Site icon NTV Telugu

Home Loan: వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. హోంలోన్లపై భారం..!

Home Loan

Home Loan

ఈ మధ్యే వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక, ఆర్బీఐ చ‌ర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే త‌మ ఎంసీఎల్ఆర్ రుణ వ‌డ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న త‌ర్వాత ఎంసీఎల్ఆర్‌తోపాటు వ‌డ్డీరేట్లు పెంచేశాయి పలు బ్యాంకులు..

Read Also: Cyclone Asani: ‘అసని’ తీవ్ర తుఫాన్‌.. అప్రమత్తమైన నావికాదళం

ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కెన‌రా, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్‌ పీఎన్బీ, ఎస్బీఐ ఇలా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి.. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా అయితే, ఐ-ఈబీఎల్ఆర్‌ను 8.10 శాతంగా ఖరారు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచే అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 5వ తేదీన రిటైల్ రుణాల‌పై బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రెపోరేట్ అనుబంధ రుణ వ‌డ్డీరేటు 6.90 శాతానికి పెంచేసింది. మరోవైపు, కెన‌రా బ్యాంకు అన్ని ర‌కాల రిటైల్ రుణాల‌పై రెపోరేట్ అనుసంధాన రుణ రేటు 7.30 శాతానికి పెంచేసింది. ఇది మే 7 నుంచి అమలు చేస్తోంది. ఇక, మే ఒక‌టో తేదీ నుంచే యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిటైల్ లెండింగ్ స్కీమ్స్‌పై వ‌డ్డీరేటు 6.80 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపోరేట్ అనుబంధ ఆర్బీఎల్ఆర్ ఈ నెల 4వ తేదీ నుంచి 7.25 శాతానికి స‌వ‌రించింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో దానిని 6.90 శాతానికి పెంచింది. ఇది ప్రస్తుత రుణ గ్రహీత‌ల‌కు వ‌చ్చే ఒక‌టో తేదీ నుంచి, నూత‌న క‌స్టమ‌ర్లకు ఈ నెల ఏడో తేదీ నుంచి అమ‌ల్లోకి తెచ్చింది పీఎన్‌బీ.. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అన్ని టెన్యూర్ల రుణ గ్రహీత‌ల‌పై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు పెంచేశాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఎంసీఎల్ఆర్ 7.15 శాతం అమ‌ల్లోకి తెచ్చింది. ఇంత‌కుముందు ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉండేది. ఏడాది గ‌డువుగ‌ల రునాల‌పై ఎంసీఎల్ఆర్ 7.50 శాతం, రెండేండ్ల గ‌డువు గ‌ల రుణాల‌పై 7.60 శాతం, మూడేండ్ల గ‌డువు గ‌ల రుణాల‌పై 7.70 శాతం ఖ‌రారు చేసింది. మరోవైపు, ఎస్బీఐ ఇటీవ‌లే త‌న రుణాల‌పై ఎంసీఎల్ఆర్‌ 10 బేసిక్ పాయింట్లు పెంచింది. ఇది ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి అమ‌ల్లోకి వచ్చింది.. ఇక, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ నెల ఒక‌టో తేదీ నుంచి త‌న ఎంసీఎల్ఆర్‌ను 6.60-7.70 శాతం మ‌ధ్య సవరించగా.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ 6.60-7.55 శాతం మ‌ధ్య వడ్డించింది. ఈనెల రెండో తేదీ నుంచి యెస్ బ్యాంక్ అన్ని రుణాల‌పై ఎంసీఎల్ఆర్ 10-15 బేసిక్ పాయింట్లు పెంచారు. దీని ప్రకారం యెస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 6.85 – 8.60 శాతం మ‌ధ్య పెరిగింది. ఇక, యాక్సిస్ బ్యాంక్ గ‌త నెల 18న ఎంసీఎల్ఆర్ 5 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.15-7.30 శాతం మ‌ధ్య ఖ‌రారైంది. మొత్తంగా.. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో.. గృహరుణాలు, ఇతర రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

Exit mobile version