No Change in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈరోజు శుక్రవారం కూడా దాదాపు నిన్నటి సీనే రిపీటైంది. ఇవాళ మొత్తం దాదాపుగా నష్టాల బాటలోనే సాగింది. ఎర్లీ ట్రేడింగ్‌లో కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఆదిలోనే ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల విదేశాల నుంచి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం బాగా మైనస్ అయింది.
ఉక్రెయిన్‌పై రష్యా మరో క్షిపణి దాడి చేయటంతో పరిస్థితి మరింత దిగజారింది. అమ్మకాల ఒత్తిళ్లు సూచీలకు షాక్ ఇచ్చాయి. సెన్సెక్స్ 461 పాయింట్లు కోల్పోయి 61 వేల 337 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయి 18 వేల 270 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లో కేవలం మూడు కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. వాటిలో హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా సంస్థలు ఉన్నాయి. సెన్సెక్స్‌లో పీఎన్‌బీ హౌజింగ్, యూనియన్ బ్యాంక్ తీవ్రంగా కుదేలైన కంపెనీల్లో టాప్‌లో నిలిచాయి.
read also: Cement Rate Hike: బరువు మారదు.. బస్తా లేవదు..
నిఫ్టీ మిడ్‌క్యాప్ హండ్రెడ్, నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ అర శాతం పడిపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. అన్ని రంగాల స్టాక్స్ ముగిపోయాయి. ఐటీ ఇండెక్స్ ఒక శాతానికి పైగా తగ్గిపోయింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జీఎంఎం పిఫాడ్లర్ కంపెనీ షేర్లు 18 శాతం పతనమయ్యాయి. ఈ సంస్థలోని 11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారటం దెబ్బతీసింది. ఐటీసీ కంపెనీ షేర్ విలువ 2 శాతం నష్టపోయి 2 నెలల కనిష్టానికి.. అంటే.. 332 రూపాయలకు చేరింది.
మార్కెట్ ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ మహింద్రా సీఐఈ కంపెనీ స్టాక్స్ రెండు రోజుల్లోనే 16 శాతం పెరిగి 52 వారాల గరిష్టాన్ని అందుకోవటం విశేషం. 10 గ్రాముల బంగారం అతిస్వల్పంగా 23 రూపాయలు పెరిగి గరిష్టంగా 54 వేల 130 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కిలో వెండి రేటు 239 రూపాయలు తగ్గి 67 వేల 579 రూపాయల వద్ద క్లోజ్ అయింది. రూపాయి విలువ 9 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 52 పైసల వద్ద ఉంది.