PB Fintech: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిర్ణయాలు ఎంతటి దిగ్గజ కంపెనీనైనా క్షణాల్లో తలకిందులు చేయగలవనడానికి పాలసీబజార్ మాతృసంస్థ ‘పీబీ ఫిన్‌టెక్’ తాజా సంక్షోభమే నిలువెత్తు నిదర్శనం. నిన్నమొన్నటి వరకు మార్కెట్ డార్లింగ్‌గా దూసుకెళ్లిన ఈ షేరుపై ఒకే ఒక్క ప్రతిపాదన పెను తుఫాను సృష్టించింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఐదేళ్ల కష్టార్జితం, ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయి, షేరు ఏకంగా ఐపీఓ ధర కంటే పాతాళానికి కుప్పకూలింది.
శిఖరం నుంచి నేలమట్టానికి.. ఏం జరిగింది?
2025 జనవరిలో ఏకంగా రూ.2,254 గరిష్ట స్థాయిని తాకి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన పీబీ ఫిన్‌టెక్ షేరు, అక్టోబర్ 1 నాటికి రూ.984 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో కంపెనీ 2021 నాటి ఐపీఓ ఇష్యూ ధర అయిన రూ.980 కంటే దిగువకు పడిపోవడం దలాల్ స్ట్రీట్‌ను షాక్‌కు గురిచేసింది. కేవలం వారం వ్యవధిలోనే ఈ షేరు 17 శాతానికి పైగా కుదేలైంది. దీంతో ఐపీఓ అలాట్‌మెంట్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు లాభాలను చూసిన దీర్ఘకాలిక మదుపరులు సైతం ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి జారుకున్నారు. ఈ భారీ పతనానికి అసలు సూత్రధారి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (IRDAI) జారీ చేసిన తాజా ముసాయిదా పత్రం అని మార్కె్ట్ వర్గాలు చెబుతున్నాయి. బీమా పాలసీల విక్రయాలపై ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ల నిబంధనలలో సమూల మార్పులు చేయాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. పాలసీబజార్ ప్రధాన ఆదాయ మార్గమే పాలసీల అమ్మకాల ద్వారా లభించే కమీషన్లు. కొత్త నిబంధనలు గనుక అమల్లోకి వస్తే సంస్థ వ్యాపార నమూనాకే పెద్ద దెబ్బ తగలడంతో పాటు, లాభాల్లో భారీ కోత పడటం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ముప్పును పసిగట్టిన పెద్ద ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థలు ఒక్కసారిగా అమ్మకాలకు తెగబడటంతో కౌంటర్లలో రక్తం చిందింది.
చేతులెత్తేసిన దిగ్గజ బ్రోకరేజీలు
స్టాక్ పతనాన్ని చూసి ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు అప్రమత్తమై రేటింగులను దారుణంగా తగ్గించాయి.
* హెచ్‌ఎస్‌బీసీ (HSBC): గతంలో ఉన్న ‘బై’ రేటింగ్‌ను కాస్తా ‘హోల్డ్’కు తగ్గించింది.
* డోలట్ క్యాపిటల్ (Dolat Capital): నేరుగా ‘సెల్’ (అమ్మేయండి) రేటింగ్ ఇచ్చి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
* మాక్వారీ (Macquarie): తన అభిప్రాయాన్ని ‘న్యూట్రల్’కు మార్చింది.
ఈ మూడు దిగ్గజ సంస్థలూ పీబీ ఫిన్‌టెక్ టార్గెట్ ధరను కేవలం రూ.1,150కే పరిమితం చేశాయి. దీన్నిబట్టి సమీప భవిష్యత్తులో ఈ షేరు కోలుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు.
మదుపరులకు చేదు పాఠం
ఏ కంపెనీ వ్యాపారమైనా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, నియంత్రణ సంస్థల (రెగ్యులేటరీ) విధానాలు ఆ కంపెనీ మూలాలనే దెబ్బతీసే ప్రమాదం ఉందని పాలసీబజార్ ఉదంతం కళ్లకు కట్టింది. పాలసీలలో వచ్చే చిన్నపాటి మార్పులు సైతం ఇన్వెస్టర్ల సంపదను కొద్ది రోజుల్లోనే ఎలా ఊడ్చేస్తాయో చూపించే చేదు పాఠంగా ఈ పరిణామం మిగిలిపోనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

