Demonetisation: 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ నోట్ల రద్దు ఎఫెక్ట్ భారత ఆర్ధిక వ్యవస్థపై కొనసాగుతుంది. నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూ.2వేలు నోటుతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016 నాటి నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్‌లను ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్న సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోట్ల రద్దు వ్యవహారంపై ఇంకా చర్చించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఇంకా ఈ కేసు విచారణ పడుతుండటం సరికాదని అభిప్రాయపడింది. ఈ సంవత్సరంలోనే ఈ కేసు విచారణను ముగించాలని అనుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పిటిషన్లపై ప్రభుత్వ స్పందనను, నోట్ల రద్దు నిర్ణయానికి కారణాలను సమగ్ర అఫిడవిట్ రూపంలో అందించాలని కేంద్రాన్ని, ఆర్బీఐని కోర్టు గత విచారణ సందర్భంగానే కోరింది. అయితే బుధవారం సదరు అఫిడవిట్‌ను అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీం కోర్టుకు సమర్పించలేకపోయారు. అఫిడవిట్ సమర్పణకు మరోవారం సమయం కావాలని అటార్నీ జనరల్ కోరారు.
Read Also: Sai Pallavi: ఇప్పటివరకు ఆ పని చేయని ఏకైక హీరోయిన్ సాయి పల్లవి
మరోవైపు రూ.2000 నోట్ల ముద్రణపై ఆసక్తికరమైన విషయం ఆర్టీఐ ద్వారా వెలుగు చూసింది. గత మూడు సంవత్సరాల్లో రూ.2000ల ఒక్క నోటు కూడా ముద్రించలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సమాధానం వచ్చింది. కాగా 2016-17లో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించారని చెప్పింది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
