Uber Layoff: ఆర్థికమాంద్యం భయాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ఇతర కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగుల్ని దశలవారీగా తొలగించుకుంటూ వస్తున్నాయి.
Read Also: BJP Door to Door: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ.. కరీంనగర్ ప్రజలతో బండి సంజయ్
తాజాగా ఉబర్ కంపెనీ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 200 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల రిక్రూటింగ్ విభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ విభాగంలో 35 శాతం అంటే 200 మంది ఉద్యోగులకు స్వస్తి పలకనుంది. 32,700 మంది ఉద్యోగులు ఉన్న ఉబర్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. ఇది తన గ్లోబర్ వర్క్ ఫోర్సులో 1 శాతంగా ఉంది. తాజాగాా రిక్రూట్మెంట్ టీమ్ లో కోతలు పెట్టింది. 2020 మధ్యలో మహమ్మారి ప్రారంభంలో ఉబర్ తన సిబ్బంది సంఖ్యను 17 శాతం తగ్గించింది.
ఉబర్ ప్రత్యర్థి లిఫ్ట్ తో పోలిస్తే ఉబర్ తక్కువ సంఖ్యలో ఉద్యోగులన్ని తొలగిస్తుంది. ఏప్రిల్ నెలలో లిఫ్ట్ తన ఉద్యోగుల్లో 26 శాతం మందిని అంటే 700 మందిని తొలగించింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక మందగమనం కారణంగా ఖర్చల్ని తగ్గించడం, అదుపులో పెట్టుకునేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా లేఆఫ్స్ ప్రకటించాయి.
పెరుగుతున్న వడ్దీ రేట్లు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రానున్న కాలంలో యూఎస్, యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడుతాయనే వార్తల నేపథ్యంలో ఐటీ కంపెనీల పరిస్థితి కష్టతరంగా మారుతోంది. రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది.