కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవర్‌గ్రాండే చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ దిగ్గజం. ఈ సంస్థ 280 నగరాల్లో దాదాపు 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో 2శాతం వాటా దీనిదే. 15లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎవర్‌గ్రాండే సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది.
ఈ కంపెనీ జారీ చేసిన బాండ్లపై.. సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఇటీవల ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. చైనా ప్రభుత్వం కూడా దీనిని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయటానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిపుణుల అంచనా ప్రకారం.. చైనా జీడీపీలో 29శాతం రియల్ ఎస్టేట్ రంగం నుంచే లభిస్తోంది. కొన్నాళ్ల నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించడం ఎవర్‌గ్రాండేపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కుప్పకూలితే ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం మొదలవుతుంది. ఇదే జరిగితే చైనాకు ఆర్థిక కష్టాలు తప్పవు.. చైనాకు ఆర్థిక కష్టాలు వస్తే యురోపియన్ దేశాల విలాసవంతమైన వస్తువుల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ రంగాల 50శాతం ఆదాయం డ్రాగన్ కంట్రీ నుంచి వస్తోంది. చైనా దగ్గర దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్ల అమెరికా బాండ్లు ఉన్నాయి. రుణాల చెల్లింపుల కోసం వీటి విక్రయాలు, లేదా యువాన్ విలువ తగ్గించడాలు చేయాల్సి రావచ్చు. ఇరుదేశాల సంబంధాలను ఇది దెబ్బతీయవచ్చు. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే చైనాలో వచ్చే చిన్న ఆర్థిక సంక్షోభం కూడా ఈ దేశాల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.