ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్ వన్‌గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా సంస్థల కంటే.. ముందు నిలిచింది రిలయన్స్ జియో..
Read Also: Astrology : ఆగస్టు 18, గురువారం దినఫలాలు
తాజాగా ట్రాయ్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. జూన్ మాసంలో జియోకు కొత్తగా 42 లక్షల మంది యూజర్లు వచ్చి చేరగా.. జియో నెలవారి వృద్ధి ఏకంగా 1.03 శాతంగా ఉన్నట్టు పేర్కొంది ట్రాయ్.. తాజాగా కొత్త సబ్‌స్కైబర్లతో కలిపి జియో యూజర్ల సంఖ్య 41.30 కోట్లకు చేరడం విశేషం.. టెలికం రంగంలో 36 శాతం మార్కెట్ షేర్‌తో రిలయన్స్ జియో టాప్ స్పాట్ చెక్కు చెదరకుండా చేసుకుంది.. ఇదే సమయంలో.. వృద్ధిపరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెల్ వెనుకపడింది. జూన్ నెలలో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 7,93,132 మంది యూజర్లును యాడ్ చేసుకుని తన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 36.29 కోట్లకు పెంచుకుంది.. దీంతో.. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది భారతీ ఎయిర్ టెల్.. అయితే, వొడాఫోన్ ఐడియా మాత్రం తన సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీని సబ్‌స్క్రైబర్ బేస్ 18 లక్షలు తగ్గి 25.66 కోట్లకు పరిమితమైంది.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎంటీఎన్‌ఎల్ కూడా వరుసగా 13.27 లక్షలు మరియు 3,038 వైర్‌లెస్ కస్టమర్లను కోల్పోయింది..
ఇక, వైర్‌లైన్ (ఫిక్స్‌డ్ లైన్) సబ్‌స్క్రైబర్ బేస్ మేలో 2.52 కోట్ల నుండి జూన్‌లో 2.55 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో 2.4 లక్షల కొత్త ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్‌లను జోడించడం ద్వారా చార్ట్‌లో ముందుంది. దాని తర్వాత వొడాఫోన్ ఐడియా 84,760 కొత్త కస్టమర్లను, భారతీ ఎయిర్‌టెల్ 59,289, క్వాడ్రంట్ 7,378 కొత్త కస్టమర్లను జోడించాయి. ఈ విభాగంలో అత్యధికంగా నష్టపోయినది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. 32,038 మంది ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లను కోల్పోయింది. ఇక, ఎంటీఎన్‌ఎల్ 16,548 మంది వినియోగదారులను, టాటా టెలిసర్వీసెస్ 8,248 మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్ 80 కోట్లకు చేరుకుంది, మొబైల్ కనెక్షన్‌లతో 77.11 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
ట్రాయ్ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, టెలికం రంగంలో.. రిలయన్స్ జియో గరిష్ట సంఖ్యలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో జూన్‌లో దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ స్వల్పంగా పెరిగి 117.29 కోట్లకు చేరుకుంది. మే 2022లో 117.07 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. భారతదేశంలో టెలిఫోన్ చందాదారుల సంఖ్య మే 2022 చివరి నాటికి 1,170.73 మిలియన్ల నుండి జూన్ 2022 చివరి నాటికి 1,172.96 మిలియన్లకు పెరిగింది, తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.19 శాతంగా ఉంది ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ బేస్ మేలో 114.55 కోట్లుగా ఉంటే జూన్‌లో 114.73 కోట్లకు పెరిగింది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (41.91 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (21.94 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.29 కోట్లు), బీఎస్‌ఎల్‌ఎల్ (2.5 కోట్లు), అట్రియా కన్వర్జెన్స్ (21.1 లక్షలు)గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.