Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Stock Market

Stock Market

Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ గురువారం ఒక ‘బ్లాక్ థర్స్డే’గా మిగిలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.

READ ALSO: Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్‌కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్!

ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్
ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $112 మార్కును దాటింది. ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు.

1800 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఈ రోజు సెన్సెక్స్ దాదాపు 1,800 పాయింట్లు (2.35%) పతనమై 74,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఏకంగా 532 పాయింట్లు (2.23%) నష్టపోయి 23,238 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు లాభాలతో ఊరించిన మార్కెట్, ఈరోజు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ పతనం కేవలం కొన్ని కంపెనీలకే పరిమితం కాలేదు. లార్జ్-క్యాప్ నుంచి స్మాల్-క్యాప్ వరకు అన్ని విభాగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌&టీ (L&T) వంటి బలమైన స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. నేడు ట్రేడ్ అయిన 2,006 స్టాక్స్‌లో 1,390 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. కేవలం 469 స్టాక్స్ మాత్రమే లాభాల్లో నిలవగలిగాయి. 40 స్టాక్స్ ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు.

అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడే వరకు మార్కెట్‌లో ఇదే విధమైన హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO: BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!