EPF Wage Ceiling Hike: ఉద్యోగుల సామాజిక భద్రతకు కీలకమైన ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి పడింది. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న వేజ్ సీలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు సమీక్షించి, 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ లిమిట్ మారలేదు… ఇంతకాలం జీతాలు, ధరలు పెరిగినా ప్రభుత్వం చలనం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని కేంద్రాన్ని ఆ వైపుగా ఆలోచించేలా ఆదేశాలు జారీ చేసింది.
READ ALSO: Anil Ravipudi Father: ఇది కదా అసలైన పుత్రోత్సాహం!
జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందుర్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త నవీన్ ప్రకాష్ నౌటియాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోన్న సామాజిక భద్రత పథకాల నుంచి రూ.15 వేలకు పైగా జీతం తీసుకునే ఉద్యోగులు బయటపడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వేజ్ సీలింగ్ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ (పెన్షన్ స్కీమ్), ఈడీఎల్‌ఐ (డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్) పథకాలకు తప్పనిసరి కంట్రిబ్యూషన్ చేయాల్సిన గరిష్ఠ జీతం లిమిట్. పిటిషనర్ తరఫు న్యాయవాదులు ప్రణవ్ సచ్దేవ, నేహా రాథీ వాదనలు వినిపించారు.
కేంద్రం, రాష్ట్రాలు నిర్దేశించిన మినిమం వేజ్ కూడా రూ.15 వేలకు పైనే ఉందని, అయినా 10 ఏళ్లుగా ఈపీఎఫ్ లిమిట్ మార్చలేదని వాదనలు వినిపించిన న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. “పార్లమెంట్ చట్టం ద్వారా ఇచ్చిన ఈపీఎఫ్ రక్షణను ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఓడించలేదు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతి ఏడాది లేదా రెండేళ్లకోసారి లిమిట్ పెంచాల్సిన బాధ్యత ఉంది” అంటూ సచ్దేవ వాదించారు. 2015లోనే పార్లమెంటరీ కమిటీ ఈ సిఫారసు చేసింది. మూడేళ్ల క్రితం ఈపీఎఫ్‌ఓ బోర్డు కూడా వేజ్ సీలింగ్ పూర్తిగా తొలగించాలని సూచించింది. అయినా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో ఆశలు చిగురిస్తున్నాయి. కోర్టు పిటిషన్‌ను మూసివేస్తూ, నౌటియాల్‌కు రెండు వారాల్లో కేంద్రానికి అధికారిక అభ్యర్థన సమర్పించాలని, ఆ కాపీతో పాటు కోర్టు ఆర్డర్ కూడా జత చేయాలని సూచించింది. దీనిపై కేంద్రం 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
ప్రస్తుత ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ ..
రూ.15 వేల నెల జీతం వరకు ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్‌ఐ పథకాలకు తప్పనిసరి సభ్యత్వం. 2014 సెప్టెంబర్ 1 తర్వాత జాబ్ జాయిన్ అయినవారు రూ.15 వేలకు పైగా జీతంపై ఈపీఎఫ్, ఈడీఎల్‌ఐలో చేరకపోవచ్చు. ఈపీఎస్ (పెన్షన్)లో కూడా సభ్యులు కాలేరు. అయితే ముందు తక్కువ జీతంపై చేరినవారు కొనసాగించవచ్చు. ఎంప్లాయర్ అనుమతితో ఎక్కువ జీతం ఉన్నవారు కూడా ఈపీఎఫ్‌లో చేరవచ్చు. 2026లో కూడా ఈపీఎఫ్ సీలింగ్ లిమిట్ ఇంకా రూ.15,000గానే ఉంది. 11 ఏళ్లుగా అయినా ఇందులో మార్పు లేదు. ఉద్యోగ సంఘాలు రూ.21,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు రూ.30,000 వరకు సూచిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంతో మే 2026 నాటికి నిర్ణయం రావొచ్చని అందరూ ఆశిస్తున్నారు. సీలింగ్ పెరిగితే ఉద్యోగులకు వచ్చే లాభం ఏంటో తెలుసా.. మరింత ఉద్యోగులు ఈపీఎఫ్, ఈపీఎస్ పథకాల్లో చేరి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ లాభాలు పొందుతారు. పెన్షన్ స్కీమ్‌లో చేరాలంటే తప్పనిసరిగా ఈపీఎఫ్ సభ్యత్వం ఉండాలి. 2014 తర్వాత ఎక్కువ జీతం ఉన్నవారు ఆప్షన్ ఇస్తేనే ఈపీఎఫ్‌లో చేరవచ్చు, కానీ పెన్షన్ లభించదు. పూర్తి 24% కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్‌కే వెళ్తుంది.ఈపీఎఫ్ సభ్యత్వంతో పెన్షన్ (రూ.15,000 లోపు జీతం ఉన్నవారికే పూర్తి లాభం), ఈడీఎల్‌ఐ ఇన్సూరెన్స్ వంటి అదనపు భద్రతలు లభిస్తాయి. ఈడీఎల్‌ఐ కంట్రిబ్యూషన్ కూడా రూ.15,000 సీలింగ్‌పైనే లెక్కిస్తారు. కార్మికుల భవిష్యత్తుకు ఈ నిర్ణయం కీలకం అని చెబుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్రం దీని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
READ ALSO: Yash Toxic Teaser: యష్ ఫ్యాన్స్.. ‘టాక్సిక్’ సర్‌ప్రైజ్‌కు రడీగా ఉన్నారా!