NTV Telugu Site icon

Record Level Car Sales: దూసుకెళ్లిన కార్ల విక్రయాలు.. రెండేళ్ల కిందటి రికార్డు బద్ధలు..

Record Level Car Sales

Record Level Car Sales

Record Level Car Sales: జులై నెలలో 3 లక్షల 42 వేల 326 కార్లు అమ్ముడుపోయాయి. ఒక నెలలో ఇన్ని కార్ల విక్రయాలు జరగటం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో కూడా ఇలా రికార్డ్‌ స్థాయి ఫలితాలు వెలువడటం విశేషమే. 2020 అక్టోబర్‌లో 3 లక్షల 34 వేల కార్లు సేల్‌ అయ్యాయి. అదే ఇప్పటివరకు అత్యధికం.

సిమెంట్‌ ఉత్పత్తి పెరిగినా..

సిమెంట్‌కి భారీ డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ కంపెనీల ఉత్పత్తి 7 నుంచి 8 శాతం వరకు పెరగనుందని ఆశిస్తున్నారు. తద్వారా మొత్తం సిమెంట్‌ ఉత్పత్తి 388 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరనుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇన్‌పుట్‌ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్‌ గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా తగ్గుతాయని ఇక్రా అనే రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

Social Media DP Change: డీపీ మార్చుకుంటేనే దేశభక్తి ఉన్నట్లా..?

తగ్గనున్న గోధుమల రేట్లు!

గత కొద్ది వారాలుగా దేశంలో గోధుమల ధరలు భారీగా పెరుగుతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పరిధిలో ఉన్న గోధుమల నిల్వలను ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించనున్నారు. అలాగే.. పరిమితికి మించి నిల్వ చేయకుండా అడ్డుకోనుందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి.

రేపటి నుంచి ద్రవ్య సమీక్ష

రేపటి నుంచి 3 రోజుల పాటు ద్రవ్య విధాన సంఘ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం 4 పాయింట్‌ 9 శాతంగా ఉన్న రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. దేశీయ మరియు అంతర్జాతీయ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ద్రవ్య సమీక్ష చివరిసారిగా జూన్‌ నెలలో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల వాస్తవ రుణ రేటును సాధించాలంటే రెపో రేటును 6 శాతం చేరువలోకి పెంచాలనే సూచనలు వ్యక్తమవుతున్నాయి.

తగ్గిన గోల్డ్‌ రేటు

10 గ్రాముల బంగారం రేటు స్వల్పంగా 110 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పుత్తడి ప్రస్తుతం 51 వేల 380 రూపాయల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47 వేల 100 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి రేటు 400 రూపాయలు తగ్గి 58 వేల రూపాయలు పలుకుతోంది.

‘చైనా’.. గట్టెక్కేనా?

చైనాలో స్థిరాస్తి రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఆస్తులను తాకట్టు పెట్టుకొని రుణాలు ఇచ్చిన బ్యాంకులు లబోదిబోమంటున్నాయి. ఏకంగా 350 బిలియన్‌ డాలర్లు నష్టపోయాయి. 6 నుంచి 7 శాతం వరకు హోం లోన్లు తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు రేటింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. దాదాపు 90 పైగా నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులు మార్టగేజ్‌ లోన్లు తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని వెల్లడించాయి.