దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఓ వైపు అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల అనిశ్చితి, ఇంకోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో దాదాపు 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 941 పాయింట్లు నష్టపోయి 78, 782 దగ్గర ముగియగా.. నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 23, 995 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఐటీ మినహా అన్ని రంగాలు నష్టపోయాయి.
మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తదుపరి అధ్యక్షుడిగా ఎవరెన్నికవుతారన్న అనిశ్చితి నెలకొంది. దీంతో అన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అగ్ర రాజ్యం ఎన్నికల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ట్రంప్ విజయం సాధిస్తారా? కమలా హారిస్ గెలుస్తారా? అన్నది సందిగ్ధం చోటుచేసుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచూతూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు పెరుగుతుండటంతో పీపా చమురు ధర సోమవారం రెండు శాతం వరకు పెరిగి 74 డాలర్లకు చేరింది.