దండుకోవచ్చని అనుకుంటున్నారు. కొన్నాళ్లు ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయినా.. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ కు కూడా సినిమాలు నిలబడకుండా పోవటానికి అదే కారణమైంది. ఇప్పుడైతే మరీ దారుణంగా రిలీజైన సినిమాల ఫస్ట్ షోలే ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. మరికొన్ని సినిమాలకు అడ్వాన్సు బుకింగులే దడ పుట్టిస్తున్నాయి.

ఆ రోజుల్లో అయినా.. ఈరోజుల్లో అయినా సినిమాను మార్కెట్ సూత్రాలకు అనుగుణంగానే నిర్మించాలి. అలాగే మార్కెట్ చేయాలి. రెమ్యూనరేషన్ల విషయంలో పెడ పోకడలకు కచ్చితంగా కళ్లెం వేయాల్సిందే. గతంలో మాదిరిగా ఆరోగ్యకర వ్యాపారానికి తెర లేవకపోతే మాత్రం.. టాలీవుడ్ మనుగడ కష్టమయ్యే ప్రమాదం పొంచి ఉంటుందనడంలో సందేహం లేదు. హీరోలైనా.. ఎవరైనా పరిశ్రమ బాగుంటేనే పచ్చగా ఉంటారు. అంతే కానీ బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకుతిన్నట్టుగా చేస్తామంటే.. చివరకు మిగిలేది ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి.

ఇవాళ ఒక సినిమాకు 10-15 కార్వాన్‌లను వాడుతున్నారు. జూనియర్‌ ఆర్టిస్టులకు కూడా కార్వాన్‌లు ఇస్తున్నారు. దీంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతోంది. వందకు మూడు రూపాయలకు వడ్డీలు తెస్తున్నారు. ఒక్కోక్క సినిమాను సంవత్సరాలకు సంవత్సరాలు తీస్తుంటే, రెండేళ్లు తీస్తుంటే వడ్డీలు కట్టలేక…నిర్మాతలు మట్టైపోతున్నారు. చివరకు సినిమా సూపర్‌ హిట్ అయినప్పటికీ కూడా ఏ నిర్మాతకు డబ్బులు రాని దుస్థితి వచ్చేసింది. హీరో, హీరోయిన్ల, దర్శకుల రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్‌, వీటితోనే నిర్మాత పనైపోతోంది.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మళ్లీ పాత పద్ధతికి వెళ్తేనే టాలీవుడ్ బాగుపడుతుంది. నిర్మాతలు అర్జెంట్ గా ఆత్మపరిశీలన చేసుకుని.. సినిమా నిర్మాణంపై అవగాహన పెంచుకుని.. అప్పుడు బరిలోకి దిగాలి. అంతే కానీ ఓ హీరోని, హిరోయిన్ ని, డైరక్టర్ ని నమ్మేసి.. వారే సినిమాను గట్టెక్కించేస్తారని గుడ్డిగా నమ్మితే.. పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. అందుకే ఇతరుల్ని నిందించే ముందు నిర్మాతలు మారాలి. అప్పుడు మిగతా వారిని మారాలని చెప్పడానికి కూడా బాగుంటుంది. ఎవరేమనుకున్నా సినిమాకు నిర్మాత తండ్రి లాంటి వాడని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా.. సినిమా బాగోగులకు బాధ్యత తీసుకోవాల్సింది నిర్మాతే. ఆ విషయం గుర్తుంచుకుని సినిమాలు తీస్తే.. కచ్చితంగా భారీ లాభాలు రాకపోయినా.. విపరీతంగా నష్టాలైతే రావనేది ఇప్పటికే రుజువైన సత్యం. అయనా సరే నిర్మాతలు కళ్లు తెరవకుండా ఇలాగే ఉంటే.. వారి రాత మారదనేది సుస్పష్టం.