ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సర్వీస్ లోపాలు, విడిభాగాల కొరత కారణంగా గత కొన్ని నెలలుగా కొత్త వాహనాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసిన ఓలా, ఈ ఏడాది నుంచి మళ్లీ సరికొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన కంపెనీ ఆర్థిక ఫలితాల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు.
గతంలో ఓలా స్కూటర్ల సర్వీసింగ్‌లో విపరీతమైన ఆలస్యం జరగడంపై కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. బ్రేక్ ప్యాడ్స్ వంటి చిన్న విడిభాగాల కోసం కూడా కస్టమర్లు 20 నుంచి 30 రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ఈ సమస్యలను అధిగమించడానికి, కస్టమర్ సర్వీస్‌ను మెరుగుపరచడానికి తాము కొత్త లాంచ్‌లను కాసేపు పక్కన పెట్టామని భవిష్ అగర్వాల్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం సర్వీస్ సెంటర్లలో విడిభాగాలను ముందే స్టాక్ ఉంచేలా ఆర్డర్ సిస్టమ్‌ను మార్చామని, దీనివల్ల సర్వీస్ బ్యాక్‌లాగ్ ఏకంగా 88 శాతం తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు 87 శాతం మొబైల్ రిపేర్లు అదే రోజున పూర్తవుతున్నాయని తెలిపారు.
బైక్ విభాగంలో అదరగొడుతున్న ‘రోడ్‌స్టర్’..
సర్వీస్ సమస్యలు సర్దుమణగడంతో ఓలా వాహనాలకు మళ్లీ గిరాకీ పెరిగింది. ముఖ్యంగా గత ఏడాది మార్కెట్లోకి తెచ్చిన ‘రోడ్‌స్టర్’ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సిరీస్‌కు ఉత్తర భారతదేశంలో ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఓలా మొత్తం విక్రయాల్లో బైక్‌ల వాటానే 15 శాతానికి చేరుకుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఓలా వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, నెట్‌వర్క్‌లో స్టాక్ కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే ఉంటోందని కంపెనీ తెలిపింది. రాబోయే రోజుల్లో మోటార్ సైకిళ్లతో పాటు మరిన్ని కొత్త స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌లను పరిచయం చేసేందుకు ఓలా పక్కా ప్లాన్‌తో ఉంది. కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి పొందుతూ, సరికొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో మళ్లీ టాప్ గేర్ వేయాలని ఓలా ఎలక్ట్రిక్ యోచిస్తోంది.
