రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై పడుతోంది. వినియోగదారులకు అనుగుణంగానే అందుబాటులోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీపై మొగ్గుచూపుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ ఏజీ భారత విపణిలోకి వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కారును వచ్చే ఏడాది పరిమితంగా భారత్‌లో విక్రయించనున్నది వోక్స్ వ్యాగన్. వచ్చే సెప్టెంబర్‌లో `ఐడీ.4` ఎలక్ట్రిక్ కారును ప్రయోగాత్మకంగా వోక్స్ వ్యాగన్ పరీక్షించనున్నది. వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డివిజన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా మాట్లాడుతూ.. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు తేనున్నట్లు తెలిపారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది పరిమిత సంఖ్యలో కార్లు దిగుమతి చేసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఎటువంటి అధికారిక అనుమతులు అవసరం లేకుండా కేవలం 2500 కార్లను దిగుమతి చేసుకునేందుకు కార్ల తయారీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి అనుగుణంగానే అశీష్ గుప్తా ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్‌లోకి తీసుకొస్తామన్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్ చైన్‌లో ఇబ్బందుల వల్ల 2500 కార్లను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు అశీష్ గుప్తా.
