Trade War: అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరోసారి ముదిరింది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో టారిఫ్‌ల పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా తాజాగా వందలాది అమెరికా ఉత్పత్తులపై 15%, 25%, 50% వరకు టారిఫ్‌లను అమలు చేసింది. ఈ కొత్త సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. కెనడా విధించిన కౌంటర్ టారిఫ్‌ల పరిధిలో అమెరికాకు చెందిన సుమారు 700 ఉత్పత్తులు ఉన్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, పల్ప్, పేపర్ తదితర రంగాలకు చెందిన వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం సుమారు 27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఈ కొత్త టారిఫ్ ప్రభావం పడనుంది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని ఉత్పత్తులపై గతంలో ఉన్న 25 శాతం కౌంటర్ టారిఫ్ ఇప్పుడు 50 శాతానికి పెరిగింది. కెనడా ప్రభుత్వం ఈ చర్యలను తమ కార్మికులు, రైతులు, తయారీ రంగాన్ని రక్షించేందుకు తీసుకున్నట్లు పేర్కొంది.
చర్చలు విఫలం.. ప్రతీకార చర్యలు
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య చర్చలు గత నెలలో విఫలమైన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా కెనడా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడంతో వాటికి సమానంగా స్పందించాలని కెనడా నిర్ణయించింది. సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సుంకాలు అమెరికా విధించిన రేట్లకు అనుగుణంగా 15%, 25%, 50%గా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కెనడా ప్రతీకార చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరింత కఠినంగా స్పందించారు. సెప్టెంబర్ 15 నుంచి కొన్ని కెనడా ఉత్పత్తులపై అదనపు చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి దిగుమతి అయ్యే కొన్ని డెయిరీ ఉత్పత్తులు, ఆల్కహాల్, మోటార్ సైకిళ్లపై సెప్టెంబర్ 29 నుంచి దిగుమతి నిషేధాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. తాజా పరిణామాలతో అమెరికా – కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఒత్తిడికి గురవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాణిజ్యంపై గణనీయంగా ఆధారపడటంతో.. ఈ టారిఫ్ పోరు కొనసాగితే వ్యాపార సంస్థలు, తయారీ రంగం, వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

