NTV Telugu Site icon

Work From Office: ఆఫీసుకు వెళుతున్నాం కదా! ఇంకా ఆ పాత బట్టలేనా? కొనేద్దాం కొత్తవి!!

Work From Office

Work From Office

Work From Office: మన దేశంలో కరోనా తగ్గుముఖం పట్టి వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ ఊపందుకోవటంతో టాప్‌ బ్రాండ్‌ల క్లాత్స్‌, కాస్మెటిక్స్‌, జ్యూలరీ సేల్స్‌ పెరిగాయి. వర్క్‌ ఫ్రం హోం ముగియటంతో పైజామాలకు గిరాకీ తగ్గింది. వాటి స్థానంలో పవర్‌ సూట్ల కొనుగోళ్లు పెరిగాయి. కార్యాలయాలకు వెళ్లేవాళ్లు ఎక్కువగా వేసుకునేది కుర్తాలు, బ్లేజర్లు, ఫార్మల్‌ వైట్‌ షర్ట్‌లేనని ఆన్‌లైన్‌ రిటైల్‌ బ్రాండ్‌ మింత్రా తెలిపింది. ఇవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయని పేర్కొంది. పండగ సీజన్‌ కూడా మొదలవటంతో వస్త్ర వ్యాపారం మరింత జోరుగా సాగనుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

అందరిలోనూ ఆసక్తి

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 45వ వార్షిక సాధారణ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మీటింగ్‌లో బోర్డ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ.. షేర్‌ హోల్డర్లను, సంస్థ భాగస్వాములను ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారా అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 5జీ జియోఫోన్‌ లాంఛింగ్‌ లాంటి కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని వ్యాపార వర్గాలు అంటున్నాయి. రిటైల్‌, టెలికం, న్యూ ఎనర్జీ తదితర ప్రధాన బిజినెస్‌లకు సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తారని భావిస్తున్నాయి.

Top Five Software Companies in the World: ప్రపంచంలోని టాప్‌ ఫైవ్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి సంక్షిప్త వివరాలు.. బిజినెస్‌, జనరల్‌ నాలెడ్జ్‌ కోసం..

గోయెల్‌ అధ్యక్షతన

వచ్చే నెలలో జరగనున్న విదేశీ వాణిజ్య సలహా మండలి సమావేశానికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది. 2022-27 మధ్య కాలంలో అనుసరించబోయే విదేశీ వాణిజ్య విధానంపై ఈ సమావేశంలో ఫోకస్‌ పెట్టనున్నారని సమాచారం. తద్వారా దేశీయ తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్లే విధివిధానాలపై చర్చించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ప్రతినిధులు పాల్గొంటారు.

రెండేళ్ల కనిష్టానికి

ఈ నెల 19వ తేదీ నాటికి మన దేశ విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 7 రోజుల్లో 6.7 బిలియన్‌ డాలర్లు తగ్గటంతో ప్రస్తుతం 564 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. 2020 అక్టోబర్‌ తర్వాత ఇండియా విదేశీ మారక నిల్వలు ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోలేదు. రూపాయి విలువ ఇంకా పతనం కాకుండా ఉండేందుకు డాలర్లను ఫారన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో దూకుడుగా విక్రయిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

‘ఫిఫా’కి రెడీ

ఫిఫా వరల్డ్‌ కప్‌ టూరిజం బూమ్‌ని సొమ్ము చేసుకునేందుకు గల్ఫ్‌ దేశం ఖతార్‌ సిద్ధమవుతోంది. 10 లక్షల మందికి పైగా ఫ్యాన్స్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరిగే దోహా సిటీకి వరల్డ్‌ కప్‌ సమయంలో నిత్యం కొత్తగా 90కి పైగా విమానాల్లో సాకర్‌ అభిమానులు చేరుకుంటాయని ఆశిస్తోంది. 40 విమానాల్లో మాత్రమే ప్రయాణికులు యూఏఈ నుంచి తిరిగి వెళతారని, మిగతా ప్యాసింజర్లందరూ అక్కడే బస చేస్తారని పేర్కొంటోంది. ఫిఫా వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌, హోటళ్లు, హాస్పిటాలిటీ తదితర రంగాలు లాభపడతాయని ఖతార్‌ చెబుతోంది.

ఫీజు తీసుకోవద్దు

కస్టమర్లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా చెల్లింపులు చేస్తే పేమెంట్‌ యాప్‌లు ప్లాట్‌ఫాం ఫీజులను వసూలు చేయొద్దని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. యూపీఐ సర్వీసును ప్రజా ప్రయోజనం రీత్యా ఉచితంగా అందించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెబుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ ఆదేశాలను జారీ చేయటం విశేషం. యూపీఐ లావాదేవీల్లో అత్యధిక వాటా కలిగిన ఫోన్‌ పే గతేడాది మొబైల్‌ రీఛార్జ్‌లతోపాటు కొన్ని పేమెంట్లకు ఛార్జి వేసింది. పేటీఎం కూడా ఈ ఏడాది జులైలో బిల్‌ పేమెంట్లపై రూపాయి ఫీజు తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ స్పందించాల్సి వచ్చింది.

 

Show comments