Hyderabad to Thailand: హైదరాబాద్, థాయ్‌లాండ్ మధ్య ప్రయాణికులతోపాటు సరుకులకు సంబంధించిన విమాన సర్వీసులు కూడా రెండేళ్ల విరామం అనంతరం ఎల్లుండి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొవిడ్ వల్ల నిలిచిపోయిన ఈ సేవలు మళ్లీ మొదలవుతుండటం ఔషధాల వంటి ముఖ్యమైన ప్రొడక్టుల రవాణాకు, పర్యాటకుల రాకపోకలకు ఉపయుక్తంగా ఉంటుందని థాయ్ కాన్సులేట్ జనరల్ నిటిరూగ్ ఫోన్ ప్రాసెర్ట్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఎన్నో బహళజాతి సంస్థలు, ఇండస్ట్రీలు, వ్యాపార సంస్థలు థాయ్‌లాండ్‌తోపాటు సమీప ప్రాంతాల్లోని సంస్థలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి.
Special Story on India’s Natural Gas Needs: ఇండియాలో గ్యాస్ కొరత.. ఇప్పట్లో పరిష్కారమయ్యేనా?
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో వాయు రవాణా సౌకర్యాన్ని కొవిడ్ పూర్వపు స్థితికి పునరుద్ధరించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ మధ్య నిత్యం ఓ విమానం (బోయింగ్ బి777-200) నడవనుంది. ఇందులో 300కు పైగా సీట్లు ఉన్నాయి. వాటిలో 30 బిజినెస్ క్లాస్ సీట్లు. ప్రయాణికుల బ్యాగేజ్‌తోపాటు 15 మెట్రిక్ టన్నుల కమర్షియల్ కార్గోను కూడా మోసుకెళ్లనుంది.
ఇరు ప్రాంతాల మధ్య ప్యాసింజర్ మరియు కార్గో రవాణాను పునరుద్ధరించాలని కోరుతూ ‘ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది థాయ్‌లాండ్‌కి టూరిస్టులుగా వెళుతుంటారు. థాయ్ ఎయిర్‌వేస్ కొన్నేళ్లుగా హైదరాబాద్-బ్యాంకాక్ మధ్య విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ ఫ్లైట్ వారానికి ఏడు రోజులూ అందుబాటులో ఉంటుంది.