Today(20-12-22) Stock Market Roundup: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం శుభారంభమైనప్పటికీ ఇవాళ మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టింది. లాభం అనేది ఒక్క రోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ రోజు మొత్తం లాస్‌లోనే నడిచింది. సెన్సెక్స్ 103 పాయింట్లు కోల్పోయి 61 వేల 702 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 18 వేల 388 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 50 స్టాక్స్‌లో 39 స్టాక్స్‌కి నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్ మంచి ఫలితాలను కనబరిచాయి.
మార్కెట్ రికవరీకి ముందు వరుసలో నిలిచి తోడ్పడ్డాయి. డాబర్ ఇండియా, పేజ్ ఇండ్స్, ఎస్‌సీఐ సంస్థలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల విలువ 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ హండ్రెడ్, స్మాల్‌క్యాప్ హండ్రెడ్ ఒక శాతం వరకు డౌన్ అయ్యాయి. మీడియా, ఆటోమొబైల్, రియాల్టీ సూచీలు కూడా ఒక శాతానికి పైగా నేల చూపులు చూశాయి. వ్యక్తిగత స్టాక్స్ వారీగా చూస్తే.. సలాసర్ టెక్నో కంపెనీకి 748 కోట్ల రూపాయల ప్రాజెక్టు లభించటంతో సంస్థ స్టాక్స్ వ్యాల్యూ 8 శాతం పెరిగింది.
రంగాల వారీగా పరిశీలిస్తే.. బ్యాంకింగ్ సెక్టార్‌లో యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 10 గ్రాముల బంగారం రేటు 551 రూపాయలు పెరిగి 54 వేల 811 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 15 వందల 86 రూపాయలు పెరిగి 69 వేల 98 రూపాయలు పలికింది. రూపాయి విలువ 5 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 67 పైసల వద్ద ఉంది.