Site icon NTV Telugu

Stock Market: జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహం.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

స్టాక్ మార్కెట్‌కు జీఎస్టీ ఊరట కలిసొచ్చింది. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా జీఎస్టీ స్లాబ్‌లను కేంద్రం తగ్గించింది. దీంతో వస్తువుల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర నిర్ణయం మార్కెట్లకు బాగా కలిసొచ్చింది. గురువారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభంకాగానే సూచీలు భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది. అలాగే నిఫ్టీ కూడా పరుగులు పెట్టింది.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక

ప్రస్తుతం సెన్సెక్స్ 660 పాయింట్ల లాభంతో 81, 228 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 192 పాయింట్ల లాభంతో 24, 907 దగ్గర కొనసాగుతోంది. ఇక బజాజ్ ఫైనాన్స్, HUL, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా.. NTPC, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, HCL టెక్నాలజీస్, ONGC నష్టపోయాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్‌లు ఒత్తిడిలో ఉన్నాయి.

జీఎస్టీ ఊరట..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా  ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది. విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త, సరళమైన పన్ను విధానం ఈ నెల 22 నుంచే అమల్లోకి రానుండటంతో, దేశ ప్రజలకు దీపావళి పండగ నెల ముందే వచ్చేసినట్లయింది.

Exit mobile version