Economic Survey 2026: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా మారాయి. భారత్‌పై పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందని తొలుత అందరూ భావించారు. కానీ.. పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం తన దారిలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 7.4 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దీంతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మరోసారి నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. తాజాగా గురువారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. ఈ సర్వేలో దేశీయ డిమాండ్ బలంగా ఉందని, ఆర్థిక పునాది పటిష్టంగా ఉందని తేలింది. 2026–27 సంవత్సరంపై మంచి అంచనాలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ దశను గత కొన్ని దశాబ్దాల్లో భారత్ సాధించిన అత్యంత బలమైన ఆర్థిక ప్రదర్శనగా సర్వే పేర్కొంది.
READ MORE: KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
మధ్యకాలికంగా భారత వృద్ధి సామర్థ్యాన్ని సైతం సర్వే పెంచింది. ఇప్పటివరకు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా, దేశం సగటున 7 శాతం వృద్ధి సాధించగలదని తెలిపింది. ఉత్పాదకత పెరగడం, కంపెనీలు-బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, డిజిటల్ సదుపాయాలు, రహదారులు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. 2026–27లో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసినా, ప్రపంచ స్థాయిలో వచ్చే అడ్డంకులు మాత్రం కొనసాగుతాయని హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వాతావరణం ఇంకా సున్నితంగానే ఉందని సర్వే స్పష్టం చేసింది. చాలా దేశాలు ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యం కోసం కష్టపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నా, భారత్ మాత్రం నిలకడగా ఎదుగుతోంది. 2025లో అమెరికా విధించిన కఠినమైన దిగుమతి పన్నుల కారణంగా ఎగుమతులు పడిపోతాయనే భయాలు ఉన్నా, అవి నిజం కాలేదని సర్వే పేర్కొంది. దానికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని చెప్పింది. జీఎస్టీ వ్యవస్థలో మార్పులు, నియంత్రణల సడలింపు, కార్మిక చట్టాల అమలు వంటి చర్యలు వ్యాపారాలకు బలమిచ్చాయి. వీటి వల్ల అంతర్జాతీయ దెబ్బలను తట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగగలిగింది.
READ MORE: T20 World Cup 2026: సూర్య, గంభీర్‌కు అదే పెద్ద తలనొప్పి.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సర్వే ఒక ముఖ్యమైన విషయాన్ని విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వ్యవస్థలో, మంచి ఆర్థిక ప్రదర్శన చూపిన దేశాలకు కరెన్సీ స్థిరత్వం లేదా పెట్టుబడుల ప్రవాహం గ్యారంటీగా రావడం లేదని స్పష్టం చేసింది. 2026కు సంబంధించి ప్రపంచానికి మూడు రకాల పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేసి, అందులో ‘నియంత్రిత గందరగోళం’ ఉన్న పరిస్థితికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పింది. అంటే అప్పుడప్పుడు షాకులు వస్తాయి, ఒత్తిడి ఉంటుంది, కానీ పెద్ద సంక్షోభం మాత్రం రావడం లేదు అన్నమాట. భారత్ బలమైన ఆర్థిక పునాది ఉన్నప్పటికీ, ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడుల కదలికల్లో అనిశ్చితి పెరిగాయని సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, బ్యాంకులు స్థితి మెరుగ్గా ఉండటం, రుణాల వృద్ధి బాగుండటం, ప్రభుత్వ లోటు క్రమంగా తగ్గే దిశలో ఉండటం భారత్‌కు పెద్ద బలంగా మారాయి.
READ MORE: ఓపెన్-ఇయర్ డిజైన్, IP55 రేటింగ్, 36 గంటల బ్యాటరీతో Realme Buds Clip లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
దేశ వృద్ధికి ప్రధానంగా తోడ్పడుతున్నది ప్రైవేట్ వినియోగమేనని సర్వే స్పష్టం చేసింది. పట్టణాల్లో ఖర్చు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగవడం, ప్రజల వాస్తవ ఆదాయాలు నెమ్మదిగా పెరగడం దీనికి కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రైవేట్ వినియోగం ఇప్పుడు జీడీపీలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని స్థాయికి చేరిందని సర్వే తెలిపింది. పెట్టుబడులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. మొత్తం పెట్టుబడులు జీడీపీలో దాదాపు 30 శాతానికి చేరాయని సర్వే అంచనా వేసింది. భారీగా ప్రభుత్వ మూలధన వ్యయం జరగడం, ప్రైవేట్ రంగం కూడా మళ్లీ పెట్టుబడులకు ముందుకు రావడం ఇందుకు కారణంగా చూపించింది. 2025–26 మూడో త్రైమాసికం వరకూ వచ్చిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చూపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలు, వాహనాల అమ్మకాలు, ఈ-వే బిల్లులు, సేవల రంగ సూచీలు అన్నీ వినియోగం, పెట్టుబడుల్లో జోరు కొనసాగుతోందని చెబుతున్నాయి.