India Bullet Train Features: భారతదేశ రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ఈ రైలును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తయారవుతున్న రైలును భారతీయ ఇంజినీర్లు దేశ వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేస్తున్నారు.
బెంగళూరులోని బీఈఎంఎల్ (BEML – భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) తయారీ కేంద్రంలో ఈ రైలు నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీ సాంకేతికతపై పూర్తిగా ఆధారపడకుండా, భారతీయ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఇంజినీరింగ్ సామర్థ్యాలతో ఈ రైలును అభివృద్ధి చేస్తున్నారు. మరి భారత్ తొలి బుల్లెట్ ట్రైన్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? దాని వేగం, ప్రయాణికుల సామర్థ్యం, సౌకర్యాల గురించి తెలుసుకుందాం.
గంటకు 280 కి.మీ. గరిష్ఠ వేగం
భారత్ తొలి బుల్లెట్ ట్రైన్‌ను గంటకు గరిష్ఠంగా 280 కిలోమీటర్ల పరీక్ష వేగాన్ని చేరుకునేలా రూపొందిస్తున్నారు. అయితే సాధారణ కార్యకలాపాల్లో ఈ రైలు గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రైలు మొత్తం పొడవు 202 మీటర్లు ఉంటుంది. ఇందులో ఎనిమిది కోచ్‌లు ఉంటాయి. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో రైలును నిర్మిస్తున్నారు. మొత్తం 557 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. వీరిలో దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక సీట్లు కేటాయించారు.
రెండు రకాల సీటింగ్ సౌకర్యాలు
ఈ బుల్లెట్ ట్రైన్‌లో ఏడు స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్‌లో 3×2 సీటింగ్ విధానం, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 2×2 సీటింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. రైలుకు ఇరువైపులా డ్రైవర్ క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. ఆధునిక ఆన్‌బోర్డ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకునే సదుపాయం ఉంటుంది. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలు పెరిగితే రెండు ఎనిమిది కోచ్‌ల రైళ్లను కలిపి 16 కోచ్‌ల రైలుగా కూడా నడిపే అవకాశం ఉంటుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు లోపలి భాగాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. భారతీయుల శరీర నిర్మాణానికి అనుగుణంగా సీట్లు, కాళ్లు చాపుకునేందుకు తగినంత స్థలం ఉండేలా డిజైన్ చేస్తున్నారు. దివ్యాంగులు, కదలికల్లో ఇబ్బందులు ఉన్నవారు సులభంగా రైలులోకి ఎక్కేందుకు లెవల్ బోర్డింగ్ సదుపాయం కల్పిస్తారు. కోచ్‌ల మధ్య ప్రయాణికులు సులభంగా నడిచేందుకు సింగిల్ పీస్ సీల్డ్ గ్యాంగ్‌వే ఏర్పాటు చేస్తారు.
ప్రతి వరుస సీట్ల వద్ద విశాలమైన కిటికీలు ఉంటాయి. వీటి ద్వారా ప్రయాణికులు బయట ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఆధునిక ఎల్‌ఈడీ లైటింగ్, ఓవర్‌హెడ్ లగేజ్ ర్యాక్‌లు, పెద్ద సామాన్ల కోసం ప్రత్యేక ఫ్లోర్ స్టాండ్లు అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ కోసం వ్యక్తిగత పవర్ అవుట్‌లెట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేలా ఆధునిక బయో డైజెస్టర్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు.
మూడు భాషల్లో ప్రయాణికులకు సమాచారం
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. కోచ్‌లలో ఏర్పాటు చేసే ఎల్‌సీడీ స్క్రీన్ల ద్వారా ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం అందిస్తారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సదుపాయాలు కూడా ఉంటాయి. హైస్పీడ్ వై-ఫై ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు ముందుగా లోడ్ చేసిన వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు ప్రయాణికుల క్యాబిన్లు, కోచ్‌ల మధ్య ఉండే ప్రదేశాల్లో ఎమర్జెన్సీ టాక్‌బ్యాక్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో రైలును రూపొందిస్తున్నారు. రైలు ఫ్లోర్, ప్లాట్‌ఫామ్ ఎత్తుకు అనుగుణంగా ఉండేలా డిజైన్ చేస్తారు. దీంతో ప్రయాణికులు సులభంగా రైలులోకి ప్రవేశించవచ్చు. ట్రైన్ డోర్లలోనే వెనక్కి ముడుచుకునే మెట్లను ఏర్పాటు చేస్తారు. రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఉండే ఖాళీని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా తలుపులు, టాయిలెట్లు రూపొందిస్తారు. చూపు సమస్యలు ఉన్నవారి కోసం బ్రెయిలీ లిపిలో సమాచార సూచికలు కూడా అందుబాటులో ఉంటాయి.
వేసవి, వర్షాకాలం, చలికాలం అనే తేడా లేకుండా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రతి కోచ్‌లో డ్యూయల్ యూనిట్ HVAC వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా కోచ్‌లో ఉష్ణోగ్రతతో పాటు తేమ స్థాయిని కూడా నియంత్రించవచ్చు. రైలు ప్రయాణ సమయంలో శబ్దం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రైలు బాడీ, ఫ్లోర్ నిర్మాణంలో సౌండ్ ఇన్సులేషన్, శబ్దాన్ని తగ్గించే ప్రత్యేక కోటింగ్‌లను ఉపయోగిస్తున్నారు.
విద్యుత్‌తో నడిచే రైలు.. శక్తి ఆదా చేసే బ్రేకింగ్ వ్యవస్థ
ఈ బుల్లెట్ ట్రైన్ 25 కేవీ ఏసీ ఓవర్‌హెడ్ విద్యుత్ వ్యవస్థ ద్వారా నడుస్తుంది. విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించేందుకు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైలు వేగాన్ని తగ్గించే సమయంలో ఉత్పత్తయ్యే శక్తిని తిరిగి విద్యుత్‌గా మార్చి గ్రిడ్‌కు అందించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. దీంతో శక్తి వినియోగం తగ్గి, ప్రయాణం మరింత సమర్థవంతంగా మారుతుంది.
గాలి నిరోధకత తగ్గించే ఏరోడైనమిక్ డిజైన్
అధిక వేగంతో ప్రయాణించే సమయంలో గాలి నిరోధకతను తగ్గించేందుకు రైలు ఆకారాన్ని ఆధునిక కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా రూపొందిస్తున్నారు. రైలు ముందు భాగాన్ని ఏరోడైనమిక్ ఆకృతిలో డిజైన్ చేశారు. దీంతో గాలి నిరోధకత, గాలి వల్ల ఏర్పడే అల్లకల్లోలం తగ్గుతాయి. ముఖ్యంగా సొరంగాల్లో ప్రయాణించే సమయంలో అధిక శబ్దం, ‘సోనిక్ బూమ్’ ప్రభావాలను తగ్గించేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుంది.
భారత రైల్వేలో కొత్త అధ్యాయం
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం రూపొందిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ భారత రైల్వే రంగంలో కీలకమైన ముందడుగుగా నిలవనుంది. గంటకు 280 కి.మీ. పరీక్ష వేగం, 557 మంది ప్రయాణికుల సామర్థ్యం, ఆధునిక సాంకేతికత, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు వంటి అంశాలు ఈ రైలులో ప్రధాన ఆకర్షణలు. నిర్మాణం పూర్తయి సేవలు ప్రారంభమైన తర్వాత దేశంలో వేగవంతమైన రైలు ప్రయాణానికి కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది.

