నాలుగురోజుల వరుస నష్టాలకు ఈరోజు తెరపడింది. భారత స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 55,320 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్‌లో కదలాడిన సూచీలు సాయంత్రానికి సర్రున పైకి ఎగిశాయి. దీంతో లాభాలను చవిచూశాయి.
ఉదయం 10 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 171 పాయింట్ల నష్టంతో కదలాడగా చివరికి 427 పాయింట్ల లాభంతో ముగిసింది. ముఖ్యంగా ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో ముగియగా.. 12 కంపెనీలు మాత్రం నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్ర, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. అటు టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
