CXMT: ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల హవా కొనసాగుతున్న వేళ, చైనాకు చెందిన ఓ చిప్ తయారీ సంస్థ షేర్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం లిస్టింగ్ అయిన చాంగ్‌క్సిన్ మెమరీ టెక్నాలజీస్ (CXMT) షేర్లు తొలి రోజే దాదాపు 500 శాతం ఎగిసి పడటంతో పెట్టుబడిదారులు భారీ లాభాలు ఆర్జించారు. ఈ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ తన ఐపీఓలో ఒక్కో షేర్ ధరను 8.66 యువాన్‌గా నిర్ణయించింది. అయితే షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన వెంటనే షేర్లు అమాంతం ఎగబాకి 55.02 యువాన్ గరిష్ట స్థాయిని తాకాయి. అనంతరం కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి షేర్ ధర 49 యువాన్ వద్ద నిలిచి, ఐపీఓ ధరతో పోలిస్తే 465.82 శాతం లాభాన్ని నమోదు చేసింది.
ఈ అద్భుతమైన లిస్టింగ్‌తో CXMT మార్కెట్ విలువ సుమారు 3.3 ట్రిలియన్ యువాన్లు (487 బిలియన్ డాలర్లు)కు చేరుకుంది. దీంతో మెయిన్‌ల్యాండ్ చైనాలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు తొలి రోజే భారీ సంపద సృష్టించిన ఐపీఓగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 2016లో వ్యాపారవేత్త జూ యిమింగ్ స్థాపించిన CXMT ప్రధాన కార్యాలయం చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లోని హెఫే నగరంలో ఉంది. ఈ సంస్థ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (DRAM) చిప్‌లను తయారు చేస్తుంది. ఈ చిప్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల షేర్లపై ఇటీవల ఒత్తిడి నెలకొన్నప్పటికీ, CXMT మాత్రం అంచనాలను మించి బలమైన అరంగేట్రం చేసింది. మెమరీ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, పరిమిత సరఫరా కారణంగానే కంపెనీ షేర్లు ఈ స్థాయిలో దూసుకెళ్లాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లిస్టింగ్‌తో కంపెనీ వ్యవస్థాపకుడు జూ యిమింగ్ సంపద కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

