Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?

Congress

Congress

రెండున్నరేళ్లుగా నిమ్మళంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో.. ఇటీవల అపస్వరాలు వినిపిస్తున్నాయి. సీఎంకు వ్యతిరేకంగా ఒకరు, పార్టీ లైన్ దాటి మరొకరు.. తనకు అన్యాయం జరుగుతుందని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరుగా నేతలు గళం విప్పడం.. పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. చివరకు క్రమశిక్షణ కమిటీ షోకాజులిచ్చిన తర్వాత కూడా కొన్ని వ్యవహారాలు మరింత ముదురుతున్నాయి. ఏదో ఓ కారణంతో కొందరు నేతలు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలు.. చేజేతులా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందా అని కాచుక్కూర్చున్న ప్రత్యర్థులు.. పండగ చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలే ఇస్తున్నారు. దీంతో పదేళ్ల కష్టం తర్వాత వచ్చిన అధికారాన్ని పదిలపరుచుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది. సీఎం రేవంత్ అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా.. ఎక్కడైనా గ్యాప్ వస్తుందేమో చూసుకోవాలి. భిన్నస్వరాల్ని మొదట్లోనే చక్కదిద్దకపోతే.. తర్వాత సమస్య పెద్దదయ్యే ప్రమాదం లేకపోలేదు. మొత్తం మీద సామదానభేదదండోపాయాల్ని ప్రయోగించి అయినా.. నేతలందర్నీ దారికి తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాతగానీ అధికారం సంపాదించుకోలేక పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, అందుకు భారీ మూల్యాన్ని చెల్లించి, తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చికూడా, రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందడానికి, పదేళ్లు వేచి చూడాల్సి వచ్చింది ఆ పార్టీకి. చివరికి 2023లో గానీ చేసిన త్యాగాలకూ, పడ్డ కష్టాలకూగానీ ఫలితం దక్కలేదు. కానీ, ఇంత శ్రమించి, సమష్టిగా కృషిచేసి, తెచ్చుకున్న అధికారాన్ని కాంగ్రెస్ నేతలు చేజేతులా జారవిడుచుకుంటున్నారా? పార్టీని నాశనం చేసుకుంటున్నారా? అనే అనుమానం ప్రజల్లో బాగా వచ్చేసింది.

తినే కంచంలో మట్టిపోసుకోవడం కాంగ్రెస్‌కు కొత్తేం కాదు. ఇప్పుడా పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభం చూసి, జనం దటీజ్ కాంగ్రెస్ అని మాట్లాడుకుంటున్నారు. మంత్రి పదవి రాలేదని ఒకరు.. అడిగింది ఇవ్వలేదని మరొకరు.. గౌరవం దక్కడం లేదని వేరొకరు.. ఇలా ఎవరికివాళ్లు తిరుగుబాటు జెండాను ఎగురవేసి, జనంలో పార్టీని చులకన చేశారు. వ్యక్తిగత స్వార్థాలకోసం, సొంత ఉనికి కోసం, సీఎంని ధిక్కరించాలని కొందరు చేస్తున్న ప్రయత్నం.. చివరికి పార్టీ పుట్టిముంచబోతోందని గ్రహించలేకపోతున్నారు.

కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు. సొంత పార్టీ నేతలే ఆ పని చేస్తారనేది దశాబ్దాలుగా రాజకీయవర్గాల్లో నానుతున్న మాటే. కానీ మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వచ్చిన దగ్గర్నుంచీ.. కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. మధ్యలో అడపాదడపా చిన్న చిన్న ఇష్యూలు వచ్చినా.. ఎక్కడా ఎవరూ కట్టు దాటలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొత్త మురిపెంలే.. ఆర్నెళ్లు ఆగనీ అనుకున్నారు. కానీ ఆర్నెళ్లు కాదు.. ఏడాది, రెండేళ్లయ్యాక కూడా టీకాంగ్రెస్ ఒక్కతాటిపైనే నిలబడింది. అంతేకాదు ఒకరిద్దరు నేతల్ని రెచ్చగొట్టాలని చూసినా.. పార్టీ అంతా ఒక్కటే. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుంటాం. మాలో మేమే సర్దుకుంటాం అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తికావడంతో.. ఇంకా ఉపేక్షిస్తే మొదటికి మోసం అనే ఉద్దేశంతో కొందరు నేతలు తమ అసంతృప్తిని బట్టబయలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు, ప్రభుత్వ స్థిరత్వం గురించి ఆలోచించిన నేతలు కూడా.. ఇప్పుడు పూర్తిగా స్వార్థం చూసుకుంటున్నారు. అదేమంతే ఇప్పటికే పలు స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేశామని, అంతర్గతంగా పార్టీలో పలుమార్లు ప్రస్తావన తర్వాత కూడా న్యాయం జరగకపోవడంతోనే.. మాట్లాడాల్సి వస్తోందని సమర్థించుకుంటున్నారు.

సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. నేతలందరికీ పదవులు ఇవ్వడం కుదరదు. ఇక కాంగ్రెస్ లాంటి గట్టి కాంపిటీషన్‌ ఉండే పార్టీ ఉన్నప్పుడు అది మరీ కష్టం. ఈ సంగతి రేవంత్ దగ్గర్నుంచి పీసీసీ చీఫ్ దాకా చాలాసార్లు చెప్పారు. పదవులు రానంత మాత్రాన గుర్తింపులేదని అనుకోవద్దని హితవు చెబుతూనే ఉన్నారు. కానీ తమకు పదవి లేనప్పుడు పార్టీకి పవర్ ఉండి ప్రయోజనమేంటనే రీతిలో కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. పైగా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా.. ఎప్పుడో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయాలని అడుగుతున్నారు. అవి ఎందుకు కాలేదో అగ్రనేతలు సర్దిచెబుతున్నా.. వినిపించుకోవడం లేదు. ఈ ప్రాసెస్‌లో కొందరు పదవిచ్చాకే మాట్లాడదాం అంటున్నారు. ఇంకొందరైతే అన్ని హద్దులూ దాటేసి.. అసలు మీరు పదవిచ్చేదేంటి..? మేమే తీసుకుంటాం అంటున్నారు. ఇంకా మాట్లాడితే హైకమాండ్ అంటే గౌరవమే.. రాష్ట్రస్థాయి నేతల్ని మాత్రం విమర్శిస్తాం అంటున్నారు.

సరిగ్గా ఇలాంటి తీరుతోనే గతంలో తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే సంగతిని నేతలు కన్వీనియంట్‌గా మర్చిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో గ్రూపుల్ని సెట్ చేసిన తర్వాతే అధికార పీఠం దక్కిందని ఇప్పుడు ఈ మాట్లాడే నేతలకు గుర్తుందా.. అంటే చెప్పడం కష్టమే. పైగా ఎవరేమనుకున్నా మేమింతే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ప్రమాదం ముంచుకొచ్చే ముందే టీకాంగ్రెస్ మేలుకోవాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే, ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టే. ఇక సమయం లేదు. వ్యూహాత్మకంగానో, నయాన్నో, భయాన్నో నాయకులను దారికి తీసుకురాలేకపోతే కాంగ్రెస్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.