క్రిఫ్టోకరెన్సీ విషయంలో ఆర్బీఐ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోకరెన్సీల వంటి ప్రైవేటు కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయవని అన్నారు. మదుపర్లు వారి సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెడుతుంటారని, క్రిఫ్టోకరెన్సీల గురించి హెచ్చరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిఫ్టోకరెన్సీలు పెనుముప్పుగా మారతాయని శక్తికాంత్ దాస్ హెచ్చిరించారు. క్రిఫ్టోకరెన్సీ 17వ శతాబ్ధంలో తులిప్ మానియా వంటిదేనని, అన్నారు.
Read: Starlinks: భూమిపై కూలిపోయిన స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు…
17 వ శతాబ్ధంలో డచ్ దేశానికి చెందిన ఇన్వెస్టర్లు తులిప్ పువ్వులపై పెట్టుబడులు పెట్టారు. ఈ పువ్వులపై విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో ఆ పువ్వుల ధరలు భారీగా పెరిగాయి. డచ్ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో తులిప్ పువ్వు ధర నైపుణ్యం కలిగిన ఒక కార్మికుని వార్షిక ఆదాయం కంటే అధికంగా ఉంది. దాదాపు మూడేళ్లపాటు ఈ తులిప్ మానియా కొనసాగింది. డచ్ ఇన్వెస్టర్లను చూసి ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో తులిప్ పువ్వుల ధరలు క్రమంగా దిగివచ్చాయి. ఆ తరువాత ఒక్కసారిగా పడిపోయాయి. తులిప్ పువ్వులపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. క్రిఫ్టోకరెన్సీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.