DA Hike 2026: దివాళీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. కరవు భత్యాన్ని (DA) మరో 3 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల డీఏ ఇప్పుడు 60 శాతం నుంచి ఏకంగా 63 శాతానికి పెరిగింది. ఈ తాజా పెంపుతో ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్లకూ భారీగా ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా, ఈ పెంపును జూలై 1 నుంచి వర్తింపజేయనుండటంతో నాలుగు నెలల ఏరియర్స్ కూడా ఉద్యోగుల చేతికి అందనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం కోటికి పైగా లబ్ధిదారులకు పండగ వేళ మోడీ సర్కార్ పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టయింది. ఈ కేబినెట్ నిర్ణయం కోసం ప్రభుత్వం సుమారు రూ. 10,016 కోట్లను వెచ్చిస్తోంది.
ఒక ఉద్యోగి కనీస వేతనం రూ. 18,000 ఉంటే, ఇప్పటివరకు రూ. 10,800 వస్తున్న డీఏ ఇకపై రూ. 11,340కి పెరుగుతుంది. అంటే నెలకు నేరుగా రూ. 540 చొప్పున ఏడాదికి రూ. 6,480 అదనంగా లాభం వస్తుంది. ఒకవేళ బేసిక్ వేతనం రూ. 25,000 అయితే నెలకు రూ. 750, ఏడాదికి రూ. 9,000 ప్రయోజనం ఉంటుంది. బేసిక్ సాలరీ రూ. 30,000 ఉన్నవారికి నెలకు రూ. 900, రూ. 40,000 ఉన్నవారికి నెలకు రూ. 1,200, అలాగే రూ. 50,000 బేసిక్ పే ఉన్నవారికి నెలకు రూ. 1,500 చొప్పున జీతంలో పెరుగుదల ఉంటుంది. కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా ఇదే తరహాలో డీఆర్ (Dearness Relief) పెంపు వర్తిస్తుంది. బేసిక్ పెన్షన్ రూ. 18,000 ఉన్నవారికి నెలకు రూ. 540, రూ. 30,000 ఉన్నవారికి నెలకు రూ. 900, రూ. 50,000 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి నెలకు రూ. 1,500 చొప్పున పెన్షన్ పెరుగుతుంది. ఇక ఎరియర్స్ విషయానికి వస్తే, జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నందున గత నాలుగు నెలలకు సంబంధించిన బకాయిలు (ఎరియర్స్) ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. బేసిక్ పే రూ. 18,000 ఉన్నవారికి రూ. 2,160, రూ. 30,000 ఉన్నవారికి రూ. 3,600, అదే రూ. 50,000 బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులకు రూ. 6,000 వరకు ఎరియర్ రూపంలో అదనపు మొత్తం అందనుంది.

