Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!

Flipkart Food Delivery

Flipkart Food Delivery

Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రేసులోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ముమ్మరంగా సిద్ధమవుతోంది! వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ భారత్‌లో త్వరలోనే తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుందని సమాచారం. ప్రారంభంలో భాగంగా ముందుగా బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. అక్కడ వచ్చే ఫలితాలు, సాంకేతికతను పరిశీలించిన తర్వాతే ఇతర ప్రధాన నగరాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోందట. ఇప్పటికే తీవ్ర పోటీ ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి కస్టమర్లకు బలమైన, ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఫ్లిప్‌కార్ట్ నిమగ్నమైంది. ఈ సేవలను ప్రత్యేక యాప్ ద్వారా అందించడంతో పాటు ‘ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ONDC) ప్లాట్‌ఫామ్‌పై కూడా అందుబాటులో ఉంచే అంశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. అయితే, ఈ సర్వీస్ లాంచ్ సమయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఒకవైపు ఫుడ్ డెలివరీలోకి అడుగుపెడుతున్న తరుణంలోనే, మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తీవ్రమైన వ్యాపార వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌లో పోటీని దెబ్బతీసేలా అనుచిత, వివక్షాపూరిత వ్యాపార విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘ఫోరమ్ ఫర్ ఇంటర్నెట్ రిటైలర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్’ (FIRST) సంస్థ ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ని ఆశ్రయించింది. ఫ్లిప్‌కార్ట్ GST మినహాయింపుల ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకుందని, ఆ సొమ్ముతో భారీ డిస్కౌంట్లు ఇస్తూ స్వతంత్రంగా వ్యాపారం చేసుకునే చిన్న అమ్మకందారుల పొట్టకొడుతోందని ఈ ఫిర్యాదులో తీవ్రస్థాయిలో ఆరోపించింది.