Apple Record Revenue: భారతదేశంలో ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రైమాసిక ఫలితాలను సాధించిందని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం అద్భుతమైన మార్కెట్ అంటూ కొనియాడారు. ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ ఇటీవలే భారతదేశంలో రెండు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల తర్వాత ఇటీవల టిమ్ కుక్ భారతదేశ పర్యటకు వచ్చారు. ముంబై, ఢిల్లీ నగరా్లలో రిటైల్ మార్కెట్ ను ప్రారంభించారు. రెండంకెల వృద్ధితో ఏటికేడు బలంగా వృద్ధి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
భారతదేశంలో ఆపిల్ ఆదాయం ‘టిప్పింగ్ పాయింట్’కు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ‘మార్కెట్ డైనమిజం’ ప్రశంసించారు. కాలక్రమేణా ఎక్కువ మంది కస్టమర్లకు సేవ చేయడానికి మా కార్యకలాపాలు విస్తరించామని ఆయన అన్నారు. ఆపిల్ ఇండియాలో అనేక మంది భాగస్వామ్యులను కలిగి ఉందని, భారత్ లో ఆపిల్ ఎదుగుతున్న తీరు ఆనందాన్ని కలిగిస్తోంది, చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన టిమ్ కుక్ ప్రధాని నరేంద్రమోడీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను కలిశారు. భారతదేశంలో ఆపిల్ పెట్టుబడుల గురించి చర్చించారు.
Read Also: Elephants Attack: జార్ఖండ్‌లో దారుణం.. కుటుంబాన్ని తొక్కిచంపిన ఏనుగులు..
గత 15 సంవత్సరాలుగా ఆపిల్ వ్యాపారానికి చైనా ఎలా సహకరించిందో.. భారత్ కూడా అదే చేస్తోంది. మధ్యతరగతి విక్రయాలపై కంపెనీ దృష్టిసారిస్తోంది, మిలియన్ల కొద్దీ ఆపిల్ పరికరాల ఉత్పత్తికి హోమ్ బేస్ గా ఇండియాను మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ లో రెండు స్టోర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ ఉంది. చైనా నుంచి నెమ్మదిగా ఆపిల్ తన కేంద్రాలను తరలిస్తోంది. ప్రస్తుతం 5 శాతం ఐఫోన్లు భారత్ లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
ఏప్రిల్ 1, 2023తో ముగిసిన 2023 రెండో త్రైమాసికంలో ఆపిల్ మంచి వృద్ధిని కనబరిచింది. 94.8 బిలయన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆపిల్ అనుకున్న అంచనాలను మించి ఆదాయాన్ని సంపాదించింది. ఇండియాతో పాటు బ్రెజిల్, మలేషియా మెక్సికో, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ మార్కెట్లలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించినట్లు ఆపిల్ వెల్లడించింది.
