ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్‌బుక్ ఒకటి. చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఫేస్‌బుక్ సేవలు ఆరు గంటలు నిలిచిపోగా ప్రపంచమే స్తంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్‌బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది. ఈనెల 28న ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్‌బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్టును పరిచయం చేసింది. దీంతో ‘హోరైజన్’ అనే కొత్త పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఆక్యులస్ వంటివి ఫేస్‌బుక్‌లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ తన కార్యకలాపాలను మరింత విస్తరించుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) అద్దాల తయారీలో సంస్థ బిజీగా ఉంది. దీని కింద కొత్తగా రానున్న ఐదేళ్లలో యూరోపియన్ యూనియన్‌లో (ఈయూ)లో 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనుంది. స్మార్ట్ ఫోన్‌ల తరహాలో భవిష్యత్తులో ఏఆర్ గ్లాసెస్ కూడా ప్రజల జీవితాల్లో భాగం అవుతాయని ఫేస్‌బుక్ సంస్థ ఆశిస్తోంది. మరోవైపు మెటావర్స్ ప్రాజెక్టు కోసం ఫేస్‌బుక్ 50 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.