Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!

  • ఏకంగా రూ.23 వేల కోట్ల ఏజీఆర్ బకాయిల తగ్గింపు
  • గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలు
  • తాజా తగ్గింపుతో రూ.64,046 కోట్లకు చేరిన బకాయిలు

Vodafone Idea: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘సంజీవని’ని అందించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల లెక్కల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలను సవరించిన టెలికాం శాఖ (DoT), కంపెనీకి భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీపై ఉన్న దాదాపు రూ.23,649 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. ఏజీఆర్ లెక్కింపుపై టెలికాం కంపెనీలు, ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం, వీఐ బకాయిలను భారీగా తగ్గించారు. గతంలో రూ.87,695 కోట్లుగా ఉన్న ఏజీఆర్ బకాయిలను ఇప్పుడు రూ.64,046 కోట్లకు సవరించారు. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

వాయిదాల పద్ధతిలో చెల్లింపులు..
బకాయిలను తగ్గించడమే కాకుండా, వాటిని చెల్లించే గడువును కూడా కేంద్రం వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి నాటికి కంపెనీ చెల్లించాల్సిన రూ.16,400 కోట్ల భారం ప్రస్తుతం తప్పుకుంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున చెల్లించాలి. మిగిలిన భారీ మొత్తాన్ని 2035-36 నుంచి 2040-41 మధ్య ఆరు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని నివారించేందుకు కేంద్రం వరుసగా వీఐని ఆదుకుంటూ వస్తోంది. ఇప్పటికే 2021 ప్యాకేజీ కింద బకాయిల వడ్డీని ఈక్విటీగా మార్చడంతో ప్రభుత్వానికి కంపెనీలో 33% వాటా లభించింది. ఇప్పుడు ఏజీఆర్ తగ్గింపుతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడనుంది.

జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా..
ప్రస్తుతం కంపెనీపై రూ.2 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీకి నగదు లభ్యత పెరిగి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ నిధులతో నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసి, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు వీఐ సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.