Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!

Byjus

Byjus

Byjus Story: ఇండియన్ ఎడ్‌టెక్ రంగంలో ఆకాశంలో ఒక తారగా వెలుగు వెలిగి, అపారమైన సంపదను సృష్టించిన బైజూ రవీంద్రన్ ప్రస్థానం ఇప్పుడు జైలు శిక్ష వరకు చేరుకుంది. ఒక సామాన్యుడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 22 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇప్పుడు కోర్టు ధిక్కరణ నేరం కింద సింగపూర్ న్యాయస్థానంలో ఆరు నెలల జైలు శిక్ష, దాదాపు 70,500 డాలర్ల (సుమారు రూ. 59 లక్షలకు పైగా) జరిమానా ఎదుర్కోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక సాధారణ టీచర్‌గా మొదలై అంతర్జాతీయ బిలియనీర్‌గా ఎదిగి, శిఖరాగ్రం నుంచి శూన్యానికి ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కేరళ పల్లెటూరు నుంచి ఐఐఎం టాపర్ వరకు..
బైజు రవీంద్రన్ 1980లో కేరళలోని కన్నూర్ జిల్లా, అళికోడ్ గ్రామంలో జన్మించారు. ఒక మలయాళ మాధ్యమ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ కంప్లీట్ చేశారు. తర్వాత వృత్తిరీత్యా షిప్పింగ్ కంపెనీలో ఇంజినీర్‌గా యూకేలో పనిచేసినప్పటికీ, బోధనపై ఉన్న మక్కువతో భారత్‌కు తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరంగా ఐఐఎం ప్రవేశ పరీక్ష (CAT) రాసిన ప్రతిసారీ 100 పర్సంటైల్ సాధించి తన మేధస్సుతో అబ్బుర పరిచారు. అయితే ఐఐఎంలో చేరడం కంటే, విద్యార్థులకు పాఠాలు చెప్పడమే ఉత్తమం అని నిర్ణయం తీసుకొని, తన భార్య దివ్యా గోకుల్‌నాథ్‌తో కలిసి 2011లో ‘బైజూస్’ సంస్థకు పునాది వేశారు.

శిఖరాగ్రం నుంచి శూన్యానికి..
2015లో స్టార్ట్ అయిన ‘బైజూస్ – ది లెర్నింగ్ యాప్’ విద్యా రంగంలో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ విద్యకు ఆదరణ పెరగడంతో కంపెనీ విలువ 22 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) చేరింది. కానీ తర్వాత కాలంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో బైజూస్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నిధుల కొరత వేధించడం, ఖర్చులు పెరగడంతో కంపెనీని కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో ఫెమా ఉల్లంఘనల ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కూడా నిర్వహించింది. అలాగే 2023లో కంపెనీలో కీలక డైరెక్టర్లు రాజీనామా చేయడంతో మార్కెట్లో కంపెనీ విశ్వసనీయత దెబ్బతింది. 2022లో 60 వేల మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2024 నాటికి కేవలం 14 వేలకు పడిపోయింది.

జైలు శిక్షకు దారితీసిన పరిస్థితులు
ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే రవీంద్రన్ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎంతో గౌరవం పొందిన ఈ ‘గ్లోబల్ టీచర్’, నేడు విదేశీ పెట్టుబడిదారుల ఫిర్యాదులు, న్యాయపరమైన చిక్కులతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా రంగంలో విప్లవం తెచ్చిన ఒక సంస్థ ఇలా దివాలా అంచున నిలబడటం స్టార్టప్ ప్రపంచంలో ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోయిందని అంటున్నారు.