Youtube: ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ యూట్యూబ్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. దీంతో యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. చాలా భాషల్లో వాయిస్ సెర్చ్, టైపింగ్ వర్డ్స్ రూపంలో ఇంటర్నెట్ సెర్చ్ ఫెసిలిటీ తీసువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఆడియో ట్రాక్ ఆప్షన్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఓటీటీల తరహాలో నచ్చిన ఆడియో ట్రాక్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో విభిన్న భాషల్లో వీడియోలను చూడవచ్చు. వీడియో చూసేటప్పుడు ఆడియో ట్రాక్ మార్చుకునేలా ఈ ఫీచర్ ఉంటుందని యూట్యూబ్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్.. కొవిడ్‌తో పోరాడుతున్న డ్రాగన్
యూట్యూబ్ ఆడియో ట్రాక్ ఆప్షన్ విషయాన్ని గూగుల్ ఫర్ ఇండియాలో యూట్యూబ్ ప్రకటించినట్లు టెక్ క్రంచ్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఫీచర్ ముందుగా హెల్త్ ఆడియోలకు అందుబాటులోకి వస్తుందని టెక్ క్రంచ్ వివరించింది. అనంతరం వేరే వీడియోలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ భాషల్లో ఉన్న కంటెంట్‍కు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ వచ్చాక.. సెట్టింగ్స్‌లో ఆడియో ట్రాక్‍లను మార్చుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని భాషల వీడియోలతో ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు టెక్ క్రంచ్ తెలిపింది. మరోవైపు రానున్న కాలంలో యూజర్లకు యూట్యూబ్ కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ కోర్సులు తీసువచ్చేందుకు యూట్యూబ్ రెడీ అవుతోంది. దీని కోసం కంపెనీ పలు సంస్థలతో, క్రియేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. 2023 తొలి అర్ధ భాగంలో ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.