Tim Cook Retirement:ఏ పదవికైనా రిటైర్‌మెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పదవి విమరణ అనే వంతు ఇప్పుడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు వచ్చింది. తాజాగా ఆపిల్ తన తదుపరి CEO ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆపిల్ CEO టిమ్ కుక్ వచ్చే ఏడాది పదవీవిరమణ చేయవచ్చని సమాచారం. టిమ్ కుక్ తర్వాత ఆపిల్ నాయకత్వాన్ని ఎవరు చేపడతారనే దానిపై కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని ఈ నివేదికలు స్పష్టం చేశాయి.
నెక్ట్స్ ఈయనే..
ఆపిల్ కంపెనీ తదుపరి CEO ఎవరు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్‌ను ఈ పదవికి ప్రముఖ పోటీదారుగా పరిగణిస్తున్నారు. ఆపిల్ తదుపరి CEO కోసం అనేక మంది పోటీదారులుగా ఉన్నారని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంపై ఆపిల్ ఇంకా అధికారికంగా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. దాదాపు 14 ఏళ్లుగా ఆపిల్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న టిమ్ కుక్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలో ఆపిల్ తన తదుపరి CEOను ప్రకటించే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడించాయి.
1998 నుంచి ఆపిల్‌తో టిమ్ కుక్ ప్రయాణం..
2011 లో స్టీవ్ జాబ్స్ తన పదవిని విడిచిపెట్టిన తర్వాత టిమ్ కుక్ ఆపిల్ పగ్గాలు చేపట్టారు. టిమ్ కుక్ 1998 లో ఆపిల్‌లో చేరారు. ఆ సమయంలో కంపెనీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆపిల్ కార్యకలాపాల బృందాన్ని కొత్త దిశలో నడిపించడానికి ఆ సమయంలో స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్‌ను నియమించుకున్నారు. 2005 నుంచి 2011 వరకు టిమ్ కుక్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ఐపాడ్, మ్యాక్‌బుక్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తుల కోసం ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేశారు. ఆపిల్ పెద్ద – స్థాయి ఉత్పత్తి లాంచ్‌లలో టిమ్ కుక్ కీలక పాత్ర పోషించాడని కంపెనీ విశ్వసిస్తుంది. స్టీవ్ జాబ్స్ అనారోగ్యంతో ఉన్నప్పుడు టిమ్ కుక్ కంపెనీ తాత్కాలిక CEOగా పనిచేశారు. ఆగస్టు 24, 2011న స్టీవ్ జాబ్స్ టిమ్ కుక్‌ను ఆపిల్ CEOగా నియమించారు. కుక్ నాయకత్వంలో ఆపిల్ అనేక ముఖ్యమైన మైలురాళ్లను సాధించింది. టిమ్ కుక్ CEO గా ఉన్న సమయంలో ఆపిల్ కంపెనీ ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లు, M1, M2, M3 సిలికాన్ చిప్‌లు, ఆపిల్ విజన్ ప్రో వంటి కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది. ఆపిల్ $3 ట్రిలియన్ల విలువను చేరుకున్న మొట్ట మొదటి కంపెనీగా అవతరించింది. కుక్ నాయకత్వంలో ఐక్లౌడ్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ+, యాప్ స్టోర్ వంటి సేవా వ్యాపారాలు విస్తరించాయి. ఈ క్రమంలో ఆయన తర్వాత తదుపరి సీఈఓగా కంపెనీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
READ ALSO: Jadeja Leaves CSK: జట్టు మారిన జడేజా.. సంజు కోసం చెన్నై కీలక నిర్ణయం