Plastic Notes: దేశంలో త్వరలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్‌లో వెల్లడైంది. తొలి దశలో ఈ నోట్లను ఫీల్డ్ ట్రయల్ కోసం విడుదల చేసి, ప్రయోగం విజయవంతమైతే క్రమంగా సాధారణ చలామణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.10, రూ.20 విలువైన 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు. ఈ ట్రయల్ ఫలితాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు కొనసాగుతాయని, వాటిని పూర్తిగా ప్లాస్టిక్ నోట్లతో భర్తీ చేసే ప్రతిపాదన ఇప్పటివరకు లేదని పేర్కొంది. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, నకిలీ నోట్లు తయారు చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలంలో ముద్రణ వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉండగా, భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులపై దీని ప్రభావాన్ని కూడా అంచనా వేయనున్నారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రపంచంలో తొలిసారిగా 1988లో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ ఈ ప్రాజెక్టుకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు కూడా సమాచారం. దీంతో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమవుతోంది.

